Feb 13,2023 08:24

        నాటకం ఏ జానర్‌కు చెందినదైనా ఒకనాటి పౌరాణిక చారిత్రక లేదా ఆధునిక సమాజానికి దర్పణం పడుతుంది. అలాంటి వాతావరణం కళాత్మకంగా రంగస్థల వేదికను తీర్చిదిద్ది, రంగస్థల సంబంధిత అనుబంధ శాఖల సమన్వయంతో సకల కళల సమాహారంగా ఒక ప్రదర్శన రూపుదిద్దుకుంటే అది ఒక అపురూప రంగస్థలం ప్రదర్శనగా, ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుంది. వాటి గురించిన సమాచారం రంగస్థలం చరిత్రలో కొన్ని వాక్యాలుగా స్థానం సంపాదించుకుంటుంది.
        ఒక శాస్త్రంగా రంగస్థల కళలను బోధించేవి, పరిశోధనకు తావిచ్చి త్రికాలాలను స్ఫురింప చేస్తూ, సంస్క ృతీ సంప్రదాయ వారసత్వాలను బోధపరుస్తూ, ఆదాన ప్రదాన, వినిమయాలతో విశ్వ కళావేదికపై తమ తమ అస్తిత్వాలను స్థిరీకరించేందుకు దోహదపడేవి, విశ్వవిద్యాలయ ప్రదర్శన కళల విభాగాలు.
        ఈనెల 11 12 13 తేదీల్లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ రెండో సంవత్సరం విద్యార్థులచే కాళిదాసు విరచిత 'అభిజ్ఞాన శాకుంతలం' నాటకాన్ని, 'శకుంతల' పేరుతో 150 నిమిషాల పాటు ఒక కళాత్మక రంగస్థల రంగవల్లికగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని జి.బి.హాల్లో ప్రదర్శింపబడింది. మూల సంస్క ృత నాటకానికి హిందీ అనువాదం, మోహన్‌ రాకేష్‌. దీన్ని విద్యార్థుల కోసం నాటకంగా తీర్చిదిద్దిన దర్శక గురువు, సీనోగ్రఫీస్ట్‌, సత్యబ్రత రౌత్‌.
        ఈయన 2016లో సంగీత నాటక అకాడమీ ద్వారా సన్మానితులు. నాటక దర్శకుడిగా, కళాత్మక సౌందర్యాన్ని దృశ్యాత్మకంగా తీర్చిదిద్దడంలో సుశిక్షితులు. ఇప్పటి దర్శక దిగ్ధంతి. 1983లో ఎన్‌ఎస్డిలో డిజైన్‌, డైరెక్షన్లో పట్టభద్రులు. ప్రపంచ ప్రసిద్ధమైన పలు సంస్థల్లో అధ్యయనం చేసిన వారు. బీవీ కారంత్‌ రచనలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టాను, 'న్యూ డైరెక్షన్‌ థియరీస్‌' అనే అంశంపై డి.లిట్‌ పొందారు. భారతీయ సమకాలీన నాటక రంగ సంబంధ బహు గ్రంథ రచయితగా గుర్తింపబడ్డారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ బోధన విభాగంలో ప్రాచార్యులు.
శకుంతల నాటకం- మనిషి, ప్రకృతిల మధ్య సంబంధాన్ని, ప్రాచీన భారతీయ సంస్క ృతి సంప్రదాయాలు, సామాజిక రాజకీయ అంశాలను పుణికి పుచ్చుకున్నదంటారు. పురుషాధిపత్య ప్రపంచాన్ని ప్రశ్నించిన నాటకం- శకుంతల అంటారాయన. మొదట తల్లిదండ్రులు, తర్వాత పెంచిన తండ్రి, ఆ తర్వాత భర్త, వీరందరి ద్వారా వంచిత కాబడిన స్త్రీ అంటారు. అలాంటి కొందరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక దశలో పురుషాహంకారం, వెలివేత దౌష్ట్యాలకు గురైన వారి ప్రతినిధి శకుంతల అంటారు. ఒరియా వాడైన సత్యవ్రత రౌత్‌ ఆ ఒడిస్సీ నుంచి సంప్రదాయ బద్ధమైన ముద్రలతో చతుర్విధ అభినయాలతో ప్రదర్శనను తీర్చిదిద్దారు. ఈ ప్రదర్శన పొడుగునా భారతీయ నాట్య శాస్త్ర సూత్రాలు, వాటి అనుగమనాన్ని గుర్తిస్తాడు ప్రేక్షకుడు. రంగస్థల కళాకారులతో పాటు ప్రేక్షకుడు కూడా అనుభూతికి లోనయ్యేవిధంగా, తన ప్రదర్శనలు తీర్చిదిద్దేవిగా చెబుతారు... ఈ సీనోగ్రఫిస్ట్‌, దర్శకుడైన రౌత్‌.
         కాళిదాసు నాటకాల్లోని ప్రకృతి నేపథ్యం, అనుబంధం, పరోక్ష పాత్రను అద్వితీయమైన పోలికలు వర్ణనలతో కలగలిపిన దృశ్య ప్రధాన రసాత్మక కావ్యంగా తీర్చిదిద్దిన ఆణిముత్యంగా మురిసిపోతూ తన కళాభివ్యక్తికి ఉత్తమమైన రచనలుగా ఎంచుకొని వాటిని రంగస్థలంపై దృశ్య శ్రవ్య కావ్యాలుగా మలిచిన దర్శకుడు సత్యబ్రత రౌత్‌.
        రాజా విక్రమాదిత్య ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకడైన ప్రపంచ ప్రసిద్ధ కవి కాళిదాసు... ఐదవ శతాబ్దికి చెందిన నాటక రచయిత. కాళిదాసు మూడు నాటకాలు, రెండు పౌరాణిక కావ్యాలు, మరో రెండు లఘుకావ్యాలు రాశాడు. భారతీయ సౌందర్యాత్మక కావ్య రమణీయకతను అత్యున్నత శిఖరాలపై ఉంచిన కావ్య నాటక కర్తగా కాళిదాసు స్థానం ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
        ఈ నాటక ప్రదర్శనలో అత్యధిక అంశాలను విద్యార్థులే సమకూర్చుకున్నారు. వాటిలో సంగీతం సెట్‌ డిజైన్‌, మాస్కులు, రంగస్థల సాధనాలు, లైటింగ్‌, దుస్తులు, రూపశిల్పకల్పన, సహ దర్శకత్వం మొదలైనవి ఆ శాఖలు. ప్రధాన సంగీత దర్శకులు అంజనాపురి, సత్యబ్రత రౌత్‌. పాటల రూపకల్పన ప్రియాంక మిశ్రా. నట్టువాంగం- వీరేంద్ర జానీ. కీబోర్డ్‌, నీలేష్‌ మనోహర్‌. సాంకేతిక సహకారం కన్హైయా లాల్‌ కైథ్వాస్‌. ప్రొడక్షన్‌ మేనేజర్‌ స్వరాలి దివార్‌. స్టేజ్‌ మేనేజర్‌, కదరుజ్జమాన్‌. ప్రచార విభాగాన్ని నిర్వహించిన విద్యార్థులు మొహమ్మద్‌ నవాజ్‌ ఖాన్‌, విద్యాసాగర్‌ లక్కినేని.
      శిక్షణలో భాగంగా విద్యార్థులే అధిక భాగం రంగస్థల శాఖల్లో పని నేర్చుకుంటూ, దర్శక శ్రేష్టుల వద్ద పనిచేస్తూ, సూచనలు తీసుకుంటూ తమ తమ అభిరుచుల మేరకు నైపుణ్యాలను పెంచుకుంటుంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వీరు భారతీయ సంస్క ృతి ఏకాత్మతకు ప్రతినిధులు. భావి భారత రంగ స్థలానికి దీపధారులుగా పని చేయడానికి తమ భవిష్యత్తును అంకితం చేస్తున్న వారందరికీ అభినందనలు.
        చివరిగా ఈ నాటకం ఎందుకు చూడాలి, చూసి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అంటే.. భారతీయ నాట్య సంస్క ృతికి ప్రాతినిధ్యం వహించే నాటకాల రూపకల్పనలో విస్మరించరాని అంగాలైన, సూత్రధారి విదూషకుడు, కథానాయక, నాయికగా పాత్ర పోషణ, తమ నెచ్చెలి ఇష్టసఖులుగా, ఆమెలోని మానసిక భావోద్వేగ, ప్రణయోద్వేగాలను గమనిస్తూ, ప్రియునితో ప్రియసఖి సమాగం కోసం వారి వంతు దోహదం, పార్శ్వభాగాల్లో కనిపిస్తూ కథాకథనంలో భాగమౌతూ, లయాత్మక పాద హస్తముద్రలు పడుతూ, సంగీత స్వర నేపథ్య సారథులుగా ప్రదర్శనను విజయవంతం చేయడానికి ఏకోన్ముఖంగా,అంకిత మనస్కులు కావడం లోని నిబద్ధతలు.. శకుంతల నాటక ప్రదర్శన అలా అటు విద్యార్థులకు, ఇటు ప్రేక్షకులకు ఒక మధురానుభూతి !

- మల్లేశ్వరరావు ఆకుల, 79818 72655