Nov 11,2023 09:42
  • ఇంకా సిద్ధం కాని మెమోరాండం
  • ప్రకటించిందే తక్కువ మండలాలు
  • కరువు సహాయ చర్యలకు నిధులడగలేని స్థితి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : యావత్‌ రాష్ట్రాన్నీ దుర్భిక్షం పీడిస్తున్న సమయాన, కరువు మండలాల గుర్తింపే లోపభూయిష్టంకాగా, ప్రకటించిన మేరకైనా కేంద్రాన్ని సకాలంలో నిధులడిగే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. కేంద్ర కరువు మాన్యువల్‌ ప్రకారం కరువును ప్రకటిస్తూ గెజిట్‌ విడుదల చేసిన వారంలో కేంద్రాన్ని సహాయం కోరుతూ రాష్ట్ర సర్కారు సమగ్ర విజ్ఞాపన పత్రం సమర్పించాలి. కరువు మండలాల ప్రకటనపై నాన్చిన ప్రభుత్వం, డెడ్‌లైన్‌ చివరి రోజున ఆఖరి గడియల్లో గెజిట్‌ జారీ చేసింది. అక్టోబర్‌ 31 అర్థరాత్రి ఉత్తర్వులొచ్చి పది రోజులు గడిచినా నష్టం అంచనాలు, కావాల్సిన ఆర్థిక సహాయంపై కేంద్రానికి పంపాల్సిన మెమోరాండం ఇంకా సిద్ధం కాలేదు. అదే పనిలో తలమునకలై ఉన్నామని సంబంధిత శాఖాధిపతుల (హెచ్‌ఒడి) కార్యాలయాలు వెల్లడించాయి. సమగ్ర వివరాలు సేకరించాల్సి రావడంతో భారీ కసరత్తు చేయాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అన్ని డిపార్టుమెంట్లూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్‌ఒడికి పంపాల్సి ఉంటుందని, వినతిపత్రం పూర్తి స్థాయిలో రెడీ కావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపారు.
 

                                                                      కాస్త ఎక్కువే అడుగుతారు

ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో విపత్తు సహాయ నిధులివ్వాలో ఐదేళ్లకోసారి ఫైనాన్స్‌ కమిషన్‌ నిర్ణయిస్తుంది. ఇది స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డిఆర్‌ఎఫ్‌). నిర్ణయించిన నిధుల్లో 90 శాతం కేంద్రానికి, 10 శాతం రాష్ట్రానివి ఉంటాయి. ప్రత్యేకంగా విపత్తులొచ్చినప్పుడు నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) నుంచి కేంద్రం రాష్ట్రాలకు నిధులిస్తుంది. ప్రత్యేక సాయం కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్‌ నిధులు అడగాలి. అందుకు డిపారు ్టమెంట్ల వారీగా నష్టం అంచనాలు, శాశ్వత, తాత్కాలిక సహాయక చర్యల కోసం ఎన్ని నిధులు కావాలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించాలి. సాధారణంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రాష్ట్రాలు కొంచెం ఎక్కువే నిధులడుగుతాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు అడగడానికే జంకుతున్నట్లు కనిపిస్తోంది. ఆచితూచి వ్యవహరిస్తోంది. కరువు గుర్తింపును నాన్చినట్లుగానే కేంద్రానికి గడువు లోపు వినతిపత్రం పంపడంలోనూ తీరని తాత్సారం చేస్తోందన్న విమర్శలొస్తున్నాయి.
 

                                                                              ప్రయత్నమే లేదు

రాష్ట్రంలో ఖరీఫ్‌ చివరాఖరుకు 300 పైగా మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉంది. అక్టోబర్‌లో, నవంబర్‌లో ఇప్పటి వరకు సరైన వానల్లేవు. లక్షల ఎకరాల్లో సాగు లేకపోగా, సాగు చేసిన లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. అయినా ప్రభుత్వం 80 తీవ్ర స్థాయి. 23 మధ్యస్త స్థాయి... వెరశి 103 కరువు మండలాలనే ప్రకటించింది. ఆ ప్రకటించిన మేరకు చూసినా వ్యవసాయం, హార్టికల్చర్‌ శాఖల పరిధిలో రైతులను ఆదుకోవాలంటే భారీగా నిధులు కావాలి. రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు పనుల్లేక వలసలు పోతున్నారు. గ్రామీణ పేదలకు పనులు కల్పించాల్సి ఉంది. పశుగ్రాసం, పశువులకు తాగునీరు, అనావృష్టి పీడిత ప్రజలకు రక్షిత తాగునీరు తక్షణావసరాలుగా ఉన్నాయి. వీటన్నింటికీ పెద్ద ఎత్తున నిధులు కావాలి. త్వరగా కేంద్ర బృందాలను పంపి నష్టం అంచనాలు వేయించి నిధులు సాధించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లేదని వినతి పత్రం తయారీలో నెలకొన్న జాప్యాన్ని బట్టి తెలుస్తోంది. ప్రత్యేకంగా తమ ఎంపిలను ఢిల్లీలో మోహరించి కేంద్రంపై నిధుల కోసం ఒత్తిడి చేయాల్సి ఉందని, ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయట్లేదని ఆరోపణలొస్తున్నాయి.