Sep 22,2023 22:30

సమ్మెలు, ర్యాలీలతో హోరెత్తిన గ్రీస్‌
ఏథెన్స్‌ : రోజుకు 13 గంటల పని దినంతోసహా తమను ఆధునిక బానిసత్వంలోకి నెట్టే కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ గురువారం గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌తో సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ కార్మికులు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చారు. ఏడు గంటల పని దినం కావాలని, పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు పెంచాలని, సమిష్టిగా బేరమాడే హక్కును కాపాడాలని వారు బిగ్గరగా నినదించారు.కన్జర్వేటివ్‌ న్యూ డెమొక్రసీ (ఎన్‌డి) ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ గ్రీస్‌ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు సార్వత్రిక సమ్మె బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఏథెన్స్‌తోబాటు థెస్సాలోనికి, లారిస్సా, పత్రాస్‌, ఐయోనినా, కార్ఫు, కతేరిని వంటి నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆనాడు కార్మికుల రక్తతర్పణ ఫలితంగా 8 గంటల పనిదినం సాధించుకున్నాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఈ కార్మిక వ్యతిరేక బిల్లును తిప్పికొడతామని వారు ప్రతిన బూనారు. యాజమాన్యాలు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, బెదిరింపులకు దిగినా లెక్కచేయకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ కార్మికులందరూ సమ్మెలో పాల్గన్నారు. ఆల్‌ వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పిఎఎంఇ), వివిధ రంగాలకు చెందిన ఇతర యూనియన్లు ఈ పోరాటంలో భాగస్వాములయ్యాయి. ఒక వైపు కార్మికుల ఆదాయాలు, నిజవేతనాలు పడిపోతున్నాయి. మరో వైపు రోజుకు 13 గంటలు పనిచేయిస్తూ కార్మికుల మూల్గలను పీల్చిపిప్పిచేసేలా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) పార్లమెంటు వెలుపల వేలాది మందితో ప్రదర్శన నిర్వహించగా, పార్లమెంటులో కమ్యూనిస్టు పార్టీ ఎంపీలు బిల్లులో క్రూరమైన నిబంధనలను, అబద్ధాలను, మోసాలను బట్టబయలు చేశారు. ఈ అనాగరిక బిల్లును సహించేది లేదని కార్మిక సంఘాలు తెగేసి చెప్పాయి. బిల్లును ఉపసంహరించుకునేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశాయి.
నిరసన తెలియజేసిన కార్మిక లోకానికి గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ), కమ్యూనిస్టు యూత్‌ ఆఫ్‌ గ్రీస్‌ (కెఎన్‌ఇ) తన పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించాయి. ఈ సమ్మెలో పాల్గనేందుకు అధికారికంగా పిలుపు ఇవ్వనందుకు జనరల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ గ్రీక్‌ వర్కర్స్‌ (జిఎస్‌ఇఇ) నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

  • బానిసత్వ సాధనంలా కొత్త బిల్లు!

ప్రస్తుతమున్న పని గంటలను 8 నుంచి 13కి పెంచాలని, అవసరమైతే ఆరు రోజుల పని వారాన్ని అమలు చేసేందుకు యజమానులకు అవకాశం కల్పించాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కొత్త బిల్లు పేర్కొంటోంది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదా వేతనం లేకుండానే మొదటి ఏడాదిలోనే ఉద్యోగిని తొలగించవచ్చు, పని ఆపేసినా, సమ్మెలు చేసినా జరిమానాలు విధించడంతో పాటు ఆరు మాసాల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారని బిల్లు నిబంధనలు పేర్కొంటున్నాయి. కార్మిక లోకం యావత్తూ ఈ బిల్లును తీవ్రంగా నిరసిస్తోంది. గత రెండు మాసాలుగా పెద్ద ఎత్తున సంభవించిన వరదలు, ప్రాణాంతకంగా పరిణమించిన కార్చిచ్చులతో ప్రజలు సతమతమవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం క్రూరమైన ఈ బిల్లును తీసుకురావడంపై కార్మికుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.
ఏథెన్స్‌లో జరిగిన ర్యాలీ పాల్గొన్న కెకెఇ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కొత్సూమ్‌పాస్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి, బడా కార్పొరేట్‌ యజమానులకు, రాజీపడిన జిఎస్‌ఇఇ నాయకత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, కార్మిక సంఘాలు ఈ ఉద్యమం ద్వారా గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు.

  • గ్రీస్‌ కార్మిక లోకానికి సిఐటియు అభినందనలు !

గ్రీస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ హక్కుల పరిరక్షణ కోసం నికరంగా పోరాడుతున్న గ్రీస్‌ కార్మిక లోకానికి సిఐటియు తన సంఘీభావాన్ని, అభినందనలను తెలియజేసింది. కార్మికుల ఉపాధి భద్రతను గాల్లోకి నెట్టేసి, వారి పనిగంటలను, పని వారాన్ని పెంచేలా రూపొందించిన ఈ రాక్షస బిల్లును తీవ్రంగా నిరసించింది. కార్మికుల వేతనాలు, పెన్షన్లను స్తంభింపచేయడంతోపాటు పొదుపు చర్యల పేరుతో కార్మికుల సంక్షేమానికి ఈ బిల్లు తూట్లు పొడుస్తోంది. పలు రంగాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని రద్దు చేయాలని చూస్తోంది. అంతేకాదు, సమ్మె చేసే హక్కును నేరంగా పరిగణించే నిబంధనను బిల్లులో పొందుపరిచారు. సమ్మెకు ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. ఏథెన్స్‌, లావ్‌రియో, లెస్‌వోస్‌ సహా పలు నగరాల్లో కార్మికులు సాగిస్తున్న పోరాటానికి సిఐటియు తన మద్దతును తెలియచేసింది. మొత్తంగా గ్రీస్‌ కార్మిక లోకాన్ని, ముఖ్యంగా పిఎఎంఇని అభినందించింది. గ్రీస్‌ కార్మిక లోకం చేపట్టే చర్యలకు సంఘీభావం తెలియచేయాల్సిందిగా దేశ విదేశాల్లోని సోదర కార్మిక సంఘాలను, తను అనుబంధ సంఘాలను, సభ్యులను సిఐటియ కోరింది.