
- భీమవరం కలెక్టరేట్లో ప్రకాశం పంతులు జయంతి వేడుక
ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమగోదావరి) : టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి అందరికి ఆదర్శనీయమని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, తదితరులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టడం జరిగిందన్నారు. 1940-50వ దశకంలో ఆంధ్రా రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకమైనదని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ధనికుల ఇళ్ళల్లో వారాలు చేసుకొని కష్టపడి చదువుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయమన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం పంతులు త్యాగ నిరతి, అశయాలు, వ్యక్తిత్వం ద్వారా స్ఫూర్తి పొందాలన్నారు. టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించారన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు స్వయంగా పర్యటించి పరిస్థితులను చక్కదిద్దేందుకు టంగుటూరి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.కృష్ణ వేణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.వి.అర్.కె.ఎస్.ఎస్ గణపతిరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.