May 09,2023 10:31
  • కనుమరుగవుతున్న స్థలాలు
  • క్రీడేతరాలకు స్టేడియాలు
  • ఆధ్యాత్మిక, అధికారిక కార్యక్రమాలకే తొలి ప్రాధాన్యత

ప్రజాశక్తి - స్పోర్ట్స్‌ కరస్పాండెంట్‌ : రాష్ట్రంలో ఆటలు ఆడుకునేందుకు, వ్యాయామాలు చేసుకునేందుకు చోటు దొరకడం లేదు. నగరాలు, జిల్లా కేంద్రాల్లో స్టేడియాలున్నా..వాటిని క్రీడేతర కార్యాక్రమాల నిర్వహణకే పరిమితం చేస్తుండటంతో ప్రాక్టీస్‌కు క్రీడాకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ (ఐజిఎంసి) స్టేడియం రాష్ట్రంలోనే క్రీడాకారులకు చక్కని వేదికగా ఉండేది. అయితే ప్రస్తుతం దానిని రాజకీయ కార్యక్రమాలకు, అధ్యాత్మిక కార్యాక్రమాలకు పరిమితం చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు స్టేడియం మొత్తాన్ని'చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగం' కోసం కేటాయించడంపై క్రీడాకారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ప్రధాన క్రీడా ప్రాంగణానికి అధ్యాత్మిక కార్యాక్రమాలకు కేటాయిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రంజాన్‌ ప్రార్థనలకు, ఇతర రాజకీయ, అధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈ స్టేడియాన్ని కేటాయించారు. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కూడా పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఏమీలేదు. ఆటలు ఆడేందుకు, ప్రాక్టీస్‌ చేసేందుకు, క్రీడా శిక్షణకు స్థలాలు లేకపోవడంతో క్రీడాకారులు, వాకర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర, పోలీస్‌ అమర వీరుల దినోత్సవాలకు కూడా ఐజిఎంసిని కేటాయిస్తున్నారు. ఐజిఎంసి పక్కనే పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ ఉన్నా.. 'పోలీస్‌ అమరవీరుల దినోత్సవం' వంటి కార్యక్రమాలు నిర్వహణకూ ఐజిఎంసిని వినియోగిస్తున్నారు. దీంతో క్రీడాకారులతో కళకళలాడాల్సిన ఐజిఎంసి ఇతర కార్యక్రమాలకే పరిమితమవుతోంది.

There-is-a-place-for-games


            ఐజిఎంసిలోనే రాష్ట్ర క్రీడా ప్రాధికార కార్యాలయం (శాఫ్‌) ప్రధాన కార్యాలయమూ ఉంది. అన్ని క్రీడలకు సంబంధించిన కోచ్‌, సహాయ సిబ్బంది ఇక్కడే ఉంటారు. ఆధ్యాత్మిక, అధికారిక కార్యక్రమాలకు ఈ మైదానాన్ని కేటాయించడం పట్ల వీరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వాధికారుల, పాలకుల కనుసన్నల్లోనే ఇవి జరుగుతుండడంతో వీరూ ఏమీ చేయలేని పరిస్థితి. దీనిపై కోచ్‌లు, సహాయ సిబ్బందీ పెదవి విరుస్తున్నారు. ఏ కార్యక్రమానికి ఈ మైదానాన్ని కేటాయించినా.. 10 రోజుల ముందు నుంచే ఏర్పాట్ల హడావిడి మొదలువుతుంది. కార్యక్రమం ముగిసిన మరో వారం, 10 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడికి శిక్షణకు వచ్చేవారికి సుమారు 20 నుంచి నెలరోజుల పాటు నరకయాతన తప్పదు.
 

                                                                        వేసవి శిక్షణ శిబిరం లేనట్లే..

ప్రతి ఏడాదీ మే 1 నుంచి 31 వరకు శాప్‌ ఆధ్వర్యంలో 'వేసవి క్రీడా శిక్షణ శిబిరం' జరుగుతుండేది. మేలో విద్యార్థులు వారు నచ్చిన క్రీడాంశంలో చేరి శిక్షణకు హాజరవుతుంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వారు అదే క్రీడలో శిక్షణ కొనసాగించుకోవాలన్నా ఈ మైదానంలోనే నైపుణ్యతగల శాప్‌ కోచ్‌లు ఉంటారు. కొన్ని క్రీడలకు మినహా.. మిగతా అన్ని క్రీడలకూ ఈ మైదానంలో ఉచిత శిక్షణ ఇస్తారు. అలాంటి సంప్రదాయాన్ని ఈసారి శాప్‌ అధికారులు పూర్తిగా తుంగలో తొక్కారు. ఏకంగా దేవాదాయశాఖ ఆధ్వర్యాన నిర్వహించే వారం రోజుల యాగం కోసం ప్రతిఏటా వేసవిలో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాలను ఈసారి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవి శిక్షణను ఇలా ఎత్తివేయడం ఇదే తొలిసారి అని శాప్‌ అధికారి ఒకరు తెలిపారు.
 

                                                      హేతువాద సంఘం నాయకుల పెదవి విరుపు..

ఈ నాలుగేళ్లలో రాష్ట్ర దేవాదాయ శాఖకు గుర్తుకు రాని యాగాలు.. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా ఎందుకు గుర్తుకు వచ్చాయోనని హేతువాద సంఘం నాయకులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పీఠాన్ని తిరిగి ఎక్కేందుకే ఈ యాగాలు నిర్వహిస్తున్నారా? అని సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్నె వెంకట సుబ్బయ్య ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ఐఎఎస్‌, ఐపిఎస్‌లు, ప్రజా ప్రతినిధులు హాజరుకావడం కూడా రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమని అన్నారు.
 

                                            రాష్ట్రం సర్వతోముఖాముఖివృద్ధికే.. : ఉప ముఖ్యమంత్రి

రాష్ట్ర సంక్షేమం, సర్వతోముఖాముఖాభివృద్ధి కోసమే 'చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగం' నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి 17 వరకు ఐజిఎంసిలో ఆరు రోజుల పాటు జరిగే ఈ యాగం.. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండి, ప్రజలు సుఖ సౌభాగ్యాలతో వర్థిల్లాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామన్నారు. 12న ఉదయం 5 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా యజ్ఞ ప్రారంభమై.. 17న జరిగే పూర్ణాహుతితో ఈ యాగం ముగుస్తుందన్నారు.