- ఏడాదిలో 2 లక్షల మంది నిర్వాసితులు
- ఐదేళ్లలో పది లక్షల మంది
- వీరిలో సగానికన్నా తక్కువ మందికే పునరావాసం
న్యూఢిల్లీ : వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరుతో ప్రజలను వారి సొంత స్థలాల నుండి బలవంతంగా తరలించే ప్రక్రియ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. బాధితుల ఆంగీకారంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాలు ఇళ్లను కూల్చివేసి, భూములను స్వాధీనం చేసుకుంటుండటంతో సర్వాస్వాన్ని కోల్పోయి రోడ్డున పడుతున్న వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. ఇలా నిర్వాసితులుగా మారిన వారికి నష్టపరి హారం చెల్లించడంతో పాటు, పునరావాసం ఏర్పాటు చేయాలంటూ చట్టం చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకోసం భూములిచ్చిన వారికి ఇప్పటి వరకు పునరావాస పనులు పూర్తికానీ విషయం తెలిసిందే! దేశ వ్యాప్తంగా ఈ తరహా బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్‌వర్క్ (హెచ్‌ఎల్‌ఆర్‌ఎన్) అనే సంస్థ 'ఫోర్స్‌డ్ ఎవిక్షన్స్ ఇన్ ఇండియా' పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక్క 2021వ సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా 2,07,106 మందిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులుగా మార్చాయి. కేంద్ర, వివిధ ప్రాజెక్టుల కోసం వీరిని తమ సొంత స్థలాల నుండి బల ప్రయోగం చేసి ఖాళీ చేయించారని వీరికి సంబంధిం చిన 36,480 నివాస గృహాలను కూల్చివేశారు. 2017 నుండి 2021 వరకు ఇలా 10 లక్షల మందికి చెందిన ఇళ్లను ప్రభుత్వాలు బలవంతంగా తొలగిం చాయి. ఈ కాలంలో 1,91,070 ఇళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చివేశాయి. వీరిలో 59 శాతం మందికి ఇప్పటికీ ఎటువంటి పునరావాస సాయమూ ప్రభుత్వాల నుండి అందలేదు. దీంతో వీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ సాయం కోసం తిరుగుతున్నారు.
కరోనా కష్టకాలంలోనూ....
దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న కరోనా కష్టకాలంలోనూ ఈ బలవంతపు తరలింపు ఆగలేదు. అంతకు ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే కొంత తగ్గినప్పటికీ ప్రజానీకంపై ప్రభుత్వాల బలప్రయోగం కొనసాగింది. తొలివిడత కరోనా విజృభించి, దేశ వ్యాప్తంగా ప్రజానీకం భయోత్పాతానికి గురైన 2020వ సంవత్సరంలో 36వేలకు పైగా ఇళ్లను బలవంతంగా కూల్చివేసి, 1.70 లక్షల మందిని నిర్వాసితులుగా మార్చారని నివేదికలో పేర్కొన్నారు.
27 శాతం మంది మురికివాడల ప్రజలు
నివాస ప్రాంతాల నుండి బలవంతపు తరలింపు నకు గురవుతున్నవారిలో 27 శాతానికి పైగా వివిధ నగరాలు, పట్టణాల్లో నివసించే మురికి వాడల ప్రజానీకం ఉన్నారు. ఆక్రమణల తొలగింపు, నగరాల సుందరీకరణ, స్లమ్ క్లియరెన్స్ పేరుతో వీరి నివాస స్థలాలను కూల్చివేస్తున్నారని, ఆ తరువాత ఎటువంటి ప్రత్యామ్నాయాలను చూపడం లేదని నివేదికలో పేర్కొన్నారు. నిర్వాసితులుగా మారిన వారి లో 28 శాతం మంది ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనార్టీలు, వలసకూలీలు వంటి బడగు ప్రజానీకం ఉన్నారు.
కక్షపూరిత కూల్చివేతలు
ప్రాజెక్టులు, అభివృద్ధి పనులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కూల్చి వేతలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా చర్యలు చట్ట వ్యతిరేకం, హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ప్రభుత్వాలు ఖాతరు చేయడం లేదని, వీరికి పునరా వాస బాధ్యతలను పట్టించుకోవడం లేదని పేర్కొంది. 2022వ సంవత్సరలో జులై నెల వరకు 25,800 ఇళ్లను కూల్చివేసి, 1,24,450 మందిని దేశవ్యాప్తంగా రోడ్డున పడేశారని, వీటిలో అత్యధిక కూల్చివేతలు ప్రభుత్వాల కక్షపూరిత వైఖరి కారణంగానే జరిగాయని నివేదిక తెలిపింది.











