
పిల్లలూ, ఈ రోజు జులై 22. మన జాతీయజెండాను ఆమోదించిన రోజు. స్వాతంత్య్రం రాకముందు కూడా జాతీయ జెండాకు అనేక రూపాలు అమల్లో ఉండేవి. అవేంటో తెలుసుకుందామా
స్వాతంత్య్రానికి ముందు 40 ఏళ్ల కిందట మొదటిసారి భారతీయ జెండాను ఆవిష్కరించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన అతి కొద్ది మంది మహిళల్లో ఒకరైన భికైజీ పటేల్ కామా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రస్తుతం మనకు తెలిసిన జాతీయ జెండా మొదటి రూపం కాదు. జాతీయ జెండా మొదటి వెర్షన్‌ను 1904లో రూపొందించారు. స్వామి వివేకానంద శిష్యురాలు భగినీ నివేదిత పసుపు - ఎరుపు రంగుతో జాతీయ జెండాను రూపొందించారు. జెండా మధ్యలో వజ్రతో బెంగాలీ భాషలో 'వందేమాతరం' అని రాసి ఉండేది.
కోల్‌కత్తాలోని పార్సీ బగన్ (ప్రస్తుతం గిరీష్ పార్క్)లో 1906, ఆగస్టు 7న తొలిసారి భారత జెండాను ఆవిష్కరించారు. ఆ జెండా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండేది. ఎగువ ఆకుపచ్చ రంగులో సగం తెరిచిన ఎనిమిది తెల్ల తామర పువ్వులు కూడా ఉండేవి. దిగువ ఎరుపు భాగంలో నెలవంక, సూర్యుడు ఇస్లాం, హిందూ మతాలను ప్రతిబింబించేలా ఉండేవి. దేవనాగిరి లిపిలో పసుపు మధ్యలో ఉన్న ప్యానెల్‌పై 'వందే మాతరం' అని రాసి ఉండేది.
1907లో హోంరూల్ ఉద్యమం సందర్భంగా బాలగంగాధర్ తిలక్ కొత్త జెండాకు రూపకల్పన చేశారు. ఈ జెండా ఎరుపు, ఆకుపచ్చ గీతలతో ఉండేది. ఎడమ వైపు ఎగువన యూనియన్ జాక్ ఏడు నక్షత్రాలపై ఉండేది. కుడివైపు పైభాగంలో చంద్ర నక్షత్రం ఉండేది.
ఆ తరువాత కూడా జాతీయ జెండాలకు అనేక వెర్షన్లు వచ్చాయి. వాటిపై చాలా వరకు ఏకాభిప్రాయం రాలేదు. చరఖా లేదా స్పిన్నింగ్ వీల్‌తో తెల్లటి గీతతో కూడిన జాతీయ జెండాను మహాత్మా గాంధీ ప్రతిపాదించారు. ఈ స్పిన్నింగ్ వీల్‌ను దేశ స్వాతంత్య్ర పోరాటానికి ప్రాతినిథ్యంగా గాంధీ మార్చారు. ఈ జెండానే తరువాతి కాలంలో ఆధునిక త్రివర్ణ పతాకానికి నమూనాగా పనిచేసింది.
1931లో భారత జాతీయ జెండాలో చారిత్రక మార్పు చోటుచేసుకుంది. కాంగ్రెస్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఆమోదించారు. ఈ త్రివర్ణ పతాకంలో పైభాగంలో కుంకుమపువ్వు, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ రంగు ఉండేది. తెల్లటి రంగు మధ్యలో నీలి రంగు స్పిన్నింగ్ వీల్ ఉండేది.
ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని 1947 జులై 22న ఆమోదించారు. జెండా మధ్యలో తెల్లటి రంగుపై చరఖాకు బదులు అశోకుని ధర్మ చక్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని రాజ్యాంగ సభ ఆమోదించడంతో జాతీయ పతాకంగా మారింది. ఈ జెండా రూపకర్త మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య.