ఒకరి జీవితాన్ని మరొకరు కొల్లగొడితే
ఒకరు ఇంకొకరిపై చెయ్యెత్తితే అది దాడి
దాడికి ప్రతిగా ఒక జాతి జాతినే
ధ్వంసించాలనుకుంటే అది యుద్ధం !
యుద్ధానికి యుద్ధమే
పరిష్కారమంటే అది కపట నీతి
వేల ఏండ్ల కిందట రూపు దిద్దుకున్న
రెండు జాతులు
పరస్పర హననానికి పాల్పడుతుంటే అది అజ్ఞానం
సామ్రాజ్యవాద శక్తులంతా
ప్రపంచ పోలీసులంతా ఒక్కటై
యుద్ధాన్ని యెగదోస్తూ కొమ్ము కాస్తుంటే
అది ఆయుధ వ్యాపారం
పాలస్తీనాది ఉగ్రవాదమని ఇజ్రాయెల్‌ది వీర శౌర్యమని
ప్రసార మాధ్యమాలు ఊదరగొడుతుంటే
అది దుష్ప్రచారం
భూమ్యాకాశ జల మార్గాల దిగ్బంధనంతో
యుద్ధ తుపాను సృష్టిస్తోన్న ఇజ్రాయెల్
చిగురుటాకులా వణుకుతూ
గిలగిల తన్లాడుతోన్న స్ట్రిప్ లాంటి గాజా
తెగిపడిన కంకాళాల మధ్య
విడిపడిన శరీర భాగాల మధ్య
రక్తమోడుతున్న మానవ బంధాల మధ్య
వధ్యశిలలుగా మారిన భవన శిధిలాల మధ్య
కావాలిప్పుడు వసివాడిన
పసిపిల్లల భవిష్యత్తుకు జవాబు !
నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించమన్న
మనుష్యులంతా ఒకటే సంతానమన్న
ఎక్కడ ఆ దైవ కుమారుల అడుగు జాడలు
దైవమూ లేదు
దైవ కుమారులూ లేరన్న
పచ్చినిజం బయటపడుతోంది
ప్రవక్తలూ లేరు వారి
ప్రవచనాలుకు విలువా లేదన్న
వాస్తవం వెలుగులోకొస్తోంది
మనిషిని మనిషే రక్షించుకోవాలనే
మానవత్వ సాక్షాత్కారం అవసరమన్న
సత్యం ఆవిష్క ృతమౌతోంది !
- పి. మురళీ కుమార్
93978 73331