Jun 26,2023 07:30

అన్యాయానికి గురయ్యే ప్రజల తరఫున ఒక గొంతై నిలబడడమే ఏ కవికైనా, రచయితకైనా కీలకమైన కర్తవ్యం. అలాంటి బాధ్యతతతో ఈ వారం సాహిత్య పేజీని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అక్షర స్వరంగా అందిస్తున్నాం. పోలవరం, తోటపల్లి తదితర ప్రాజెక్టు నిర్వాసితుల బాధలను, గాధలను వివరించే, వినిపించే రచనలు గతంలో ఎన్నో వచ్చాయి. 2006లో ఖమ్మ ం జిల్లా సాహితీ స్రవంతి, ఇతర సంస్థల ఆధ్వర్యాన కవులు, రచయితలు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, నిర్వాసితుల సమస్యలను స్వయంగా విని, కవితలూ, కథలూ వెలువరించారు. 'జీవన్మరణం' అనే రచనల సంకలనం, 'ముంపు' పేరిట విద్యాసాగర్‌ దీర్ఘ కవిత ఆదివాసీల అంతరంగాన్ని సాహిత్య ప్రపంచానికి బలంగా వినిపించాయి. అయితే, ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పోలవరం నిర్వాసితుల గోడును గోదారికి వదిలేసి, త్యాగజీవుల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగుతున్న పోలవరం పోరుకేక పాదయాత్రకు ఇది అక్షర సంఘీభావం. ఆలోచనాపరులైన కవులూ, రచయతల నుంచి ఇలాంటి ప్రయత్నం మరింత జరగాలి ! నిర్వాసితుల గొంతును అన్నిచోట్లా బలంగా వినిపించటానికి తమ వంతు ప్రయత్నం నిరంతరంగా చేయాలి. - ఎడిటర్‌.

కోల్పోయినోళ్ల కథ..

ది చీపురుపల్లి రైల్వే స్టేషన్‌. కోలాహలంగా ఉంది. ఆవరణంతా కిక్కిరిసిన బస్తాలా జనంతో నిండి ఉంది. చెన్నై-హౌరా మెయిల్‌ కోసమని కొట్టిశ లక్ష్మింపేట వాసులు ఎదురుచూస్తున్నారు. బతుకు తెరువు నిమిత్తం కుటుంబాలకు కుటుంబాలు పట్టణాలకు తరలిపోతున్నాయి. కొంతమంది చదువుకుంటున్న పిల్లలను తమ ముసలి తల్లిదండ్రుల వద్ద ఉంచేసి, భార్యాభర్తలు ఇరువురూ దుఃఖం దిగమింగుకొని వలస పోతున్న సందర్భమది. రైలు రాగానే నారన్నాయుడు, చిన్నమ్మి దంపతులు గబగబా జనరల్‌ కంపార్ట్మెంట్‌ లోకి దూసుకుపోయారు. బోగీ నిండు గర్భిణీలా ఉంది. అయినా ప్రయాణికులు స్టేషన్‌ స్టేషన్‌కీ ఎక్కుతూ దిగుతూనే ఉన్నారు. నారన్నాయుడు ఎలాగో ఒకలాగా పైనున్న లగేజీ పక్కన చిన్న చోటు చూసుకొని పైకి ఎక్కేసాడు. చిన్నమ్మి దగ్గర లగేజీ తీసుకొని తన పక్కనే పెట్టేడు. వాల్తేరు వరకు చిన్నమ్మి నిలబడే ఉంది. అక్కడకు రాగానే సీటు దొరకడంతో హమ్మయ్యని ఊపిరి పీల్చుకొని కూర్చుంది.
          రైలులో కొట్టిశ లక్ష్మింపేట కుటుంబాలు ఓ ముప్పై దాకా ఉన్నాయి. వారంతా ట్రైన్‌ ఎక్కడంతో కంపార్ట్మెంట్‌లో మరింత అలజడి రేగింది. అందరూ మాటలే మాటలు. ఏటి మన బతుకులు ఇలా అయ్యాయని? ఒకప్పుడు ఏడాదికి రెండు పంటలు పండే పంట పొలాలతో మన ఊళ్లు కళకళలాడేవి. ఇప్పుడు మాత్రం మన బతుకులు 'గోచీకి ఎక్కువ గుండారికి తక్కువగా' ఉన్నాయి. నాయకులంతా బంటులయ్యారు. కూలీలంతా కష్టాల్లో కూరుకున్నారు. ఒకరి కష్టం ఒకరు చెప్పుకోలేని స్థితి. ఒకర్ని ఒకరు ఓదార్చలేని పరిస్థితి. అందరి బతుకులు ఇలానే ఉన్నాయని వాళ్లు వాపోతున్నారు.
           ఇంతలో ట్రైన్‌ రాజమండ్రి రైల్వే స్టేషన్‌ కి చేరింది. రైలు దిగేవాళ్లు దిగగానే ఎక్కేవాళ్ళు ఎక్కారు. ఒక్కసారిగా ఓ ఇరవై కుటుంబాలు బోగీలోకి ప్రవేశించాయి. వాళ్లంతా ఎలాగో ఒకలాగా సీట్లు ఇరుకిరుకుగా సరిపెట్టుకొని కూర్చున్నారు. కాసేపటికి ఒకరితో ఒకరు మాట్లాడడం మొదలెట్టారు. మీదేవూరు అంటే? మీదేవూరు? అని. మామంతా సికాకులమోల్లమని కొట్టిశ లక్ష్మింపేటోళ్లు అనగానే, మేమంతా గోదారోళ్ళమండీ! అని మిగతావారు అన్నారు. ఓహౌ! మీరు చెన్నైయేనా? అంటే, మేమూ చెన్నైనే అని చెప్పారు. ఇంతలో నారన్నాయుడు తన పక్కన కూర్చున్న వారిని మీ పేరు, మీ ఊరేటని అడిగాడు.
''ఆ..అండీ నా పేరు వెంకాయమ్మ. ఇదిగోండి ఈయన మావారు. ఈయన పేరు బుల్లబ్బాయి'' అని చెప్పింది.
అంతలో నారన్నాయుడు ''ఔనండీ! మీరు గోదారోళ్లు కదా! మీకు బాగా పంటలు పండుతాయి కదా! మీరేటండీ, చెన్నై ఎల్తన్నార''ని అమాయకంగా అడిగాడు.
     దానికి వెంకాయమ్మ .. ''ఔనండీ, మీరంతా గోదారోళ్ళంటే బాగా బలిసినోళ్ళు అనుకుంటారు. మాలో కూడా పేదవాళ్ళున్నారండీ!'' అని దీర్ఘంగా ఈడుస్తూ పలికింది. దానికి నారన్నాయుడు ''అలాగేటండీ మీలో పేదోళ్లున్నారా!'' అని ఆశ్చర్యంగా అడిగాడు. మీవోళ్లు బాగా చదువుకున్నోళ్ళని, తెలివైనోళ్ళని అందరూ అంటుంటారని, అమాయక చక్రవర్తిలా మొహం పెట్టేడు.
         దానికి వెంకాయమ్మ ''నిజమేనండీ! మా చదువూ, మా జ్ఞానమూ ఎందుకూ పనికిరానివి. మా ఊరు రాపాక. మాది పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామం. ప్రభుత్వం మమ్మల్ని వేరే చోటుకు తరిమేసింది. మాకు ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా ఇవ్వకుండానే తగిలేసింది.'' అంటూ బాధతో నిట్టూర్చింది.
''ఔనటండీ, మీకు ఆరండార్‌ ప్యాకేజీ వచ్చింది కదా! ఒకపక్క ఇల్లూపొల్లూ ఇస్తారు కదండీ. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదండీ!'' అన్నాడు నారన్నాయుడు.
''ఏం పునరావాసమో? ఏం పరిహారమోనండీ? అవి ఎప్పుడు అందుతాయో! లేదో తెలియని పరిస్థితి. అంతవరకు మేము పల్లీగల్లించుకొని కూర్చోవాల్సిందే!'' అన్నాడు అన్నాడు బుల్లబ్బాయి.
''కొంతమందికి అప్పటి ప్రభుత్వం ఎకరాకు లక్షే ఇచ్చింది. ఇప్పటి నాయకుడు మాత్రం తన పాదయాత్రలో ఎకరాకు ఐదు లక్షలు ఇస్తామన్నాడు. తీరా అధికారం వచ్చాక, ఆ హామీలన్నీ అటకెక్కిపోయాయి.''
        దానికి చిన్నమ్మి ఇలాగంది. ''ఓసోసి అలాగా! మామూ మడ్డువలస రిజర్వాయర్‌ ముంపు గ్రామస్తులమే. మా ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి నలభై ఆరేళ్లయ్యింది. మా భూములకిచ్చిన డబ్బులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. అవి మా ఆడపిల్లల అక్కెమ్మల పెళ్లి ఖర్చులగా మాసిపోయాయి. మా జ్వరాలకి జబ్బులకి జలగడిగీసాయి. ఇప్పుడు మాకు భూమి లేక, కూలి దొరక్క, మా ఊర్లో ఉండలేక చెన్నై బయల్దేరాం. ఇంకా మా బొబ్బిలి గుడ్డులకు డబ్బులు అందనేలేదు. ఆ డబ్బులు రాజులకివ్వాలా! రైతులకివ్వాలా! అని ప్రభుత్వం ఆలోచిస్తన్నాది. కోర్టులు కూడా తేల్చలేకపోతున్నాయి. ఇప్పుడు మీరు ఆరండార్‌ ప్యాకేజీలంతన్నారు. అవేవీ మాకు తెలీదు. పచ్చ పచ్చని పంట పొలాలతో అద్దం భరణిలా ఉన్న మా ఊరు, గంగమ్మ ఒడిలో కలిసిపోయింది. ఇప్పుడు పునరావాసంగా ఇచ్చిన ఊరు మాత్రం మనుషులు లేక శ్మశానం దిబ్బలా మారింది. ఉద్యోగాలు సద్యోగాలు ఉన్నోళ్లు, ఆమాత్రమీమాత్రం ముందు జాగ్రత్తగా వొడ్డీలకీవోసీలకిచ్చి గడించిన పెద్దోళ్ళు పట్నాలకు పోయి దర్జాగా బతకతన్నారు. మామూ ప్రాజెక్టుకి ఆనుకుని ఉన్న కొత్తూరులో దీనంగా కాలం ఎల్లదీత్తన్నాం. తాగడానికి పనికిరాని నీటితో సావాసం సేత్తన్నాం. జలగలు, పాములు, కప్పలు, తాబేళ్లు మా ఇళ్లల్లో దూరిపోతున్నాయి. భయం భయంగా బిక్కుబిక్కుమంటూ బతకతన్నాం. పండించుకోవడానికి భూములు లేవు. బతికేందుకు ఎటువంటి ఆధారం మాకు లేదు. పిల్లాజల్లలతో ఉపవాసాలు చేస్తూ బతుకు ఈడుసుకొత్తన్నాం. దాంతో ఈ బాధల నుండి ఇముక్తికే చెన్నై బయల్దేరామ''ని వరసగా పేర్చుకొచ్చింది.
       ఇంతలో సాదాసీదాగా కనిపించే ఓ పెద్దమనిషి వారి మాటలు విని. ''కమ్యూనిస్టులు నిర్వాసితుల తరఫున 'పోలవరం పోరుకేక' పెడుతున్నారు. అది మీకు ప్రయోజనకారి కావచ్చ''ని అనడంతో అక్కడ ఉన్న నిర్వాసితులంతా ఊరట చెందారు. అలా అలా సికాకులపోల్లు, గోదారోళ్ళు కలగలిసి ఎర్రజెండా కబుర్లలో మునిగిపోయారు.
 

- పిల్లా తిరుపతిరావు
70951 84846