Aug 16,2023 15:00

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి వస్తున్నారని దుకాణాలు మూసివేయించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నుంచి ధర్మప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు మంత్రి కొట్టు వచ్చారు. అయితే మంత్రి రాకను అధికారులు గోప్యంగా ఉంచడంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. మంత్రి రాకతో ఉన్నట్లుండి ఆవరణలోని దుకాణాలను మూసివేయించారు. దీంతో యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
వ్యాపారాలు లేక దుకాణదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైసిపి నేతలు, అధికారులు తమ దుకాణాలను శాశ్వతంగా తొలగిస్తారనే భయంతో ఏమీ అడగలేదని వారు తెలిపారు. గతంలో మంత్రి శ్రీకాళహస్తికి వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున యాత్రికుల నుంచి నిరసన ఎదురైంది. ఆ కారణంతోనే మంత్రి పర్యటన వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.