Jul 25,2023 21:45

421 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించి ముఖ్యమంత్రి జగన్‌
ప్రజాశక్తి-యంత్రాంగం :ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో మార్కెట్‌ సౌకర్యం పెరిగి రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఆయన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వాటిలో తిరుపతి జిల్లా శ్రీ సిటీలో మోండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, చాక్లెట్‌ అండ్‌ మిఠాయి తయారీ విస్తరణ యూనిట్‌, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌, చిత్తూరు జిల్లాలో మూడు, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పండ్లు, కూరగాయల ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మూడు టమాట ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం రేగ గ్రామంలో మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను, కర్నూలు జిల్లా తడకనపల్లెలో వంద మైక్రో యూనిట్స్‌తో ఉల్లిపాయలు, టమోటా సోలార్‌ డీ హైడ్రేషన్‌ క్లస్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొత్త్తం 421 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్లను ప్రారంభించుకున్నామని, ఇవన్నీ 1,912 ఆర్‌బికెలకు మ్యాప్‌ చేశామని తెలిపారు. మొత్తం 945 కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. తొలిదశలో 344 కోల్డ్‌ రూముల పనులు జరుగుతున్నాయని, వీటిలో 43 కోల్డ్‌ రూములను ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇవి కూడా దాదాపు 194 ఆర్‌బికెలతో అనుసంధానం అయ్యాయన్నారు ప్రతి ఆర్‌బికెను కోల్డ్‌ రూములు, కలెక్షన్‌ సెంటర్లకు మ్యాపింగ్‌ చేసి ప్రైమరీ ప్రాసెసింగ్‌లో డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, కలెక్షన్‌ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటిని వాటి పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. సెకండరీ ప్రాసెసింగ్‌ కోసం జిల్లాకొకటి ఉండేటట్టుగా అడుగులు పడుతున్నాయన్నారు. శ్రీ సిటీలో మరో రూ.1600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు శంకుస్ధాపన చేయడం ఆనందం కలిగిస్తోందని పేర్కొన్నారు. మోండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రెండో విడతలో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకురావడం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. చాక్‌లెట్‌, క్యాడ్‌బెర్రీ, బోర్న్‌విటా వంటివి తయారు చేస్తున్న ఈ ప్యాక్టరీ దినదినాభివృద్ధి చెందాలని, మంచి జరగాలని ఆకాక్షించారు. ధర్మవరంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు వల్ల అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేరుశనగకు మెరుగైన ధర లభించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.3 వేల కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించడంతో పాటు, ఈ నాలుగేళ్లలో దాదాపుగా రూ.8 వేల కోట్లు ఇతర పంటల కొనుగోలుకు ఖర్చు చేశామని తెలిపారు. మిల్లెట్స్‌లో దాదాపు 13 సెకెండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 32 పైచిలుకు ప్రైమరీ ప్రాసెసింగ్‌ మిల్లెట్‌ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా మిల్లెట్లకు ఎంఎస్‌పి అందించింది మన రాష్ట్రమేనని అన్నారు. కర్నూలులో ఉల్లిపాయల డీహైడ్రేషన్‌ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నామని, లక్ష రూపాయల పెట్టుబడితో ప్రతి ఒక్కరికీ దాదాపు రూ.12 వేల ఆదాయం రానుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను ఐదు వేల వరకు పెంచుతామన్నారు.