ఆహార భద్రత కోసం కృషి చేసిన దార్శనికుడు స్వామినాథన్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ప్రభృతుల నివాళి
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణం నన్ను ఎంతగానో బాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఆహార భద్రతను సాధించడానికి విశేషంగా కృషి చేసిన దార్శనికుడు, ఆహార ధాన్యాలలో మన దేశానికి స్వావలంబనను అందించిన హరిత విప్లవ పితామహుడు. అగ్రికల్చర్ సైన్స్‌లో పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించి పద్మవిభూషణ్ నుంచి ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరకు అనేక అవార్డులను పొందారు. భారతీయ వ్యవసాయ శాస్త్రం యొక్క గొప్ప వారసత్వాన్ని మనకు వదిలివెళ్లారు. మానవాళికి సురక్షితమైన, ఆకలి లేని భవిష్యత్తు దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి ఆయన చూపిన మార్గం ఉపయోగపడుతుంది.
దేశానికి ఆహార భద్రత కల్పించారు : ప్రధాని మోడీ
ఎంఎస్ స్వామినాథన్ చేసిన కృషి లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. దేశానికి ఆహార భద్రత కల్పించింది. ఆవిష్కరణలకు ఆయన పవర్‌హౌస్. చాలా మందికి స్పూర్తిని ఇచ్చే గురువు.పరిశోధన- మార్గదర్శకత్వం పట్ల స్వామినాథన్ అచంచలమైన నిబద్ధత లెక్కలేనన్ని శాస్త్రవేత్తలు, ఆవిష్కరకర్తలపై చెరగని ముద్ర వేసింది. భారతదేశ పురోగతిని కాంక్షించే స్వామినాథన్ అభిరుచి శ్రేష్టమైనది. స్వామినాథన్‌తో నేను జరిపిన సంభాషణలను ఎప్పుడూ ఆదరిస్తాను. స్వామినాథన్ చేసిన కృషి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.
త్రిపుర ప్రజలు ఎప్పటికీ మరచిపోరు : మాజీ సిఎం మాణిక్ సర్కార్
ఈ యుగంలో విశిష్టమైన వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో మా అభ్యర్థనను మన్నిస్తూ స్వామినాథన్ ఒకటి కంటే ఎక్కువసార్లు రాష్ట్రాన్ని సందర్శించారని, వివిధ ప్రాంతాల్లో పర్యటించి, రైతులతోను, త్రిపుర వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించారని మాణిక్ సర్కార్ గుర్తు చేసుకున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో త్రిపుర స్వయం సమృద్ధిని సాధించడానికి అత్యంత విలువైన సలహాలను అందించిన స్వామినాథన్‌ను వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే ప్రజలు ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు.
స్వామి నాథన్ కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది : కేరళ సిఎం పినరయి విజయన్
భారత హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ వ్యవసాయం యొక్క అభివృద్ధిలో నిజమైన దూరదృష్టి కలిగినవారు. మార్గదర్శకులు. ఆహార భద్రత, రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు స్వామినాథన్ చేసిన అవిశ్రాంత కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానించే వారికి హృదయపూర్వక సానుభూతి.
ప్రపంచంపైనే ప్రభావం చూపింది : తమిళనాడు సిఎం స్టాలిన్
సుస్థిర ఆహార భద్రత రంగంలో స్వామినాథన్ చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. 'నేను అతనితో గడిపిన క్షణాలను నేను ఎప్పుడూ ప్రేమిస్తాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు స్వామినాథన్ కుటుంబం, గ్లోబల్ సైన్స్ కమ్యూనిటీతో ఉన్నాయి. స్వామినాథన్ 1989-91, 1996-2000 సంవత్సరాల మధ్య తమిళనాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యునిగా నిర్మాణాత్మక ఆలోచనలను అందించారు. స్వామినాథన్ నాతోనూ, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధితోనూ మంచి స్నేహాన్ని నడిపారు. 1989లో కరుణానిధి కేటాయించిన స్థలంలోనే ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ గత మూడు దశాబ్దాల నుంచి పనిచేస్తుంది.
వ్యవసాయానికి ఎనలేని సేవలు : ఎఐకెఎస్
వ్యవసాయ రంగానికి స్వామినాథన్ ఎనలేని సేవలందించారని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) కొనియాడింది. ఎంస్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. దేశంలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి స్వామినాథన్ అద్భుతమైన కృషి చేశారని స్మరించుకుంది. ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఎంఎస్ అమోఘమైన కృషి చేశారని తెలిపింది. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా దేశంలో వ్యవసాయాభివృద్ధికి ప్రపంచ స్థాయి పరిశోధనల వారసత్వాన్ని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడింది. వ్యవసాయాభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి జరగదని స్వామినాథన్ ధృడంగా విశ్వసించారని పేర్కొంది.
ఎఐఎడబ్ల్యుయు దిగ్భ్రాంతి
దేశం గర్వించదగ్గ హరిత ఉద్యమ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ విజయ రాఘవన్, బి వెంకట్ పేర్కొన్నారు. స్వామినాథన్‌కు నివాళి అర్పిస్తూ... గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం ఎంఎస్‌పి, సి ప్లస్ సి2 ఫార్ములాను రూపొందించడంలో జాతీయ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్‌గా ఆయన చేసిన కృషి అఖిల భారత రైతాంగాన్ని కదిలించిందన్నారు. స్వామినాథన్ అగ్రేరియన్ స్టడీ సెంటర్ పేరుతో ఆహార పంటలతోపాటు భూ సమస్యలు, ఉపాధి అవకాశాలపై వారు రూపొందించిన అధ్యయన నివేదికలకు ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయన్నారు. అఖిల భారత స్థాయిలో వివిధ భావాలు కలిగిన రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక ప్రజాసంఘాలను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి జరుగుతున్న ఎస్కేయం ఉద్యమానికి ఆయన ప్రేరణగా నిలిచారని ఆయన సేవలను వారు కొనియాడారు. స్వామినాథన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.