
'చీమను చూసి క్రమశిక్షణ... భూమిని చూసి ఓర్పు...చెట్టును చూసి ఎదుగుదల... ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో...' అని అంటారు పెద్దలు. ఇది అక్షరాల నిజం చేస్తున్నారు ఈ ఉపాధ్యాయులు. తరగతి గదిలో బోధన విద్యార్థి కేంద్రంగా జరగాలంటున్న ఈ ఉపాధ్యాయులు ఆచరణలో వివిధ నైపుణ్య పద్ధతులను అవలంబించటం ద్వారా ఉన్నతంగా ఎందరినో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. ఆటపాటలతో చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి కలిగించొచ్చునని ఉమాగాంధీ నిరూపించారు. విద్యార్థులను అక్కున చేర్చుకోవటం ద్వారా అదనపు సమయం కేటాయించటం ద్వారా చదువుతో వెనుకబడిన వారిని కూడా ముందువరుసలో నిలపొచ్చునని ఆచరణ ద్వారా రుజువు చేశారు మేకల భాస్కరరావు. ఆటపాటలతో సంతోషాత్మక బోధన ద్వారా అత్యంత సులభంగా చదువు చెప్పొచ్చునని ఆచరణలో నిజం చేస్తున్నారు శెట్టెం ఆంజనేయులు.. ఈ ముగ్గురూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఐదోతేదీన ఢిల్లీలో జరిగే ప్రత్యేక వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోనున్నారు. వీరి విద్యాబోధన ఏ విధంగా సాగుతుందో వారి మాటల ద్వారానే తెలుసుకుందాం.

పాఠాలే పాటలుగా ...
ఆటపాటలతో చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి కలిగించి... వారిలో మనోవికాసానికి బాటలు వేయడం కూడా నా వృత్తిలో భాగం చేసుకున్నా. మా నాన్న రామకేశవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేశారు. విశాఖ జిల్లా భీమిలి మాది. అమ్మ భువనేశ్వరి గృహిణి. ముగ్గురు సంతానంలో నేను పెద్దదాన్ని. తమ్ముళ్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే స్థిరపడ్డారు. నాన్న కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, వారితో మమేకమవుతూ పాఠాలు చెప్పేవారు. 1998 డీఎస్సీలో ప్రైమరీ స్కూల్ టీచర్‌గా విజయనగరం పట్టణ పరిధిలోని కొత్త మజ్జిపేట పాఠశాలలో చేరా. ఆ పాఠశాల అప్పుడే ప్రారంభం కావడంతో భవనం కూడా లేదు. పూరిపాకలోనే పాఠాలు చెప్పాల్సివచ్చింది. చుట్టుపక్కల పాములు, పురుగులు వంటివి వస్తే వాటితో పిల్లలు ఆడుతూ ఉండేవారు. పిల్లలను తరగతి గదిలోకి వచ్చి కూర్చోవాలని చెప్పినా పట్టించుకునేవారు కాదు. ఆ చిన్నారుల తల్లులు వచ్చి వారి బాధను చెప్పుకునేవారు. దాంతో ఎలాగైనా సరే... పిల్లలను తరగతి గదిలో కూర్చోబెట్టాలనుకున్నా. అందుకు నాన్న అనుసరించిన విధానాన్ని ఎంచుకున్నా. పిల్లలు చేసే అల్లరి, చిలిపి చేష్టలను పరిశీలిస్తూ, వాటినే పాటలుగా మార్చి వారి ముందు పాడేదాన్ని. వారు చేసిన పనులే పాట రూపంలో పాడడంతో వారిలో ఆసక్తి పెరిగి, తరగతి గదిలోకి వచ్చి కూర్చుని వినేవారు. - మురహరరావు ఉమాగాంధీ, శివాజీపాలెం ప్రాథమిక పాఠశాల సెకండరీగ్రేడ్ టీచర్, విశాఖపట్నం.

పిల్లల స్థాయికి వెళ్లి ...
విద్యార్థుల ఆసక్తులను గుర్తించి విద్యాబోధన చేస్తున్నాం. క్రీడాపద్ధతి ఆచరిస్తున్నాం. పిల్లలకు పాఠాలను ఇష్టపడేలా చెప్పాలి. ఆట, పాటలతో చెబితే వినేందుకు ఆసక్తి చూపిస్తారు. వాళ్ల స్థాయికి టీచర్ దిగిపోవాలి. పాఠాలతోపాటు జాతీయ పండగలు, జాతీయోద్యమంలో కీలక ఘట్టాల గురించి కూడా వారికి అవగాహన కల్పిస్తున్నాం. పాఠాలకు అనుగుణంగా పాత్రలు రూపొందించి చెబుతుండటంతో పిల్లల్లో బాగా ఆసక్తి పెరుగుతుంది. క్రీడాపద్ధతి, కథలు చెప్పించటం, జట్టు కృత్యాలు, స్పెల్లింగ్ టెల్లింగ్, బొమ్మలు గీయించటం, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష వీక్షణలకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్లాక్‌బోర్డులు, టీచింగ్ మెటీరియల్స్, ప్లోచార్డులు, ఆల్బమ్‌లు వంటివి చేసి చూపించటం ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో అంశాలపై సమగ్రమైన అవగాహన వస్తోంది.

ప్రతి విద్యార్థి తనలోని భావాలు, ఆసక్తులు ఎలాంటి భయంలేకుండా వ్యక్తం చేయగలుగుతున్నారు. స్వేచ్చగా తన మనసులో వచ్చిన ఆలోచనలను వ్యక్తపరుస్తున్నారు. ఆర్ట్స్, డిజిటల్ క్లాసులు వంటివి కూడా ఏర్పాటుచేస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారందరికి అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణలు కొనసాగిస్తున్నాం.
- మేకల భాస్కరరావు
కొండాయపాలెం దళితవాడ నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

ఆటపాటలతో విద్యాబోధన
సంతోషాత్మక విద్యాబోధన ద్వారా ప్రతి ఒక్కరూ కృత్యాల్లో పాల్గొనటం, మాట్లాడటం,చర్చించటం చేయిస్తున్నాం. తద్వారా ప్రతి ఒక్కరూ తమ అనుభవాలు, ధైర్యంగా చెప్పటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ సైన్స్‌కు సంబంధించిన ఒక్కో కొత్త పదాన్ని నేర్పుతున్నాం. ఎవరికి సబ్జెక్టు పాఠాలు అర్థమవుతున్నాయి. ఎవరికి కావటం లేదో తెలుసుకుంటున్నాం. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక కేంద్రీకరణ ఉంచటం వల్ల వారు అర్థంకాకపోతే వెంటనే అడితే స్వేచ్ఛ ఏర్పాటుచేశాం. నేను విశ్లేషణ (అనాలసిస్), ప్రశ్నించటం (క్వశ్చనింగ్), భావప్రసరణ (ట్రాన్ఫరైజేషన్) వంటి పద్ధతుల ద్వారా బోధన అందిస్తున్నా. సైన్స్, లెక్కలు వంటి సబ్జెక్టులను తరగతిలో గదిలోనే కాకుండా క్రీడామైదానాలు, ఆవరణలు, క్షేత్రస్థాయి సందర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. సైన్స్‌విజ్ఞానపరమైన కృత్యాలను వ్యక్తిగతంగానూ, జట్టు కృత్యంగా చేయిస్తూ మెరుగైన ఫలితాలు చేసిన వారికి బహుమతులు ఇవ్వటం ద్వారా ప్రోత్సహిస్తున్నా.

సమాజం, ప్రకృతి, కుటుంబం, జీవితం, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, లెక్కలకు సంబంధించి కూడికలు, గుణింతాలు, తీసివేతలు, భాగహారాలు, ఆరోహణ, అవరోహణ అంశాలు ఇలా ప్రతి ఒక్క దాని గురించి చెప్పించటం వల్ల సులభంగా గుర్తుంటుంది. ఆటల్లో గెలుపు ఓటములు, ఆలోచనల్లో అనుకూల, వ్యతిరేక అంశాల నిర్వహణ, సైన్స్, గణితంలో సూత్రాలు, పీరియాడిక్ టేబుళ్లు వంటి అంశాలపై కృత్యపద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం.
- శెట్టెం ఆంజనేయులు
మాసాపేట హైస్కూలు సైన్స్ ఉపాధ్యాయుడు, రాయచోటి పట్టణం, అన్నమయ్య జిల్లా