Oct 21,2022 10:17
  • వేతనాల పెంపు కోసం సమ్మెలు
  • ద్రవ్యోల్బణం.. ఇంధన సంక్షోభం.. పెరుగుతున్న జీవన వ్యయాల ప్రభావం

పారిస్‌ : ఐరోపాలోని ప్రధాన దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్మిక లోకం కదం తొక్కింది. ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతున్నది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను భయపెట్టిస్తున్నది. దీంతో ఇవి దేశవ్యాప్తంగా కార్మికుల నిరసనలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేతనాల పెంపు కోసం వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఏర్పడిన ఇంధన సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఐరోపాలో రాబోయే కఠినమైన శీతాకాలపు హెచ్చరికల నేపథ్యంలో ఈ కఠిన పరిస్థితులు ఎదురుకావటం ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

                                                            ఫ్రెంచ్‌ సమ్మెలు ఎలా ప్రారంభమయ్యాయి ?

ఈ సమ్మెలు ముఖ్యంగా రిఫైనరీ కార్మికులతో కొన్ని వారాల క్రితం మొదలయ్యాయి. అధిక వేతనాలను డిమాండ్‌ చేస్తూ వారు ఈ సమ్మెకు దిగారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో దాని ప్రభావం యూరప్‌లో ఇంధనం, శక్తిపై ప్రభావం పడింది. అక్కడి ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీలు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని భారీగా లాభాలను గడిస్తున్నాయన్నది రిఫైనరీ కార్మికుల వాదన. కార్మికుల సమ్మెలు ఫ్రాన్స్‌లో ఇంధన కొరతలకు దారి తీశాయి. పెట్రోల్‌ పంపుల ముందు భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. కొన్ని పెట్రోల్‌ పంపులైతే కనీసం ఇంధనం లేకుండా కనిపించాయి. ఆదివారం నాటికి మూడో వంతు దేశ గ్యాస్‌ స్టేషన్లు ఇంధనం అయిపోయి కనిపించాయి. ఇంధన కొరత, కార్మికుల సమ్మెలు.. వెరసి ఈనెల 18న నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాబోయే కఠిన శీతాకాల పరిస్థితులను ఎదుర్కోవటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది.
 

                                                                       సమ్మెకు వెళ్లిందెవరు ?

రిఫైనరీ, ఆయిల్‌ డిపార్ట్‌మెంటు కార్మికులతో మొదలైన సమ్మెలు దేశంలోని ఇతర పరిశ్రమలకూ వ్యాపించాయి. ఈ సమ్మెలు ఫ్రెంచ్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్ల పైనా ప్రభావం చూపాయి. ఇక్కడ కూడా కార్మికులు అధిక వేతనాలను కోరారు. మంగళవారం రైల్వే కార్మికులు, హైస్కూల్‌ విద్యార్థులు.. ఇలా వేలాది మంది ప్రజలు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. ఇది రవాణాకు అంతరాయాన్ని కలిగించింది. ఆదివారం ప్యారిస్‌లో భారీ మార్చ్‌ను నిర్వహించారు. పెరుగుతున్న జీవన వ్యయం అక్కడి కార్మికులు, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇక మరిన్ని నిరసనలు, చర్యలకు యూనియన్లు హామీనిచ్చాయి. దేశంలోనే అతిపెద్ద యూనియన్లలో ఒకటైన సిజిటి సమ్మెలకు సహాయాన్ని అందిస్తున్నది. మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన 180కి నిరసనలు జరగ్గా, 70వేల మంది ఒక్క ప్యారిస్‌లోనే పాల్గొనటం గమనార్హం. దీనిపై అక్కడి ప్రభుత్వం తప్పుడు సమచారాన్ని చెప్తున్నది.
 

                                                            ద్రవ్యోల్బణం నిరసనలకు దారి తీస్తుందా ?

ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న కొనుగోలు శక్తి ఫ్రెంచ్‌కు ప్రధాన ఆందోళనగా మారింది. ఈనెలలో ప్రకటించిన ఒక సర్వేలో చాలా మంది ఇమ్మిగ్రేషన్‌, నేరాల కంటే ఈ పరిస్థితిపైనే మూడు రెట్లు ఎక్కువ ఆందోళన కలిగి ఉన్నారని తేలింది. ప్రభుత్వం గ్యాసోలిన్‌ ధరలు, ఇంధన బిల్లులను సబ్సిడీపై బిలియన్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ, అనేక సూపర్‌ మార్కెట్‌లలో కనీస ధరలు పెరగటం గమనార్హం. ఐరోపా ఇంధన సంక్షోభం, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అరికట్టడానికి ఫ్రాన్స్‌ అనేక దేశాల కంటే సాహసోపేతమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. దీర్ఘకాలంలో అది సరిపోతుందా? అనే ప్రశ్నలు ఆర్థిక నిపుణుల నుంచి ఎదురవుతున్నాయి.
 

                                                                      మాక్రాన్‌కు గడ్డు పరిస్థితి

ఉక్రెయిన్‌లో సంఘర్షణ ఐరోపాలో ఇంధన శక్తి సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. సహాజవాయువు ధరల పతనం 2021 స్థాయిలకు పరిమితం చేయబడ్డాయి. శక్తి ధరలలో పెరుగుదల నాలుగు శాతానికి పరిమితం చేయబడింది. అయితే, ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆర్థిక వ్యవస్థ, కార్మిక, ప్రజాగ్రహం సవాలుగా మారుతున్నదని విశ్లేషకులు తెలిపారు.