Aug 19,2023 21:15

ప్రమాదాల నివారణకు ఏటా స్పెషల్‌ డ్రైవ్‌
సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమలన్నింటిలో థర్డ్‌ పార్టీ సేప్టీ ఆడిట్‌ జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కెమికల్‌ యాక్సిడెంట్లు నివారణపై శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సిఎస్‌ మాట్లాడుతూ రసాయన సంబంధిత పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి పరిశ్రమలన్నింటిలో పాటిస్తున్న సేప్టీ ప్రొటోకాల్‌ , భద్రతా చర్యలపై థర్డ్‌ పార్టీ సేప్టీ ఆడిట్‌ జరగాలని పునరుద్ఘాటించారు. అదే విధంగా వివిధ రసాయనాలు వినియోగించు పరిశ్రమల్లో వాటి ఘాఢతను, స్వభావాన్ని ముందే పరీక్షించి తెలుసుకునేలా ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్రమాదకరమైన పరిశ్రమల్లో ప్రతి ఏటా ప్రమాదాల నివారణపై ప్రత్యేక మాల్‌ డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు రాష్ట్ర, జిల్లా, స్ధానిక క్రెసెస్‌ గ్రూపులు తరచూ సమావేశమై పారిశ్రామిక ప్రమాదాల నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాలు భద్రతా చర్యలు, ప్రొటోకాల్‌ను సమీక్షించాలని సూచించారు. గత రెండేళ్ల కాలంలో 11 ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో మరలా అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్‌ డి, చంద్రశేఖర్‌ వర్మ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సమావేశం అజెండా అంశాలను వివరిస్తూ 1948 ఫ్యాక్టరీల చట్టాన్ని అనుసరించి 1986 కెమికల్‌ యాక్సిడెంట్ల నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర , జిల్లా, స్థానిక స్థాయిల్లో క్రెసైస్‌ గ్రూపులు ఏర్పాటయ్యాయన్నారు. క్రెసెస్‌ గ్రూపునకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్ధాయికి డిప్యూటీ చీఫ్‌ ఇనెస్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, స్దానిక గ్రూపునకు ఆర్‌డిఓ అధ్యక్షులుగా ఉండి తరచూ ప్రమాదాలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనరు కె.ప్రవీణ్‌ కుమార్‌, రాఫ్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, సిడిఎంఎ కోటేశ్వరరావు, ఎపిఎస్‌పి డిఐజి బి.రాజకుమారి, రాష్ట్ర ఫైర్‌ సర్వీసెస్‌ శాఖ డైరెక్టర్‌ డి.మురళిమోహన్‌, పిసిబి జాయింట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ భాస్కరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.