Dec 05,2022 10:42
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పోలవరం నిర్వాసితులు తీవ్ర అసంతృప్తి
  • ప్రాజెక్టు పనులపైనే శ్రద్ధ.. పునరావాసం, పరిహారం పంపిణీపై అశ్రద్ధ
  • పాలకులు స్పందించకపోతే పోరాటాలు ఉధృతం
  • ప్రాజెక్టు నిర్వాసితుల స్పష్టీకరణ

ప్రజాశక్తి - పశ్చిమడెస్క్‌ : పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పగానే పనులెంత వరకూ వచ్చాయని అంతా అడుగుతుంటారు. అయితే ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులకు సంబంధించిన పునరావాస కాలనీలు, పరిహారం, ప్యాకేజీ ఎంత వరకూ అందించారనేది ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఫలితంగా అటు ప్రకృతి, ఇటు ప్రభుత్వ విధానాలతో పోలవరం నిర్వాసితులు తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
         పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. పలుమార్లు శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఎట్టకేలకు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో భూసేకరణ చేపట్టారు. కాల్వలు తవ్వారు. తర్వాత చంద్రబాబు హయాంలో ఈ పనులు చురుగ్గా సాగాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ పనులు నేరుగా చేపట్టాల్సి ఉంది. అయితే తామే పనులు నిర్వహిస్తామని నాడు సిఎంగా ఉన్న చంద్రబాబు బాధ్యత తీసుకున్నారు. పనులిచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంగాని, బాధ్యత తీసుకున్న రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంగాని నిర్వాసితుల విషయంపై స్పష్టత లేకుండా ముందుకు సాగాయి. కనీసం భూసేకరణ చట్టంతోపాటు గిరిజన చట్టాలను తుంగలోకి తొక్కి పోలవరం మండలంలోని కొన్ని గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించారు. సర్వం కోల్పోయి నిర్వాసితులవుతున్న గిరిజనులకు రూపాయి పరిహారం, ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. అయితే గిరిజనుల తరలింపునకు ఖర్చు చేశామంటూ పెద్దఎత్తున సొమ్మును అధికార యంత్రాంగం స్వాహా చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయినా నాడు ప్రభుత్వం స్పందించిన దాఖలాల్లేవు. పనుల పురోగతి పరిశీలనకు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పుడల్లా నిర్వాసితులు త్యాగధనులు అనడం తప్ప పరిహారం, ప్యాకేజీ, పునరావాసంపై కేంద్రంను నిలదీసిన పరిస్థితిగాని, అవి క్షేత్రస్థాయిలో ఏమేర అమలవుతున్నాయో పరిశీలించిన దాఖలాలుగాని లేవు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీరూ అలానే ఉంది. కనీసం నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు సైతం నీటి మూటలయ్యాయి. రాజశేఖర్‌రెడ్డి హయాంలో సేకరించిన భూములకు రూ.ఐదు లక్షల పరిహారం, పునరావాసం, ప్యాకేజీ, పరిహారం అన్నీ సకాలంలో పూర్తి చేస్తామని నాడు జగన్‌ పదేపదే చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చాక కానరాని పరిస్థితి ఉంది. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణంతో విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో గోదావరికి వరద వచ్చినప్పుడు పరిస్థితి భయానకంగా ఉంటోంది. సమీపంలో ఉన్న కొండలు, గుట్టలపైకెక్కి తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్యాకేజీ చెల్లింపునకు మండలం మొత్తం యూనిట్‌గా తీసుకోవాలని ఎపి గిరిజన సంఘం, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, నిర్వాసితుల సంఘం, సిపిఎం చాలాకాలంగా కోరుతూనే ఉన్నాయి. కాంటూర్‌ లెక్కలు సక్రమంగా లేవని చెప్పినా పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలు ప్రభుత్వ లోపాలను బట్టబయలు చేశాయి. నిర్వాసితుల కోసం కివ్వాకలో నిర్మించిన పునరావాస కాలనీ జలమయం కావడం అందరినీ ఆలోచింపజేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే వచ్చిన వరదలకు నిర్వాసిత కాలనీయే నీట మునిగిందంటే ప్రభుత్వ తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
          పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కుక్కునూరు మండలం మొత్తం ముంపులో ఉంది. అయితే ప్రభుత్వం 41.15 కాంటూర్‌ ప్రకారం మొదటి విడతలో ఎనిమిది గ్రామాలు ముంపులో ఉన్నాయని, వాటికి ముందుగా పరిహారం చెల్లించి కాలనీలకు తరలిస్తామని చెబుతోంది. 45.75 కాంటూర్‌ ప్రకారం మిగిలిన గ్రామాలను రెండో దశలో తరలిస్తామని ప్రకటించింది. ఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీ నిర్వాసిత కుటుంబానికి రూ.పది లక్షల ప్యాకేజీ, 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం, గతంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎకరాకు రూ.లక్షా పదిహేను వేలు పరిహారం ఇచ్చిన భూముల రైతులకు అదనంగా రూ.ఐదు లక్షలు ఇస్తానన్న జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వాటి మాటే మరిచారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మండలం మొత్తం యూనిట్‌గా తీసుకుని పరిహారం చెల్లించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పరిహారం ఇచ్చే తేదీనే కటాఫ్‌ తేదీగా నిర్ణయించి పరిహారం చెల్లించాలని కోరుతూ మండల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, వేలేరు గ్రామం నుండి కోయిదా వరకూ పాదయాత్ర, దామరచర్ల నుండి గొమ్ముగూడెం వరకూ సైకిల్‌ యాత్ర వంటి రూపాల్లో నిర్వాసితులు ఆందోళనలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు, మండల బంద్‌, ఐటిడిఎ ముట్టడి, కలెక్టరేట్‌ ముందు ధర్నా వంటి కార్యక్రమాలు చేపట్టినా అధికారుల హామీలు తప్ప నేటికీ పరిహారం అందలేదు. పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి కాలేదు.