Apr 10,2023 08:12

         'సంస్కృతి' అంటే ఒక ఒక జాతి జీవన విధానం. ఇంగ్లీషులో సంస్కృతిని 'కల్చర్‌' అంటారు. కల్చర్‌ (సంస్కృతి) లాటిన్‌ పదం కల్చుర లేదా కొలెరె నుంచి వచ్చింది. దీని అర్థం 'సాగు'. కోలెరె అనే పదం అర్థం 'పండించడం'. దీనిని బట్టి ఈ పదాలు వ్యవసాయం చేయడం నుంచి ఉద్భవించాయని తెలుస్తుంది. ఒక సమాజంలో ఉన్న పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. మధ్య యుగాల్లో సంస్కృతి అంటే భూమిని సాగు చేసే విధానం. పునరుజ్జీవనోద్యమంలో 'పండించిన' మనిషి వికాసంగా మారింది. అవి సాహిత్యం, లలిత కళలకు సంబంధించినదిగా మారింది. 19వ శతాబ్దంలో, సంస్కృతిలో మంచి, మర్యాదలు, ఆచారాలు కలిశాయి. ఇప్పుడు సంస్కృతిలో విలువలు, నమ్మకాలు, భాష, సమాచార వ్యవస్థలు కూడా వచ్చి చేరాయి. సంస్కృతి డైనమిక్‌గా ఉంటుంది. అంటే సంస్కృతిలోని అంశాలు రూపాంతరం చెందుతాయని అర్థం. అవి ఇతర సంస్కృతుల ప్రభావానికి లోనవుతాయి కూడా.
           సంస్కృత భాషలో 'సంస్కృతి' అంటే 'సంస్కరణ చెందిన విషయం' అని అర్థం. సంస్కరణకు అర్థం చెడులో ఎంతో కొంత తగ్గించడం. ఆచారాలలో జరుగుతున్న చెడు పద్దతులను కొంత మంచి మార్పు చేయాలని భావించేవారు సంస్కర్తలు. బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డు టైలర్‌ ప్రకారం సమాజంలో మానవులు అలవర్చుకున్న జ్ఞానమూ, నమ్మకాలూ, కళలూ, నీతులూ, చట్టాలూ, ఆచారాలు, అలవాట్లు, నైపుణ్యం, అవకాశం - ఈ విషయాలన్నింటినీ కలుపుకుని, ఆ సమాజం 'సంస్కృతి'గా నిర్వచించారు. టైలర్‌ దృష్టిలో సమాజం 'వర్గాల సమాజం' కాదు. వర్గభేదాల సంగతి అతనికి తెలియదు. యునెస్కో ప్రకారం ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, భావోద్వేగ అంశాలు ఆ సమాజపు సంస్కృతి అవుతాయి. ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీతం, కళ, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇలా సమాజపు జీవన విధానం ఆ సమాజపు సంస్కృతి అంటాం. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడతాయి. వస్తువుల వినియోగమే కాకుండా ఆనాటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతి లోనివే. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కతి కిందకు వస్తాయి.
           ప్రపంచీకరణలో భారతీయ సంస్కృతి శరవేగంగా మార్పులు చెందుతోంది. ఏ జాతి సంస్కృతి అయినా ... దేని విశిష్టత దానిదే. కొందరు తమకు నచ్చిన కొన్ని అంశాలను ప్రమాణంగా పెట్టుకొని ఒక సంస్కృతి కంటే మరొక సంస్కతి గొప్పదని తీర్మానిస్తుంటారు. ఇది సరైన దృక్పథం కాదు. కవి బాలగంగాధర తిలక్‌ అన్నట్టు- 'యుగయుగానికి స్వభావం మారుతుంది/ అగుపించని ప్రభావాలకు లొంగుతుంది/ ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడూ కాదొక స్థిరబిందువు / నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు'. ఉత్పత్తిక్రమం, ఉత్పత్తి సంబంధాలు సమాజ స్వరూపాన్ని నిర్ణయిస్తాయని మార్క్సిస్టులు భావిస్తారు. సమాజంలో ఉత్పత్తిదారుల అవసరాలకు సరిపడా సంపద మిగిలితే అది సంస్కృతి నిర్మాణానికి, పెంపుదలకూ మూలమవుతుంది. ఆయా కాలాల్లో అలాంటి మిగులు ఉత్పత్తి ఉండబట్టే చైనాగోడ, ఈజిప్టు పిరమిడ్లూ నిర్మించటం సాధ్యమైంది. మిగులు ఉత్పత్తిని చేజిక్కించుకున్న పాలకుల సంస్క ృతే పాలితుల సంస్కృతిగా ప్రచారంలోకి రావటం చరిత్రలో చాలాసార్లు జరిగింది.
       చరిత్రలో భాగమే సంస్కృతి. సంస్కృతి నీడలా దానిని వెన్నంటి వుంటుంది. సంస్కృతికి సామ్రాజ్యవాదానికి గల గాఢమైన సంబంధాన్ని ఎడ్వర్డ్‌ డబ్ల్యు సెయిర్‌ కల్చర్‌ అండ్‌ ఇంపీరియలిజం అనే పుస్తకంలో విపులంగా చర్చించారు. ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు తులనాత్మక సాహిత్యాలను బోధించే ప్రొఫెసర్‌. సంస్కృతిలో రెండు అంశాలు ప్రాధాన్యం వహిస్తాయని ఆయన అంటారు. కళలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక విభాగాల్లో సమాజం సాధించిన అభివృద్ధి మొదటి అంశమైతే, రెండవది మానవుల అభిరుచి సున్నితమైన విషయాల్లో పెంపొందటం. కక్షలు కార్పణ్యాలతో నిండిపోయిన సమాజంలో సుఖశాంతుల్ని నెలకొల్పటం, సరైన సామాజిక అభిరుచుల్ని పెంపొందించటమే సంస్కృతిగా మేథ్యూ ఆర్నాల్డ్‌ భావించాడు.
          సామ్రాజ్యవాదం ఇప్పుడు 'సబాల్టరన్‌ స్టడీస్‌'ను ప్రోత్సహించటం పేరిట వివిధ జాతులు తమ మూలాలను అన్వేషించి, తెలుసుకొని, తమ జాతుల ఐడెంటిటిని నిలబెట్టుకోవాలని ప్రచారం చేస్తున్నది. ప్రపంచాన్ని చీలదీసే ప్రయత్నంలో అపారమైన నిధుల్ని కుమ్మరిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిధులు యువతరాన్ని ఎక్కువగానే ఆకట్టుకుంటున్నాయి. దీనివల్లే నేడు అనేక అస్థిత్వ వాదాలు పుట్టుకొచ్చాయి. నూరేళ్ల సామ్రాజ్యవాదం తన సంక్షోభాన్నుంచి బయటపడటానికి ప్రపంచీకరణ ప్రక్రియను ప్రారంభిస్తే అది ఢిల్లీ నుండి పల్లె వరకు పేద, మధ్య తరగతి ప్రజానీకాన్నేకాక, భౌతిక విలాసాల్లో బతికేస్తున్న సంపన్న వర్గాల్లో కూడా మనశ్శాంతి లేని సాంస్కృతిక సంక్షోభాన్ని సృష్టించింది. టీవీ సీరియళ్ల నిండా కోటీశ్వరుల కుటుంబాలే దర్శనమిస్తాయి. అవి ఎప్పుడూ పగతో, ప్రతీకారంతో, పోటీ, ఈర్ష్యాసూయలతో, పచ్చి స్వార్థంతో రగిలిపోతూ వుంటాయి. మౌఢ్యాలతో మునిగితేలుతుంటాయి. భయంకరమైన కుళ్లు సంస్కృతిని దేశమంతా వెదజల్లుతుంటాయి. కాకుంటే దాని ప్రభావం నుంచి బయటపడాలంటే 'ప్రపంచీకరణ' విలువలను తిరస్కరించే ప్రత్యామ్నాయ సంస్కృతికే సాధ్యపడుతుంది. ఒక కవి ప్రస్తుత పరిస్థితుల్ని ఇలా చెపుతాడు : 'వేల మైళ్ల దూరంలో మనిషికి మనిషికీ మధ్య ఇంటర్నెట్‌/ ఒకే గదిలో మనసుకూ మనసుకూ మధ్య వేల మైళ్లు'. ఇదీ నేటి వర్తమాన సంస్కృతి !
         గ్రామాల్లో, పట్టణాల్లో, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో ప్రపంచీకరణ సంస్కృతి వెలుగులు నింపిందా, చీకట్లు పంచిందా చర్చించుకుంటేగానీ మనమెక్కడ ఉన్నామో అర్థం కాదు. మానవీయ విలువలైన కరుణ, దయ, జాలి, సాటి మానవుల పట్ల సానుభూతి, సంఘీభావం పెరిగాయా, తరిగాయా ఆలోచించాలి. కుటుంబ జీవితంలో భార్యభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, తల్లితండ్రులు బిడ్డల మధ్య సంబంధాల్ని ఏ విలువలు నడిపిస్తున్నాయో అవి కుటుంబ సౌఖ్యాన్ని పెంపొందిస్తున్నాయో లేదో పరిశీలించాలి.
          భాష అనేది సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. తమ తమ భావోద్వేగాలను ప్రజలు తమ మాతృభాషలోనే మనస్ఫూర్తిగా ఇతరులకు తెలియ చేయగలుగుతారు. వీటిని పరాయి భాషలో అంత శక్తివంతంగా వ్యక్తీకరించలేరు. కెన్యా రచయిత గూగీవా థియాంగో చెప్పినట్లు తుపాకీ శరీరాన్ని వశపరుచుకుంటుంది. భాష ఆత్మను వశపరచుకుంటుంది. ఇది మనభాషా సంస్కృతుల పరాయీకరణ గురించి తెలుపుతుంది. ఉదాహరణకు మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్‌ అనేవి పరాయి భాషా పదాలు. అమ్మా, నాన్న అనే పదాలకున్న శక్తి మమ్మీ, డాడీలలో ఉండదు. అవి కేవలం పిలుపులుగానే ఉంటాయి. పెద్దమ్మ, చిన్నమ్మ, పిన్ని, బుల్లెమ్మ, అత్త, మేనత్త అన్న రకరకాల బంధుత్వాలకు తెలుగులో విడివిడిగా పదాలుండగా ఇంగ్లీషులో 'ఆంటీ' అనే పదం ఒక్కటే ఉంది. పెదనాన్న, బాబాయి. చిన్నాన్న, మామ, మేనమామలకు బదులుగా ఇంగ్లీషులో అంకుల్‌ అనే పదం ఒక్కటే ఉంది. ఫలితంగా ఆ ఇంగ్లీషు పదాలు వాడుతున్న సందర్భంలో భావం ఖచ్చితంగా వ్యక్తీకరింపబడదు. ఆంటీ, అంకుళ్ళ సంతానమంతా ఇంగ్లీషులో 'కజిన్స్‌' అవుతారు. తెలుగులో అయితే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, వదిన, మరదలు, భావ, బావమరిది ఇలా బహుముఖం గా ఉంటాయి. ఇది బంధు సంబంధాల్లో ఎక్కువ ఖచ్చితత్వాన్ని తెలుపుతుంది. 'ఆంటీ', 'అంకుల్‌' పిలుపుల్లో ఈ ఖచ్చితత్వం లేక, మన సంబంధాలు పరాయీకరణ చెందుతాయి.
          అభ్యుదయవాదులు సమాజ ప్రయోజనం కోసం కళారూపాల్ని, సాహిత్యాన్ని ఉపయోగించాలని అన్నప్పుడు... సంప్రదాయవాదులు దాన్ని ప్రచారం కోసం చేస్తున్న కళలుగా చిత్రిస్తుంటారు. వందల సంవత్సరాలుగా కుప్పలు తెప్పలుగా వచ్చిన భక్తి సాహిత్యం కూడా భక్తి ప్రచారమే. భాగవతం వైష్ణవ మత ప్రచారం కోసమైతే, బసవ పురాణం శైవమత ప్రచారం కోసం రాశారు. బైబిలు క్రైస్తవ మత ప్రచారం కోసమైతే, ఖురాన్‌ ఇస్లాం మతం ప్రచారం కోసం రాశారు. అందువల్ల అభ్యుదయకరమైన మానవీయ సంస్కృతి నుంచి పెంపొందించే సాహిత్యాన్ని ప్రచారసాహిత్యమని కొట్టి పారేయడం సరైంది కాదు. సాహిత్యంలో, సినిమాల్లో అశ్లీల, భయానక అద్భుత ఘటనలు చొప్పించి ధనార్జన చేయడంతో పాటు వాటిని అపురూప కళాసృష్టిగా చలామణీ చేయడం నిత్యమూ గమనిస్తున్నాం. అలాంటప్పుడు సమాజశ్రేయస్సు కోసం, ఒక ఉన్నతమైన సమసమాజం కోసం సాహిత్య సృష్టి, కళా ప్రదర్శనలు దోహదపడితే వాటిని స్వాగతించాలి. మరింతగా విస్తృతపరచాలి.
          పెట్టుబడిదారీ సమాజంలో కళల్ని 'మార్కెట్‌' సంస్కృతిలోకి లాగేస్తున్నారు. సినీరంగ ప్రముఖులంతా కళాకారులే. కానీ వారు తమ రంగాన్ని 'వ్యాపారం'గా, 'పరిశ్రమ'గా గర్వంగా చెప్పుకుంటారు. ఆటలు కూడా (ఉదా. క్రికెట్‌, టెన్నిస్‌) వ్యాపారంగానే మారిపోయాయి. వ్యాపార సంస్థలకు ప్రచార సాధనాలు అయిపోయాయి. పెద్ద పెద్ద కంపెనీలు మహిళల సౌందర్యాన్ని వస్తువుల అమ్మకానికి వినియోగించుకుంటు న్నాయి. అందాల పోటీల నిర్వహణ వెనుక వున్నది కూడా ఈ వ్యాపార సంస్కృతే. కాబట్టి ఏ పదజాలం వెనుక ఎలాంటి భావజాలం దాగుందో గ్రహించాలి. ప్రచారకళల పేరుతో ప్రజాకళల్ని తక్కువ చేసే సంస్కృతిని వ్యతిరేకించాలి. అదే సందర్భంలో శిల్పనైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రజాకళలను పదును పెట్టుకోవాలి. ఫ్రెంచ్‌ సామాజిక శాస్త్రవేత్త పియర్‌ బోర్డియు ప్ర కారం ... 'విద్య ఆధిపత్య తరగతి సంస్కృతిని శాశ్వతం చేస్తుంది'. దీన్నే అతను 'సాంస్కృతిక పునరుత్పత్తి' అన్నాడు. మన సమాజంలో ఆధిపత్య వర్గాల సంస్కృతి, లింగ అసమానత, ఇతర సామాజిక సంస్కృతి లక్షణాలు యువతరాలనికి బదిలీ చేయబడుతుంటాయి. దీన్ని గుర్తించి సరైన ప్రజా సంస్కృతి వ్యాప్తికి సాహిత్యకారులు, అభ్యుదయవాదులు కృషి చేయాలి.

- పిళ్లా కుమారస్వామి
94901 22229