
భద్రిగూడెం అనే పల్లెటూరికి ఏకోపాధ్యాయ పాఠశాల మాస్టారుగా శేఖరం వచ్చారు. వచ్చిన రోజునే బడి వాతావరణం గమనించారు. బూజులు పట్టిన గదులు, మురికిగా గోడలు, మీద పడేలా పైకప్పు పెంకులు చూసి బాధపడ్డారు. వెంటనే బడి పిల్లలని సమావేశ పరిచి 'పిల్లలూ, ముందు మనం మన బడిని బాగు చేసుకుందాం. తరువాతే పాఠాలు' అన్నారు. మాస్టారు అలా అన్నారో లేదో, ఒక పిల్ల బయటకు పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ అమ్మని, కొంతమంది ఊరువాళ్ళని తీసుకు వచ్చింది. 'చూడు మాస్టారు మీరు పాఠాలు చెబుతానంటే పిల్లలని పంపుతాం. కానీ బడి తుడిపించి, కడిగిస్తానంటే కుదరదు' అన్నారు వచ్చిన వాళ్ళు. 'దీనికే ఇంత కోపమైతే ఎలా? మీ పిల్లలు ఒక్కరోజు కూడా బడి మానరు అని హామీ ఇస్తే, ఇలాంటి పని చేయక్కరలేదు' అన్నారు శేఖర్ మాస్టారు.
'ఒక్కరోజు కూడా మానకుండా ఎలా మాస్టారూ.. నలతలు రావా ఏంటి?' అన్నారు వాళ్ళు. 'అందుకే మనం వుండే చోటు బాగా వుండాలి అనేది. పిల్లలు పగలంతా బడిలో వుంటారు. ఇక్కడ శుభ్రంగా లేకపోతే జబ్బు పడేది వాళ్ళే కదా!' అన్నారు శేఖర్. 'మాకు ఇలా ఎవరూ చెప్పలేదు పంతులు గారూ... పిల్లలతో పాటు మేము కూడా బడిని బాగు చేస్తాం' అంటూ తలా ఒక చేయి వేశారు వచ్చిన పెద్దలు.
ఆ రోజు మధ్యాహ్నానికి బడికి ఒక రూపు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆ ఊరి కిరాణా వ్యాపారి బడికి రంగులు వేయించాడు. నాగన్న అనే రైతు, బడి చుట్టూ మొక్కలు నాటించాడు. అందరూ డబ్బులు వేసుకుని బడికి మంచి నీటి సదుపాయం కల్పించారు. వారం రోజులకే పిల్లలకి 'ఇంటి కంటే బడి పదిలం' అన్నట్లు తయారయ్యింది. పిల్లలకి ఎంతో ఉత్సాహంగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు శేఖర్. పిల్లలకు జబ్బులు రావడం తగ్గిపోయింది. పిల్లలతో పాటు ఊరినీ బాగు చేయాలని శేఖర్ మాస్టారుకు ఓ ఆలోచన వచ్చింది.
పిల్లల హోమ్ వర్క్‌కి రెండు పుస్తకాలు కొనిపించారు. ఒకటి, వాళ్ళు రాయడానికి. రెండవది చదువుకోని వాళ్ళ అమ్మలు రాయడానికి. మొదట వ్యతిరేకించినా తరువాత పిల్లలతో పాటు వాళ్లు కూడా రాయడం, చదవడం నేర్చుకున్నారు. పిల్లలే వాళ్ళ అమ్మలకు పాఠాలు చెప్పేలా ప్రోత్సహించారు మాస్టారు. నెమ్మదిగా ఆ వూరులో అందరూ అక్షరాస్యులుగా మారారు. ఒక మంచి మాస్టారు బడినే కాదు ఊరినీ మార్చగలరని శేఖర్ మాస్టారు నిరూపించారని గ్రామస్తులు కొనియాడారు. విషయం తెలుసుకున్న అధికారులు శేఖర్ మాస్టారుకి అభినందనలు తెలిపారు.
- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.