పేదింటి అమ్మాయి ఆమె. తండ్రి కష్టపడితే వచ్చే అరకొర జీతమే ఆ కుటుంబం మొత్తానికీ ఆధారం. ఇటువంటి నేపథ్యంలో ఓ వైపు చదువుతూ.. మరోవైపు క్రీడల్లో రాణిస్తూ.. కుటుంబం మొత్తాన్నీ ఒడ్డుకు చేర్చాలని ఆ యువతి సంకల్పించింది. కష్టాలు.. ఆటుపోట్లు ఎదుర్కొంది. సరైన పౌష్టికాహారమూ దొరకని క్లిష్ట సమయంలో అరటి పండ్లునే తింటూ కఠోర సాధన చేసింది. కొద్దికాలానికే దేశం మెచ్చే గొప్ప క్రీడాకారిణిగా హార్డిల్స్‌లో తిరుగులేని మహరాణిగా ఎదిగింది. ఆమెనే మన తెలుగింటి అమ్మాయి.. యర్రాజి జ్యోతి.

గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కూ సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి యర్రాజి జ్యోతి సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంఫియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జ్యోతి ఆ పోటీల్లో స్వర్ణ పతకంతో మెరిసింది. థారులాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో గురువారం 100 మీటర్ల హార్డిల్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి ఛాంపియన్‌గా అవతరించింది. 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హార్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన ఆమె ఈ ప్రదర్శన ద్వారా వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది.
జ్యోతి భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా ఆమె జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా పతకాలు సాధిస్తోంది. వర్షం వల్ల తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన తాజా ఫైనల్ రేసులోనూ జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. భారత్ కీర్తిని వినువీధుల్లో రెపరెపలాడించింది.
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి..
జ్యోతి విశాఖపట్నంలో 1999 ఆగస్ట్ 28న జన్మించింది. ఆమె తండ్రి సూర్యనారాయణ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. తల్లి కుమారి గృహిణి. చిన్నతనం నుంచే జ్యోతికి క్రీడలంటే ఆసక్తి. ఆమెకు పరుగుపై ఉన్న ఆసక్తిని పిఇటి రెడ్డి తొలుత గుర్తించారు. సీనియర్ క్రీడాకారుడు గౌతమ్ జ్యోతికి తగు సలహాలు అందించారు. తల్లిదండ్రుల నుంచీ ఆమెకు ప్రోత్సాహం లభించింది. దీంతో పోర్టు హైస్కూలు గ్రౌండ్‌లోనూ, ఆ తరువాత గుంటూరులోనూ జ్యోతి కఠోర సాధన చేసింది. 2015లో రాష్ట్రంలోని అంతర్ జిల్లాల మీట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తరువాత ఆమె పలు జూనియర్, సీనియర్ జాతీయ మీట్‌లలో పతకాలు సాధించింది. అయితే, తండ్రికి నెలంతా కష్టపడితే ఏడెనిమిది వేలు రాని దుస్థితి. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండటం చూసిన జ్యోతి ఎంతో ఆవేదనకు గురయ్యేది. ఎలాగైనా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని భావించింది. నాడు ప్రారంభమైన పరుగును ఎన్నడూ ఆపలేదు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ సత్తా చాటుతూ వస్తోంది.

పట్టుదల.. మెరుగైన శిక్షణ
వాస్తవానికి జ్యోతి 2015లో అథ్లెటిక్స్ క్రీడలో ప్రవేశించింది. నిరంతర కఠోర సాధనతో రాటుదేలింది. రాష్ట్ర స్థాయిలో పతకాల పంట మోగించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఆటను చూసిన సీనియర్ అథ్లెట్ సాయిగౌతమ్ మరింత ప్రోత్సహించారు. అనంతరం మరింత మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని సారు సెంటర్‌లో చేరింది. 2018 వరకూ అక్కడ నిష్ణాతులైన కోచ్‌ల వద్ద తర్పీదు పొందింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందుతూ ముందుకు సాగుతోంది.
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా..
తన ఉన్నతికి తల్లిదండ్రులు పడిన కష్టాలు నిత్యం జ్యోతి కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఒలింపిక్స్‌లో పతకం సాధించి తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటానంటోంది. ఆమె క్రీడా ప్రతిభ తెలిసిన వారెవరిని కదిపినా తను మరింత ఉన్నత శిఖరాలను అందుకుంటుందనే విశ్వాసాన్నే వ్యక్తం చేస్తున్నారు. 'జ్యోతి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు నెలకొల్పుతుందని మాకు తెలుసు. మా నమ్మకాన్ని ఆమె వమ్ము చేయలేదు. త్వరలో ఆమె చైనాలో జరిగే ఏషియన్ గేమ్స్, వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటుతుంది' అని ఎపి అథ్లెటిక్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎం.నారాయణరావు 'ప్రజాశక్తి'తో అన్నారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించడంపై సిఎం జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 'జ్యోతీ, 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశావు..' అంటూ ట్వీట్ చేశారు.
- కోడూరు అప్పలనాయుడు,
94915 70765
జాతీయ స్థాయిలో బోలెడు పతకాలు
జ్యోతి ఈ ఏడాది ఏప్రిల్‌లో కజికిస్థాన్‌లో జరిగిన ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి రజిత పతకం గెలుపొందింది. ఆమె 60 మీటర్ల హార్డిల్స్‌ను 8.10 సెకెన్లలో పూర్తి చేసి ఈ ఘనత సాధించింది. హార్డిల్స్‌తో పాటు 100, 200 మీటర్ల పరుగులో సైతం పతకాలు గెలుపొందింది. జార్ఖండ్‌లో ఈ ఏడాది మే 15 నుంచి 18 వరకూ జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల హార్డిల్స్‌లోనూ విజేతగా నిలిచింది. 100 మీటర్ల హార్డిల్స్‌లో 12.89 సెకన్లలో పరుగుతీసి కొత్త రికార్డు నెలకొల్పింది. జాతీయ స్థాయిలోనే ఇప్పటివరకూ జ్యోతి 35కిపైగా పతకాలు సాధించింది.










