
చిన్న పిల్లల మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి. అలాంటి అమాయకపు మాటల ప్రాయంలోనే అద్భుత ప్రతిభ కనబరిస్తే ఔరా అంటాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడేనికి చెందిన వికాస్ .. చిన్న వయసులో విశేష ప్రతిభ చూపిస్తున్నాడు. వివిధ దేశాలు -రాజధానుల పేర్లు, వాటి జాతీయ జెండాలు; శాస్త్రవేత్తలు, రాజకీయ, జాతీయ నాయకుల పేర్లు, శరీరభాగాలు.. శరవేగంగా చెప్పటమే కాదు; వివిధ సామాజిక అంశాల మీదా మట్లాడుతూ అందరికీ ఆకట్టుకుంటున్నాడు.
లంకా వెంకట గంగాధరరావు, మైథిలి దంపతుల కుమారుడు వికాస్. గంగాధరరావు కళాశాలలు, పాఠశాలల్లో మోటివేషన్ క్లాసులు బోధిస్తుంటారు. మైథిలి గృహిణి. వెదురు పావులూరు సెయింట్ జోసఫ్ పాఠశాలలో వికాస్ మూడో తరగతి చదువుతున్నాడు. ఏ విషయం చెప్పినా, విన్నా అర్థం చేసుకుని ఇట్టే గ్రహించే శక్తి వికాస్‌లో ఉందన్న విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఒకటో తరగతి నుంచే పర్యావరణం, దేశాలు, శాస్త్రవేత్తలు, రాజధానులు, పండ్లు, జంతువులు, శరీరంలో అవయవాల పేర్లు ... ఇలా అనేక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. వికాస్‌లోని సునిశిత పరిశీలనా జ్ఞానాన్ని, ఏక సంధాగ్రాహి లక్షణాలు, పట్టుదల, ప్రశ్నించే తత్వాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఇల్లే వేదికగా నిత్యం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
వేదిక ఏదైనా ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖలు, ఎపి పర్యాటకాభివృద్ధి సంస్థ, తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా వారి సహకారంతో జయహో భారతీయం పేరుతో జరిగిన వేడుకల్లో వికాస్‌కు బాలరత్న పురస్కారాన్ని అందజేశారు. 2021, ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రామ్మోహన రారు గ్రంథాలయం వారు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో 'మాతృభాష తెలుగు ప్రాముఖ్యత- కనుమరుగౌతున్న ప్రాంతీయ భాషల ఔన్నత్యం' గురించి వికాస్ వివరించాడు. ఒకటో తరగతిలోనే పదో తరగతి విద్యార్థులతో పోటీపడి రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించాడు. సిప్ అబాకస్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి మానసిక గణిత విశ్లేషణ పోటీలో (లెవల్ 4ఎ)లో రన్నర్‌గా నిలిచాడు. బాలోత్సవ్, జనవిజ్ఞాన వేదిక పోటీల్లోనూ పాల్గొని బహుమతులు సాధించాడు. వివిధ వేదికలపై ప్రశంసలు పొందడంతో పాటు- జ్ఞాపికలు, సర్టిఫికెట్లు, మెడళ్లు, మెమొంటోలు ఎన్నో సొంతం చేసుకున్నాడు.
సామాజిక చైతన్య కార్యక్రమాల్లోనూ ...
నాటి కృష్ణా జిల్లా కలెక్టర్లు ఎఎండి ఇంతియాజ్, పి.రంజిత్ భాష ఇచ్చిన స్వచ్ఛ కృష్ణ పిలుపులో భాగంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు, కాలుష్యాలతో కలిగే దుష్పరిణామాల గురించి వికాస్ ప్రచారం చేశాడు. ప్లాస్టిక్ రహిత సమాజానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మూడేళ్లప్రాయంలోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో వివరించాడు. సుమారు 7.45 నిముషాలపాటు ప్రసంగించి పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాడు. పారిశ్రామికీకరణ, వ్యవసాయం, స్వాతంత్య్రం, గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యం, దేశ ప్రముఖుల సేవలు, బాలల హక్కులు, కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అలవోకగా మాట్లాడతాడు. తల్లి మైథిలి పర్యవేక్షణలో సామాజిక అంశాలపై వీడియోలు చేస్తూ, యూ ట్యూబ్ ద్వారా లక్షలాది మంది వీక్షకులను సంపాదించుకున్నాడు. రూబిక్ క్యూబ్స్‌ని సాల్వ్ చేయటం, స్కేటింగ్ వంటి వాటిలోనూ వికాస్‌కు పరిజ్ఞానం ఉంది. ఈ చిన్నారి మరింతగా రాణిస్తూ, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఆశిద్దాం.
- నెక్కలపు శ్రీనివాసరావు, గన్నవరం, ప్రజాశక్తి విలేకరి
ఏదైనా ఇట్టే పట్టేస్తాడు...
మనం ఏది చెప్పినా వికాస్ ఇట్టే పట్టేస్తాడు. అందుకే చిన్ననాటి నుంచే వివిధ విషయాలను తెలియజెప్పేవాళ్లం. టీవీల ద్వారా వినిపించటం, ల్యాప్‌టాప్‌లో స్లైడ్లు చూపించటం, ప్రపంచం, దేశాలు, రాజధానులు, టెక్నాలజీ, ల్యాబ్, శరీరంలోని అవయవాలు ఇలా ఏది చెప్పినా, చూపించినా అతడి బ్రెయిన్‌లో నిక్షిప్తం అయిపోతుంది. గతంలో చెప్పినా, విన్నా, చూసినా ఆయా అంశాలపై అలవోకగా చెప్పేస్తాడు.
- మైథిలి, వికాస్ తల్లి.
పిల్లలూ, మీ కథలు, బొమ్మలూ పంపండి. ఇదిగో మెయిల్ ఐడీ: chinnaarips@gmail.com