Aug 25,2023 22:27

ఏథెన్స్‌: భారత్‌- గ్రీక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఒక రోజు పర్యటన కోసం గ్రీక్‌ ఏథెన్స్‌కు మోడీ శుక్రవారం చేరుకున్నారు. బ్రిక్స్‌ సమావేశాల కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన మోడీ అక్కడ నుంచి నేరుగా ఏథెన్స్‌కు వెళ్లారు. ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జ్‌ గెరాపెట్రైటిస్‌ మోడీకి స్వాగతం పలికారు. గ్రీక్‌లో భారత ప్రధాని పర్యటించడం 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. శుక్రవారం గ్రీక్‌ ప్రధానమంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్‌ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు చెప్పారు. 'ఇరుదేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించాం. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపైనా దృష్టి సారించాం. భారత్‌-గ్రీక్‌ మధ్య నైపుణ్య వలసలను సులభతరం చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించాం' అని మోడీ తెలిపారు. గ్రీకు ప్రధానమంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా భారత్‌తో తమ సంబంధాలు చాలా మెరుగుపడ్డాయని.. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, పర్యాటక రంగాల్లో విస్తృత సహకారానికి అవకాశం ఉందని అన్నారు.
ఈ సమావేశానికి ముందు గ్రీక్‌ అధ్యక్షురాలు కాథెరినా ఎన్‌ సకెల్లారోపౌలౌతో మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీకి గ్రీక్‌లో రెండో అత్యుతున్నత పౌర పురస్కారం 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ హనర్‌' ప్రదానం చేశారు.