Jul 28,2023 08:16

వర్షాకాలంలో చిటపట చినుకుల మధ్య వేడివేడిగా ఏమైనా చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. కానీ, శరీరానికి పోషకాలు అందించే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, పండ్లు తినడం ఉత్తమం. ఈ సీజన్‌లో దొరికే పండ్లు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పనస : పనస పండులోని తొనలతోపాటుగా పచ్చిది కూడా మనం తినొచ్చు. రోజు వారి ఆహారంలో ఎన్నో రకాలుగా తయారు చేసుకొని తినొచ్చు. పనసలో ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గింజలను కూడా తినొచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి. ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.

సీతాఫలం : సీతాఫలం వర్షాకాలంలోనే లభిస్తుంది. ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి. ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌ బి 6 అధికంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలని నయం చేయడానికి సీతాఫలం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షించుకోవడానికి కెరోటినాయిడ్లు ఎంతో అవసరం.

నేరేడు : నేరేడు పండ్లలో కేలరీలు తక్కువ. ఇనుము, ఫోలేట్‌, పొటాషియం, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి చాయిస్‌. అజీర్తిని తగ్గిస్తాయి కూడా.

చెర్రీస్‌ : వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే పండ్లలో చెర్రీస్‌ ఒకటి. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే పండ్లు ఇవి. మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

అరటిపండ్లు : విటమిన్లు ఎక్కువగా ఉండే అరటిపండు ఎంతో ఆరోగ్యం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి సమస్యలను పోగొడుతుంది. పిల్లలకు అరటిపండ్లు చాలా మంచివి. రోజుకో పండైనా తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.

యాపిల్‌ : వర్షాకాలంలో శరీరంలో చురుకుదనం కాస్త నెమ్మదిస్తుంది. జీవప్రక్రియ వేగం కూడా తక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించేందుకు యాపిల్‌ పండు ఉత్తమం.

ప్లమ్స్‌ : ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, జలుబు వంటి ఇన్‌ ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

దానిమ్మ : ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తం పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ రోజకొక పండైనా తింటే ఆరోగ్యంగా ఉంటారు.

బొప్పాయి : విటమిన్‌ 'సి' అధికంగా లభించే పండు బొప్పాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువ. కాస్త మితంగా తీసుకోవడం ఉత్తమం.