Aug 14,2023 07:35

అవును ఇది నా స్వాతంత్య్రమే
బ్యాంకుల్లో అప్పులు కుప్పలు చేసి
ఐపీలతో ఆస్తులు పేరేసి చేరేసుకునే
పెద్దలకు 'రైటాఫ్‌' సిత్రాల సత్కారాలతో
వందనం చేసే ఇది నా స్వాతంత్య్రమే!

కష్టాన్ని నమ్మి ఇచ్చే జీతం, కూలీతో
సంపద పెంచే జాతి ఫల వృక్షాలకు
జీతాల కోత, ధరల పెంపు, పన్ను మోత
విద్యుత్‌ షాక్‌ లతో కూల్చివేసే దేశం
అవునవును ఇదీ నా స్వాతంత్య్రమే!

సంపద, సంపన్నుల మెరుపులు ఎగరేసి
ఆకాశానికి నక్షత్రాలై ఎగిరే తీరు చూపి
ఆగ్ర రాజ్యాల పక్కన ఎదిగిన
రాజ్యంగా చూపడంపై సిగ్గెందుకూ
ఇది కూడా నా స్వాతంత్య్రమే!

కష్టజీవి నష్టజీవిగా భ్రష్టజీవిగా మిగిలినా
పేదరికంలో చీకి చితికే ఉరితాళ్ళతో ఉన్నా
జెండా తాళ్ళను పెనవేస్తూనే ఉన్నాడు
రేపు బోలో స్వాతంత్య్ర భారతికి జై అనాలిగా!
ఏళ్ళకేళ్ళు అంటున్న ఇదే నా స్వాతంత్య్రం!
 

- ఉన్నం వెంకటేశ్వర్లు