- చక్కెరకూ కొరతే
- రేషన్ పంపిణీ అనుమానమే
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దసరా పండుగ నేపథ్యంలో అదనంగా నిత్యావసరవస్తువులు ఇస్తారేమోనని రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఎదురుచూస్తుండగా అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. రేషన్‌కార్డు దారులకు సరిపడినంత కందిపప్పు,పంచదార పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో లేదని తెలిసింది. దీంతో వీటి సాధారణ సరఫరాలోనే కోత పెట్టే అవకాశం ఉందని సమాచారం. మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పండుగ సమయంలోనైనా పరిస్థితి మెరుగుపడుతుందని భావించారు. అయితే, సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోవడంతో వారు ముందుకు రావడం లేదు. పాత బకాయిలు చెల్లిస్తే సరఫరా చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కందిపప్పును సరఫరా చేయాలని నాఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఫలితం కనిపించలేదని సమాచారం. జిల్లాల వారీగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్టోబరు ఒకటోతేది వచ్చినా ఇప్పటికీ అవసరమైనదానిలో సగం సరుకులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.45 కోట్ల రేషన్‌కార్డులుండగా కార్డుకు కిలోవంతున కందిపప్పుపంపిణీ చేయాలన్నా 14.5 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. కనీసం తొమ్మిది వేల టన్నులు డిమాండ్ ఉండేది. ఇటీవల కాలంలో డిమాండ్‌ను ఆరువేల టన్నులకు కుదించారు. అయినా, అక్టోబరు ఒకటి నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయాల్సి ఉండగా సివిల్ సప్లయి కార్పొరేషన్ వద్ద 1800 టన్నులు మాత్రమే ఉంది. మరో 1000 టన్నులకు ఇండెంట్ పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా మొత్తం కార్డుదారుల్లో మూడోవంతుకు కూడా కందిపప్పు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజన ప్రాంతాలు, అర్భన్ ప్రాంతాల్లో లిప్టింగ్‌కు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పంపిణీ చేసి మమ అనిపించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. పంచదార విషయానికి వస్తే కార్డుదారులందరికీ ఒక్కొక్క కార్డుదారునికి అర కేజీ వంతున పంపిణీ చేయాలన్నా 7.25 వేల టన్నుల పంచదార నిల్వలు ఉండాల్సి ఉండగా పౌరసరఫరాల సంస్థ వద్ద 800 మెట్రిక్ టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో దసరాకు పంచదార కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కందిపప్పు బయట మార్కెట్లో ఒక రకం రూ.110 ధర పలుకుతుండగా, హై క్వాలిటీ కందిపప్పు కిలో రూ.120 నుంచి రూ.140 వరకు పలుకుతోంది. రేషన్‌షాపుల్లో రూ.67కు అందిస్తున్నారు.
భారం తగ్గించుకోవడం కోసం..
కందిపప్పును ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై సరఫరా చేస్తోంది. ప్రభుత్వం కిలో రూ.110.42కి కొనుగోలు చేస్తోంది. సబ్సిడీ రూ.43.42 ఇస్తోంది. దీని ప్రకారం సబ్సిడీ రూ.63 కోట్లు ఉంటోంది. ఈ భారాన్ని కూడా తగ్గించుకునే దిశగా ప్రభుత్వం కందిపప్పు సరఫరాను తగ్గిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్యాకేజీ వస్తువులపై ఐదుశాతం జిఎస్‌టి విధిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల్లో సరఫరా చేసే కిలో కందిపప్పు ప్యాకెట్‌పై ఐదుశాతం జిఎస్‌టి వినియోగదారునిపై పడనుంది.
కమిషన్ సర్దుబాటు చేయట్లేదు : డీలర్లు
కందిపప్పు కోసం కింటాళ్లుకు రూ.6,600 డిడి తీస్తే తాము కిలో ఒక రూపాయి మార్జిన్‌తో సరుకు అమ్మాల్సి ఉందని, తాము నాలుగు క్వింటాళ్లకు డిడి తీస్తే అందులో సగం ఇండెంట్‌కు కూడా సరుకు ఇవ్వడం లేదని డీలర్లు చెబుతున్నారు. రూ.6,600 పెట్టుబడి పెడితే తమకు వచ్చేది కేవలం రూ.100 మాత్రమేనని, ఒకవేళ తీసుకుని సరఫరా చేద్దామన్నా కార్పొరేషన్‌లో నిల్వలు ఉండటం లేదని పేర్కొంటు న్నారు. తమకు రెండు నెలలుగా చెల్లించాల్సిన కమిషన్ రూ.40 కోట్ల వరకు ఉందని, ఆ మొత్తాన్ని కందిపప్పుకు సర్ధుబాటు చేయమని అడిగినా చేయడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










