
- 'సిఐటియు'తో కార్మికుల జీవితాల్లో వెలుగు
- టిటిడిలో ఆరువేల మందికి వేతనాల లబ్ది
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం ఫలించింది. ఆరువేల మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో 3,500 మంది పారిశుధ్య కార్మికులకు, 2,500 మంది ఎఫ్‌ఎంఎస్ (ఫెసిలిటీ మేనేజిమెంట్ సర్వీసు) కార్మికులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా మూడు శాతం వేతన పెంపు చేయనున్నట్లు వెల్లడించింది. టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం వెనుక రెండు దశాబ్దాల పాటు సిఐటియు ఆధ్వర్యంలో జరిపిన పోరాటం ఉంది. జీతాల పెంపుతో పాటు శ్రీవారి లడ్డు కార్డు, బస్ పాసు, దర్శనం అవకాశం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
- టిటిడిలో 1991 నుంచి కాంట్రాక్టు వ్యవస్థ
టిటిడిలో 1991 నుంచి రెగ్యులర్ పోస్టుల భర్తీని ఆలయ అధికారులు నిలిపేశారు. ఒకప్పుడు 18 వేల మంది పర్మినెంట్ కార్మికులు ఉండగా రిటైర్డ్ అవుతూ దాదాపు ఎనిమిది వేలకు కుదించబడ్డారు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను నింపుతూ వచ్చారు. ప్రస్తుతం వీరి సంఖ్య టిటిడిలో 16 వేలు దాటింది. ఎప్పటికైనా పర్మినెంట్ చేస్తారన్న నమ్మకంతో రూ.2,500 నుంచి రూ.3 వేల జీతం తీసుకుంటూ పని చేస్తున్నారు. తిరుమలలో రోడ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, యాత్రికులు ఖాళీ చేసిన కాటేజీలను శుభ్రం చేయడం వంటి పనులు వీరు చేసేవారు. పరిశుభ్రతలో ప్రంపంచంలోనే తిరుమల నంబర్ వన్‌గా ఉందంటే వీరు అందిస్తున్న సేవలే కారణం. జీతాలు పెంచాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తూ రెగ్యులర్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు దశలవారీగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు 20 సంవత్సరాల తరువాత జీతాలను పెంచుతూ టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.12 వేలు వేతనం ఇస్తున్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్ పోను రూ.9 వేలు చేతికి తీసుకుంటున్నారు. పెంచిన జీతం అమల్లోకి వస్తే ఇఎస్‌ఐ, పిఎఫ్ పోను రూ.14 వేలు చేతికి అందనుంది.
- 'సిఐటియు' వల్లే మా బతుకుల్లో వెలుగు : పార్థసారథిరెడ్డి, ఎఫ్‌ఎంఎస్ కార్మికుడు
20 ఏళ్లుగా మా హక్కులు, జీతభత్యాల కోసం ఎర్రజెండా నీడలో పోరాడుతూనే ఉన్నాం. సిఐటియు ఎల్లపుడు ప్రత్యక్షంగా మా వెన్నంటే ఉంది. జీతాల పెంపుదల సాధించామంటే సిఐటియు పోరాటాల ఫలితమే. టిటిడి చైర్మన్‌కు, ఇఒకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
- పోరాటాల ఫలితమే వేతనాల పెరుగుదల : టి.సుబ్రమణ్యం, యూనియన్ గౌరవాధ్యక్షులు
సిఐటియు ఆధ్వర్యంలో టిటిడిలో అలుపెరుగని పోరాటాలు చేసిన ఫలితంగానే కార్మికులకు ఐదువేల రూపాయల వేతనం పెరిగింది. రెండేళ్లుగా వివిధ దశల్లో పోరాటాలను విస్తృతంగా చేశాం. 14 రోజులపాటు టిటిడి పరిపాలనా భవనం ఎదుట వేలాదిమందితో ఎండవాన, రాత్రి పగలు తేడా లేకుండా దీక్షలు చేపట్టాం. ఈ సందర్భంగా కార్మికులపై, నాయకులపై 14 కేసులు నమోదయ్యాయి. కార్మికులు ఐక్యంగా పోరాడిన ఫలితంగానే వేతనాలు పెరిగాయి.