Apr 10,2023 07:49

బహుశా పహారా కాస్తున్న సెంట్రీ పరాóధీనంగా ఉన్నప్పుడో
లాఠీలు పనిమాని మూలసేద తీరుతున్నప్పుడో
గురిచూసి గురి చూసి తుపాకీ అలసి రెప్పవాల్చినప్పుడో
ఉన్న సన్నని మసక కాంతి కూడా కంటిలో కరిగిపోయినప్పడో
గదులు నిండిన ఏడుపులో
ద్ణుఖపు గీతాలో ఆగినప్పుడో
గడ్డకట్టుకుపోయిన నెత్తుటి మరకలు ఆరుతున్నప్పుడో
బతుకు మీద ఆశ చచ్చిపోయి
అన్నం మెతుకే ఆఖరి కోరిక అయినప్పుడో
జైలుకలగంటుంది తొలిసారిగా మేల్కొని ...
గొంతు తెగిన ఉరితాడు సత్యం పలికినట్టు
ఊడిగం పోయి ఊచల నాడులు చైతన్యంతో కదిలినట్టు
తెగిన సంకెళ్లు చేతులు బార్లా చాచి గాలిలో విహరించినట్టు
పక్షి రెక్కపట్టుకొని ఆకాశానికి ఎగిరినట్టు
ఆంక్షలు తొలగి కాంక్షలు తీరినట్టు
కన్నీటి కథలు చెరిగి
కలలు నెరవేరినట్టు
జైలు రేపటిని కలగంటుంది
గోడలు లేని అడ్డుగోడలు ఉండనీ
ఆరుబయలును కలగంటుంది జైలు !
 

- లోసారి సుధాకర్‌