బీజింగ్ : ఈ ఏడాది జి-20 సదస్సును నిర్వహించడంలో భారత్‌కు మద్దతిస్తున్నామని చైనా మంగళవారం పేర్కొంది. ఈ వారంలో న్యూఢిల్లీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు జయప్రదం కావడానికి గానూ అన్ని పక్షాలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా వున్నామని తెలిపింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు బదులుగా ప్రధాని లీ కియాంగ్ జి-20 సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. జి-20 గ్రూపు కార్యకలాపాలకు చైనా ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుందని, చురుకుగా పాల్గొంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జి-20 ప్రధాన వేదిక అని ఆమె వ్యాఖ్యానించారు.
సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించకుండా, ఇరు దేశాల మధ్య సంబంధాలు మొత్తమ్మీద సుస్థిరంగా వున్నాయని ఆమె పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయన్నారు. చైనా-భారత్ మధ్య సంబంధాలు మెరుగవుతూ వుండడం ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు ఎంతో ముఖ్యమని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచి, ముందుకు తీసుకెళ్ళడానికి భారత్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు. సెప్టెంబరు 5-8 తేదీల్లో జకార్తాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు హాజరైన చైనా ప్రధాని అక్కడ నుండి నేరుగా న్యూఢిల్లీకి వస్తారు.