Aug 10,2023 21:27
  • ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ

చెన్నై: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో గ్రూప్‌ దశలో ఓటమి ఎరుగని హర్మన్‌ప్రీత్‌ సేన మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచి ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించిన భారత్‌.. శుక్రవారం జపాన్‌తో సెమీస్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. లీగ్‌ దశలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1గోల్స్‌తో సమం కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జపాన్‌ జట్టు గ్రూప్‌ దశలో నాల్గోస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. భారతజట్టుతో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతోనే ఆ జట్టు సెమీస్‌కు చేరేందుకు దారి సుగమమైంది. గ్రూప్‌ దశ ముగిసిన తర్వాత కొరియా, జపాన్‌, పాకిస్తాన్‌ జట్లు 5పాయింట్లతో సమంగా ఉన్నా.. కొరియా, జపాన్‌ జట్లు గోల్స్‌ అంతరంతో పాక్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌కు చేరాయి. భారత్‌, మలేషియా జట్లు గ్రూప్‌ దశలో టాప్‌-2లో నిలిచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. దీంతో హర్మన్‌ప్రీత్‌ సేన్‌ ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.