Apr 11,2023 21:08
  • ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌: పెయింట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ టెక్నో పెయింట్స్‌ మరో మూడు ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులోని రెండు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తూరుతో పాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్‌ పుట్టీ, టెక్స్చర్స్‌, ప్రైమర్స్‌, ఎమల్షన్స్‌ తయారు చేయనున్నట్లు తెలిపింది. కొత్త ప్లాంట్లను ఈ ఏడాది ముగింపు నాటికే అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. తొలి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్‌ టన్నులు ఉంటుందని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.46 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. కావాల్సిన నిధులను సమకూర్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్లాంటు ఉంది. వార్షిక సామర్థ్యం 2,50,000 మెట్రిక్‌ టన్నులుగా ఉంది.