పిల్లలు కొత్త స్కూళ్లలోకి, కొత్త తరగతుల్లోకి మారే సమయం ఇది. ఇప్పుడే కొత్త స్నేహితులూ పరిచయం అవుతారు. వారితో స్నేహం ఏర్పడితే ప్రతిరోజూ స్కూలుకు వెళ్లాలనిపిస్తుంది. స్కూల్లో ఎంతమంది స్నేహితులు దొరికితే క్లాస్ వాతావరణం అంత బాగుంటుంది. పాఠాలు కూడా ఆసక్తిగా వింటారు. అందుకు తల్లిదండ్రులే పిల్లలకు మానసికంగా తయారుచేయాలి.
- పాత స్కూలు, పాత స్నేహితులు ఉండరని బెంగపడకుండా ముందుగానే వారిలో ఉత్సాహం కలిగించేలా మాటలు చెప్పాలి.
- కొత్తవాళ్లను చిరునవ్వుతో పలకరిస్తే ఎవరైనా సరే మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తారు. కొత్త పిల్లలతో మాట్లాడేటప్పుడు చిన్న నవ్వు నవ్వితే స్నేహానికి మొదటి అడుగులా ఉంటుంది.
- తెలియని వారు, కొత్త పిల్లలు అని వారి పక్కన కూర్చోకుండా దూరంగా వెళ్లకూడదు. మొదట పరిచయం చేసుకునేటప్పుడు తప్పకుండా 'హారు' లేదా 'హలో' లాంటి పదాలు అనడం వల్ల ఎదుటివారిలో స్నేహపూర్వక అనుబంధానికి బీజం పడుతుంది. క్లాసులో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
- స్నేహం ఏర్పడుతున్న మొదట్లో ఎదుటవారు ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలి. ఆ తర్వాతే మాట్లాడాలి.
- కొత్త స్నేమితులతో కలిసి ఆటల్లో పాల్గొనమని చెప్పండి. ఓడినా...గెలిచినా స్ఫూర్తిగా తీసుకోమని చెప్పాలి.
- పిల్లల ప్రవర్తన నచ్చి కొంత సమయంలోనే స్నేహితులవుతారు. వారిలో సున్నిత మనస్కులు, అల్లరి పిల్లలూ ఉంటారు. టీంగా ఏర్పడినప్పుడు కొన్ని పొరపాట్లు, తప్పులు జరుగుతాయి. అయినా నొప్పించేట్లు మాటలు తూలకూడదు. దూరం పెట్టకూడదు. కలిసిమెలిసి ఉండాలని చెప్పాలి.










