మీతూకపురాళ్లతో మీరు బేరీజు వేస్తారు కదూ? అని భుజంగరావు తన కవితా సంపుటిలో అడుగుతున్నాడు. ఇంత వినమ్రంగా అడుగుతున్నా డంటే- ఈ కవి నేర్చుకోవడానికి, మరింత అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. అంతకుముందు కవిత్వం అనుభూతిపూర్వకంగా ఉండేది. ఆ తర్వాత సామాజిక పరిణామం, చైతన్యం, ప్రజాస్వామీకరణ చెందింది. ఏది ఉత్తమ కవిత్వం అనే ప్రశ్నకు ఎవరి వాదనలు వాళ్లకు ఉంటాయి. బౌద్ధికమైన కవిత్వమే కవిత్వం అని కొందరు నిర్ధారించుకున్నారు. కాదు, సమాజాన్ని కాదని నువ్వు ఏం రాస్తావు అని మరికొందరు ఆ విధానంలో సాగిపోతున్నారు. ఈ రెండిటినీ మేళవించి రాసుకుబోయే కవులూ ఉన్నారు. మానవ జీవితంలోని అన్ని కోణాలు మనకు తెలియాలంటే, అన్ని ఉద్వేగాలని మనం సజనాత్మక ప్రక్రియలోకి తీసుకురావాల్సిందే! అయినప్పటికీ వివిధ కారణాల వల్ల కవిత్వం చదివే వారి సంఖ్య తగ్గిపోతుంది అనే సత్యాన్ని ఒప్పుకు తీరవలసిందే !
ఇలాంటి సందర్భంలో 'నీటి గింజల పంట' అంటూ ఉత్తరాంధ్ర నుంచి భుజంగరావు కవిత్వ దిగుబడిని పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో కవిత్వం వయసు 17 ఏళ్లు. మరి ఇంతకాలం తాను పుస్తకం వేయలేదా అంటే- ఒక దీర్ఘ కవితను, నానీలు పుస్తకాన్ని తీసుకొచ్చాడు. నిశ్శబ్దంగా ఉంటూనే సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ వచ్చాడు. రెండు మూడేళ్లుగా భుజంగరావు వాక్యం పత్రికల్లో, వెబ్ మ్యాగజైన్లలో మనం చదువుతూ ఉన్నాం. అన్నం పెట్టే రైతు, మొలిచే మట్టి, కష్టాల్లో ఉన్న సేద్యం, ప్రపంచీకరణ, జీవవైవిధ్య పరిణామాలు, ఉత్తరాంధ్ర వలస దు:ఖం, అధ్వానం అయిన ఉద్ధానం జీవితం, కొంత వైయక్తిక జీవితం... తన కవితల్లో దర్శమిస్తాయి. సాహిత్యానికి, జర్నలిజానికి తేడా ఉంటుంది. నువ్వు చెప్పదలుచుకున్న అంశానికి సరైన వ్యక్తీకరణ, అనుభవం, అది పాఠకుల్లోకి ప్రసారం కాగలిగే శక్తి లేనప్పుడు కవికి పాఠకుడికి మధ్య బంధం ధ్వంసం అయిపోతుంది. కవి వాక్యం మనలో ఉద్వేగం కలిగించకపోతే, అక్కడ కవి విఫలం అయినట్టే !
ఈ కవి ఈ దేశ అమృతోత్సవ వేళ అసలు నిజాన్ని నిజాయితీగా కవిత్వీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దేశ నాయకుడు ప్రతి ఇంటిపైన జెండా ఎగరాలి అనే పిలుపు ఇచ్చినప్పుడు భుజంగరావు కొన్ని ప్రశ్నలను ఎగరేస్తున్నాడు. ఈ దేశంలో సూర్యోదయం, అనంతమైన భరోసా, ఉదయాల కోసం ఎదురుచూపులుగా సామాన్యులు కరిగి పోవడాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ దేశాన్ని కమ్మేసిన నీడ గురించి పరిశీలించమంటున్నాడు. ఆ నీడ ఎక్కడెక్కడికి వ్యాపించిందో వ్యాపించిన చోట ప్రజల బతుకులు ఏమయ్యాయో గమనించమంటున్నాడు.
''పెట్టుబడి ఒక్కటే/
వీసాలేకుండా దేశాలు తిరిగేస్తుంది
ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ
వేరే ఎవరికైనా ఉందంటారా?''
ఈ వాక్యాల్లో పెద్ద అలంకారికత ఉండక పోవచ్చు. ఒక చిన్న ఊహ ఉంది. అయితే ఆ ఊహలో వాస్తవికత ఉంది. ఎవరికి స్వేచ్ఛ ఉందో, దేనికి స్వేచ్ఛ ఉందో చెప్పడం ద్వారా ఈ కవిత ఒక బలమైన కవితగా నిలబడింది. భుజంగరావు ఈ కవిత ద్వారా ఏదైతే ఆశించాడో పాఠకుడిగా నేను దాన్ని పొందగలిగాను.
''ఇప్పుడిక దేశభక్తి అంటే
తిరంగా సెల్ఫీ కాదు సామి
రెక్కల మీది వివక్ష బరువుతో
తరాలుగా కూలబడిన పిట్టలకు
రెక్క విదిల్చే తెగువనివ్వడం'' 75 ఏళ్లుగా ఈ ప్రశ్నలను అనేకమంది కవులు వేస్తూనే ఉన్నారు. ఈ కవి స్పందించిన సందర్భం వేరు. పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ, సామాన్యులకు లేకపోవడం అనే ఆలోచన ఈ కవి చేయడం కొత్తచూపుగా అనిపిస్తుంది. ఇలాంటి లక్ష్యం కలిగిన మరో కవిత ''అమృతమెవరికి?''. ఈ కవితకు ఆత్మ లాంటి వాక్యాలు ...
''రాజ్యాంగ పీఠిక మీద
పీఠమేసి కూర్చున్న ఐరావతం
మహాసంపన్న కుటుంబాల వ్యాపార
కల్పవృక్షాల కిందకి కామధేనువయి కదిలిపోతుంది'' అని చెప్తూ చిన్న గొట్టంతో బస్తా పొట్టలోకి పొడిచి, కొన్ని కేజీల బియ్యం కాజేసినంత లాఘవంగా ఈ దేశపు బడ్జెట్ దేహం నుంచి నేరుగా కొన్ని జలగలు, ఈ దేశపు సామాన్యుల చెమట, నెత్తుర్ని పీల్చి, కులం పేరుమీద ఓటు తరలి పోవడాన్ని గుర్తించమంటాడు.
'రెయిన్ బో సర్పెంట్' కవితలో కవి చేసిన ఊహలు పాఠకుణ్ణి మెప్పిస్తాయి. జీవపరిణామ క్రమాన్ని చెప్పుకు పోతూ, డబ్బు చుట్టూ మనిషే కాదు, భూమే తిరుగుతోందని అంటాడు.
''సృష్టిలో మొట్ట మొదటి నాణెం లాంటి
ఒక జీవి ఉద్భవించే ఉంటుంది
అందుకే ఇప్పుడు, విశ్వమంతా కరెన్సీ వాసన'' అంటాడు.
ఈ కవి అభివృద్ధి సాకులో జరిగే విధ్వంసాన్ని గురించి రాశాడు. స్త్రీ అస్తిత్వాన్ని గుర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాడు. జీవితం ఊపిరి బొట్ల కానుక అనే ఆశావహ దృక్పథాన్ని తీర్మానిస్తాడు. 21వ శతాబ్దపు పౌరుడిగా యుద్ధాన్ని నిరసించాలని పిలుపునిస్తాడు. దేహం ఒక మట్టిపొర, మనసు ఒక గాలిపొర అని తత్వాన్ని బోధిస్తాడు. చెమటను నిషేధించేద్దాం అని ఒక విరోధ భాసని వినిపిస్తాడు. కవిత్వమే నా కుడిచేయని ప్రకటిస్తాడు.
''పెరట్లో చింతచెట్టు'' కవిత పురాజ్ఞాపకాల కలబోత. ఎత్తుగడలో లినేయషన్ కొద్దిగా జాగ్రత్తగా చేసి ఉండాల్సింది. ఆ కవితలో చేసిన ఊహలు బావున్నాయి. మబ్బుల కొంగుపట్టుకుని ఆకాశాన్ని ఈదుకొచ్చే పిట్టలు మా చూపుల్ని ఎత్తుకుపోయి కొమ్మలపై వాలేవి, కొండరాళ్ల నీడ చెరువులో అలలకు కొత్త కొమ్మల్ని మొలిపించడం ... వంటి వాక్యాలు కవితకు బలాన్నిచ్చాయి. వైయక్తిక అనుభవాన్ని శక్తివంతంగా ఎలా చిత్రీకరించవచ్చో చెప్పటానికి ఈ కవిత ఒక ఉదాహరణ.
ఇవాళ వర్చువల్ జీవితం మనిషిని ఎంత ఒంటరి చేసిందో 'వర్చువల్ వాగులో ఒంటరి పక్షి' కవితలో సమర్థవంతంగా చిత్రీకరించాడు. ప్రళయానికి ముందుమాట, పచ్చందనాలు గెలుపు లాంటి కవితల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశాడు. స్త్రీ గురించి చెబుతూ, ఆమెలో అమ్మతనాన్ని, అందులోని ప్రేమ సముద్రాన్ని తలచుకుంటూ అలల ఆటబొమ్మలతో తీరం పిల్లను లాలిస్తుందని అనడం కొత్తగా ఉంది.
''ఈ తలకిందులు ఛట్రంలో
పాలితులంటే నిర్వాసితులే
ప్రతి సెంటు పచ్చని పంట భూమి
ఏదో ఒక కొత్త ప్రాజెక్టు కింద
అస్తిపంజరమే!'' అని నిర్ధారిస్తూ తలకిందుల స్వర్గాన్ని పట్టి చూపుతాడు. నాన్నను చెమటపూల చెట్టుగా. తన ఊరును మట్టి గంగలో ఓటి పడవగా పాఠకుల ముందు నిలుపుతాడు.
ఈ కవికి కొత్త పదబంధాలను ప్రయోగించా లనే తహతహ ఎక్కువ. వెన్నెల పిడికిలి, గొడ్డు మేఘం, మేతకొచ్చిన మేఘం, ఉగ్గుచుక్కల ఊట, మట్టి పొద్దులు, పదాల ప్రయోగశాల, పాలకంకుల పాట, పదాల పసరు, డిజిటల్ వాన, వర్చువల్ వాగు, శాఖ శకం, సుగందాల పడవలు, ఊపిరి గుట్ట లాంటి కొన్ని పదాల్ని ఈ పుస్తకంలో చూడొచ్చు. పదాల వ్యామోహం కొన్నిచోట్ల పఠనీయతకు అడ్డు తగలడం కూడా మనం గమనించవచ్చు. కుర్ర కాలువ, కుర్ర నవ్వులు, కుర్రవీధులు, కుర్ర పున్నమి వంటి పదబంధాల్లో కుర్ర పదాన్ని రిపీట్ కాకుండా చూసుకోవాల్సింది. మొలక ఇతని అభిమాన పదం. కొన్ని కవితలు ఈ పుస్తకంలో అవసరం లేనట్టు అనిపించాయి.
ఒక పాఠకుడిగా నేను గమనించిన అంశాలు :
1. వస్తువు ఎంపిక సమకాలీనం. దృక్పథంలో స్పష్టత ఉంది. 2. కవిత్వం పట్ల ఆరాధన ఉంది. కవిత్వ నిర్మాణం పట్ల ఎరుక ఉంది. 3. విభిన్నంగా చెప్పాలనే కోరిక అన్వయ దోషాల వైపు తీసుకెళ్తోంది. 4. విశేషాలయి, విషయాలయి వీటిని విశేషాలై, విషయాలై అనడం ద్వారా శిల్పం దెబ్బతినకుండా ఉంటుంది. 5. కవికి స్వీయ నియంత్రణ అవసరమని గుర్తించాలి. ఔచిత్యం అక్కడక్కడ గమనించుకోవాలి.
''ఇది గిజిగాని పచ్చని వెన్నెల గూడు / మాలాంటి చెమట పిట్టలకు / మంటి ఆకాశం.''
ఈ విధంగా కవి నీటి గింజల పంట అంటూ మన ముందుకు వస్తున్నాడు. కవిత్వంతోనే తన ఊపిరి వెలిగించుకుంటాడని, కవిత్వంతోనే తన ఆయువు పొడిగించుకుంటాడని ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్న కంచరాన భుజంగరావు కవిత్వాన్ని సాహిత్య అభిమానులు, కవులు పాఠకులు ఆదరించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
- డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547










