సమాజంలోని అట్టడుగు వర్గాల సంస్క ృతుల్ని లోతుగా అధ్యయనం చేస్తూ, ఆ సంస్కృతిని తన రచనల్లో ప్రతిఫలింపజేస్తూ, ఆ వర్గాల జీవితాల్లోని విభిన్న పార్శ్వాల్ని దృశ్యమానం చేస్తున్న రచయితల్లో డాక్టర్ వీఆర్ రాసాని ఒకరు. తెలుగులో తొంబయ్యవ దశకం తరువాత వేగం పుజుకున్న ఈ తరహా సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో ఈయన ముందున్నారు. ఈయన కలం నుంచి పురుషాహంకార కొలిమిలో మండిపోతూ బసివినుల అంతరాత్మలు వినిపించే ఘోష 'ముద్ర' నవలగాను, వీధినాటక కళాకారుల జీవన చిత్రాలు 'బతుకాట' నవలగాను; కట్టుబాట్లు, మూఢ నమ్మకాల మాటున దుర్భర జీవితాలననుభవించే స్త్రీల వేదనలు 'మట్టి బతుకులు' నవలగానూ వెలువడ్డాయి. ఇప్పుడు అట్టడుగు వర్గమైన కాటికాపరి జీవన సంఘర్షణ అనే ఒక సరికొత్త కాన్సెప్టు 'వొలికల బీడు' నవలగా రూపుదిద్దుకుంది.
మనిషి జీవితానికి ముగింపు పలికే వల్లకాడుల్లోనే అనుదినం బతుకుల్ని సాగిస్తూ సంఘర్షణకు గురయ్యే కాటికాపరుల జీవన విధానాల్లోని అనేక అంశాల్ని ఈ నవల స్పృశించింది. చిత్తూరు జిల్లాలోని ఒక కాటికాపరి కుటుంబం నిత్య వ్యవహారశైలిని సహజత్వం కోసం పూర్తిగా ఆ జిల్లా మాండలిక భాషలోనే రచయిత నవలీకరించారు. మృతదేహాల దహన సంస్కారాల మీద ఆధారపడుతూ జీవనం సాగించే దాసు, గంగి దంపతుల కుటుంబం శ్మశానంలో తంతులు సాగిస్తూ జీవిస్తుంటుంది. అయితే తంతులు రోజూ వుండకపోవడంతో వారు తాము నేర్చుకున్న కనికట్టు విద్యతో ప్రజలను ఆకట్టుకుంటూ జీవనం సాగిస్తూ వుంటారు.
కుల వివక్షలో భాగంగా అప్పుడప్పుడూ పాకీపనివాళ్లు చేసే మలశుభ్రత పనులు కూడా వారు చేస్తుంటా రు. బొందయ్య, కాశయ్య దాసు సొంత కొడుకులైతే, చనిపోయిం దనుకొని శ్మశానానికి తీసుకొచ్చిన పసిబిడ్డగా తమకు దొరికిన సిన్నమ్మికి ఆ కుటుంబం
ఆశ్రయమిస్తుంది. ఉలిగమ్మ దురాచార సంకెళ్లలో చిక్కుకొని, ఆ సంకెళ్లను తెంచుకొని పారిపోయి వచ్చిన భైరప్పనూ ఆ కుటుంబం తమ సభ్యునిగా ఆదరిస్తుంది. భైరప్ప వారిలో ఒకడై వారితోపాటు శ్మశాన తంతుల్లో చురుకుగా పాల్గొంటుంటాడు. ఈ క్రమంలో పట్టణాలు మున్సిపాలిటీలుగా మారిపోయి శ్మశానాలు కొత్త కట్టడాలను సంతరించు కుంటాయి. అయితే శ్మశానాలకు ప్రైవేటు కాంట్రాక్టర్ల వ్యవస్థ తోడవడంతో కాటికాపర్ల జీవితాలు దుర్భరంగా మారిపోతాయి. వారి ఉపాధికి గండి పడుతుంది. ఈ తతంగాన్నంతా గమనిస్తూ తన ఆలోచనలతో చైతన్నాన్ని నింపుకొనే భైరప్పలో తిరుగుబాటు తత్వం చోటుచేసుకుంటుంది. కాటికాపర్లందరినీ ఒక్కటి చేసి కాంట్రాక్టులతో శ్మశానాల్ని ప్రైవేటుపరం చేయడం తగదని, కుల వివక్షతో హరిశ్చంద్ర పేరు పెట్టిన శ్మశానాలకు వీరబాహు శ్మశానాలుగా పేర్లు మార్చాలని మేయర్‌కు వినతిపత్రం సమర్పిస్తాడు. బ్యానర్లు కట్టి దీక్షలో పాల్గొంటాడు. నినాదాలతో అతని ఉద్యమం ఊపందుకుంటుంది. ఈ నవలలో రచయిత ఒకవైపు దాసు కుటుంబం స్థితిగతుల్ని వివరిస్తూనే- మరోవైపు మగపిల్లల్ని ఉలిగమ్మలుగా మార్చే దురాచారం, బళ్లారి జిల్లా హౌస్పేటలో ప్రతి ఏటా జరిగే హిజ్రాల పండుగ, చిత్తూరు జిల్లా గంగజాతరలో మోడీ ఆడించే సంప్రదాయం వంటి సంస్కృతుల్ని మనకళ్ల ముందు నిలపడం ఈ కాన్సెప్టు వెనుక వున్న పరిశోధనాత్మక దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆదాయం కోసమే శ్మశానాల రూపురేఖల్ని మార్చేసి కాటికాపరుల కడుపుకొట్టే కార్పొరేషన్ల తీరుతెన్నుల్ని రచయిత దుయ్యబడతారు. భైరప్ప ఆలోచనా ధోరణి ఈ నవలకు ఆయువుపట్టు. అతని ఆలోచనా ధోరణికి తగినట్టుగానే సావు నాటకంగా హరిశ్చంద్ర నాటక ప్రదర్శనను ప్రవేశపెట్టడం ఈ నవలా ప్రయోజనాన్ని శక్తివంతం చేసింది. హరిశ్చంద్ర నాటక ప్రదర్శనను తిలకించిన భైరప్ప ఆలోచనా ధోరణి ఇలా సాగుతుంది...: 'ఎంత ఉన్నోడైనా, లేనోడైనా, ఎంత గొప్పోడైనా సరే అందర్నీ ఒకే మాదిరిగా కాట్లో యేసి కాల్చేది వోడే గదా. అంత మంచిగుణం వుండేవోడు కాబట్టే వీరబాహుడు ఆ మారాజును ఆదరించినాడు. ఆయనే లేకుంటే హరిశ్చంద్రుడు సచ్చేవోడే. కాబట్టి శ్మశానాలకు అసుకుళ్లు, తర్పణాలు వొదిలే చోట్లకు హరిశ్చంద్ర శ్మశానమని, హరిచ్చంద్ర ఘాటు అని పెర్లు పెట్టడం శానా దుర్మార్గం. అట్ల పేర్లు పెట్టడంలోనే పెద్ద కులాలోళ్ల కుట్ర తెలిసిపోతావుండాది'...
హరిశ్చంద్ర నాటకం భైరప్పను తీవ్రంగా ఆలోచింపజేసి అతనిలో చైతన్యాన్ని అంకురింపజేస్తుంది. మనుషుల జీవితాలు శ్మశానాల్లో ముగిసిపోయే సమయాల్లో తోటి మనుషుల్లో పొడసూపే చిత్రవిచిత్ర ప్రవృత్తులు భైరప్పతో బాటు పాఠకుడిలోనూ పలు ప్రశ్నలను రేకెత్తిస్తాయి. శవాల తంతు మానవ సంబంధాల తీరుతెన్నులనూ బట్టబయలు చేయడం ఈ నవలలో కనిపిస్తుంది. బడుగు వర్గాల్లోనూ కనిపించే కుల వివక్షను రచయిత ఎత్తిచూపడాన్ని గమనించవచ్చు.
మానవత్వం మూర్తీభవించే మనిషి శ్మశానంలో దేహాన్ని విడిచినా అతడి మనిషితనం పదిమంది హృదయాల్లో పదిలంగా చోటుచేసుకుంటుందని, స్వార్థం పెనుగాలిలో కొట్టుకుపోయే మనుషులు శ్మశానంలో దేహంతోపాటు మనిషితనాన్నీ పోగొట్టుకుంటారన్న సత్యాన్ని విడమరచి చెబుతుందీ నవల. తెలుగు నవలాసాహిత్యంలో తొలిసారిగా కాటికాపరి మౌనవేదనకు, లక్ష్యశోధనకు ప్రతిరూపంగా కనిపిస్తుంది 'వొలికల బీడు'. రూ.150 ధర ఉన్న ఈ నవల ప్రతి కోసం 98484 43610 నెంబర్లో రచయితను సంప్రదించొచ్చు.
- డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
91777 32414