
ఒకప్పుడు కిచకిచమంటూ ... మన చుట్టూ తిరుగుతూ ... అద్దంలో తమను తాము చూసుకొని మురిసిపోతూ... ధాన్యం కళ్లంలో దండులా వచ్చి వాలుతూ ... మనలో ఒక భాగంగా వర్థిల్లిన పిచ్చుకలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? ఎందుకు పోయాయి? అవి మళ్లీ రావా? కిచకిచమని పలకరించవా? ... ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తన పరిశోధనతో జవాబులు తీసుకొచ్చారు డాక్టర్ వీరా మహేష్. ఆయన పిచ్చుకల పరిరక్షణపై ప్రత్యేక పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

ఒకప్పుడు మనం నిద్ర లేవగానే కళ్లముందు కనిపించే చిన్ని నేస్తాలు పిచ్చుకలు. ఇంటి చూరుల్లోనూ, గోడల నెర్రెల్లోనూ గూళ్ళు కట్టుకుని జీవించేవి. క్రమేణా మన జీవన విధానంలో వచ్చిన మార్పులు ఈ చిన్ని ప్రాణుల జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి. ఫలితంగా గత కొన్నేళ్లుగా పిచ్చుకల సందడీ, సంఖ్యా తగ్గిపోయింది !
నిజానికి పిచ్చుకలు మన నుంచి ఎందుకు మాయమయ్యాయో తెలుసా? మనం మన ఇళ్లను పటిష్టం చేసుకొని, ఆధునికం చేసుకొని, వాటికి ఆవాసాలు లేకుండా చేయడం వల్ల! అవి ఇల్లు కట్టుకోవటానికి అవకాశం ఇసుమంతైనా ఇవ్వకపోవడం వల్ల! ఈ సంగతి మహేశ్ పదేళ్ల పరిశోధనలో తేలింది. సెల్ టవర్లో, మరొకటో ప్రధాన కారణం కాదు. ఇంటి చూరులు లేకపోవడం, దొర్లాడేందుకు ఇసుక కుప్పలు లేకపోవడం ... పిచ్చుకల ఉనికికి ఉపద్రవంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన వీరా మహేష్ 2012లో స్పారో (స్పారో ప్రొటెక్షన్ అండ్ రీహేబిటేషన్ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఆధ్వర్యాన పిచ్చుకల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు.

1920 నుంచే క్షీణత ప్రారంభం
మన ప్రాంతాల్లో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకూ ఇంటి పరిసరాల్లో, పంట పొలాల్లో, బియ్యం మిల్లుల వద్ద పిచ్చుకలు ఎక్కువగా కనిపించేవి. తరువాత పెద్దఎత్తున కనుమరుగు కావడం మొదలైంది. పాశ్చాత్య దేశాల్లో అయితే, 1920 నుంచి వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టెక్నాలజీలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న అపార్టుమెంట్లు, భవనాల సంస్కృతి వాటి ఆవాసాలను దెబ్బ తీశాయి. మన గ్రామల్లోనూ ఇళ్లకు చూరులు లేకపోవటం, పొలాల్లో క్రిమిసంహారక మందులు మితిమీరి వినియోగించటం వంటివి ఈ చిన్ని ప్రాణి మనుగడపై పెను ప్రభావం చూపించాయి.
కృత్రిమ ఆవాసాలతో ...
మరి పిచ్చుకల పరిరక్షణ ఎలా? అని మహేష్ ప్రత్యేక పరిశీలన, పరిశోధన చేశారు. పిచ్చుకల వృద్ధి కోసం కృత్రిమ ఆవాసాలను ఏర్పాటు చేయటం ఒక్కటే మార్గమని భావించారు. తొలుత పిచ్చుకలు ఉండే ప్రాంతాలను, వాటి గూడులను పరిశీలించారు. కృత్రిమ ఆవాసాల ఏర్పాటు, వాటికి రక్షణ చర్యలు, సౌకర్యాలు వంటి వాటిపై దృష్టి పెట్టారు. పిచ్చుకల ఆవాసానికి అనుకూలమైన గూళ్లను రూపొందించారు. వాటిని పిచ్చుకలు సంచరించే ప్రదేశాల్లో ఉంచారు. వాటిని నిరంతరంగా పరిశీలిస్తూ, 'కృత్రిమ ఆవాసాలు- పిచ్చుకల ప్రజననం'పై పరిశోధన చేశారు.

తొలుత 400కు పైగా చెక్క పెట్టెలతో చేసిన గూళ్లను జంగారెడ్డిగూడెం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉంచారు. ఆ గూళ్లను నిరంతరం పరిశీలించేవారు. ఏర్పాటు చేసిన ఎన్ని రోజులకు వాటిలోకి పిచ్చుకలు వచ్చి చేరాయి? ఎన్ని సార్లు ఆ ఆవాసాన్ని సంతతి వృద్ధి కోసం వినియోగించుకున్నాయి? ఈ ఆవాసాల్లోకి అవి చేరటానికి ఎలాంటి అంశాలు ఫ్రభావితం చేశాయి? తదితర కోణాల్లో పరిశోధన చేశారు. జంగారెడ్డి గూడెం పట్టణాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌లో నాలుగు ట్రాంసెక్ట్‌లు ఉంచి ఈ పరిశోధన చేశారు. పిచ్చుకల సంతతిలో వచ్చే మార్పులను ప్రతి మూడు సీజన్లు (వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం) ఆఖరులో గణించారు. చెక్కపెట్టెలకు, బయట నిర్మించిన గూళ్లకు మధ్య ఉండే నిర్మాణ, రక్షణ కారకాలను సైతం పరిశీలించారు. చెక్క పెట్టెల్లో అయితే, పిచ్చుకలు తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, తక్కువ పరిమాణపు గడ్డితో గూడును నిర్మించుకున్నాయని తేలింది! మొత్తానికి పిచ్చుకలకు మనం ఒక చిన్ని ఆవాసాన్ని కల్పిస్తే- అవి కిచకిచల సందడితో మనల్ని మురిపిస్తాయని తేల్చి చెప్పారు.
- యడవల్లి శ్రీనివాసరావు

సెల్ టవర్ల ప్రభావం లేదు
పిచ్చుకల సంఖ్య తగ్గిపోవటానికి సెల్ టవర్లు ఒక ప్రధాన కారణమని ప్రచారం ఉంది. కానీ, అది నిజం కాదని నా పరిశోధనలో వెల్లడైంది. రేడియేషన్‌ను వివిధ ప్రాంతాల్లో 'ఎలెక్ట్రో మాగటిక్ టెస్టర్'ను ఉపయోగించి (100 మీటర్ల లోపు, 200 మీటర్లు, 300 మీటర్లు దాటి) విద్యుదయస్కాంత వికిరణ శక్తిని కొలిచాను. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ గూళ్లలో పిచ్చుకల ప్రజననం, వాటి సంఖ్యను నిరంతరం గమనిస్తూ వచ్చాను. సెల్ టవర్ల నుంచి 300 మీటర్లలోపు 2014లో వాటి సంఖ్య పిచ్చుకల 20 ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 200 వరకూ పెరిగింది. రేడియేషన్ ప్రభావం పిచ్చుకల మనుగడ, సంతతి, ఉత్పత్తిపై లేదని తేలింది. మన దేశంలో 2003 నుంచి సెల్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. కానీ, అప్పటికే పిచ్చుకల సంఖ్య బాగా తగ్గిపోయింది. పిచ్చుకల జీవనానికి దోహదపడే పరిసరాలు లేకపోవడమే అందుకు కారణం. మన చుట్టూ చెట్లను పెంచుతూ ప్రకృతిని పరిరక్షించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో పిచ్చుకలు కీలకపాత్ర పోషిస్తాయి. నా పరిశోధనకు కృష్ణా విశ్వవిద్యాలయం బయో సైన్సెస్ అండ్ బయో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ లంకా సుశీల చక్కగా గైడ్ చేశారు.
- డాక్టర్ వీరా మహేష్
స్పారో వ్యవస్థాపకులు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా.