31 జులై వచ్చిందంటే భారతీయ మహారచయిత మున్నీ ప్రేమ్‌చంద్ గుర్తుకు వస్తారు. కేవలం ఉరుదూ, హిందీ భాషల వారికే కాదు; అన్ని భారతీయ భాషల వారికీ ఆయన గుర్తుకొస్తారు. ఎందుకంటే వారి వారి భాషల్లో ఆయన నవలో, కథో చదివే ఉంటారు. మా తరం ప్రేమ్‌చంద్ రచనలు చదువుతూ పెరిగాం. ప్రేమ్‌చంద్ పేరు మన తెలుగు రచయిత గోపీచంద్ లాగ ఉండడం వల్ల, ఈయన మరో తెలుగు రచయిత అనుకునే వాళ్ళం. చాలాకాలం వరకూ ఆయన బెంగాలీ అని తెలియదు.
రచనలు ఊహల్లోంచి, భ్రమల్లోంచి కాదు - వాస్తవాల్లోంచి, నిజాల్లోంచి వెలువడాలన్నది ఆయన రచనలు చదివిన వారికి అర్థమవుతుంది. గొప్ప గొప్ప చదువులు చదవకపోయినా, భాషా పాండిత్యం సంపాదించకపోయినా, జీవిత పాఠాల్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే మహారచయితలు కాగలరన్న విషయాన్ని ప్రేమ్‌చంద్ చెప్పకనే చెప్పారు. తల్లి ప్రేమను పొందలేక, తండ్రి నిరాదరణకు గురై, తన బాహ్య, అంతర ప్రపంచాల్లో పెనుభూతంలా పెరిగిన 'ఒంటరి తనాన్ని' పుస్తకాలతో దెబ్బ కొట్టారాయన. చిన్నప్పుడు పుస్తకాల షాపులో పనిచేయాల్సి వచ్చినా, ట్యూషన్లు చెప్పినా, ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసినా, ఎన్ని ఊర్లు మారినా, ఎక్కడ ఉన్నా పుస్తకపఠనం మానలేదు. తన ఒంటరితనాన్ని సాహిత్య పఠనంతో నింపుకునేవారు. తర్వాత కాలంలో మెల్లమెల్లగా తనూ రాయడం ప్రారంభించారు.
ప్రేమ్‌చంద్ (31 జులై 1880 - 8 అక్టోబర్ 1936) వారణాసి దగ్గర 'లంహి' అనే గ్రామంలో అజైత్ రారు, ఆనందదేవి దంపతులకు పుట్టారు. పుట్టినప్పుడు పెట్టిన పేరు ధనపత్ రారు. చిన్నప్పుడు ఊళ్లోని మదరసాలో ఉరుదూ, పర్షియన్ నేర్చుకున్నారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయినందువల్ల అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. వీరి మేనమామ ఒకాయన సరదాగా ధనపత్ రారుని 'నవాబ్' అని ముద్దుగా పిలుస్తుండేవాడు. అదే పేరుతో ఆ యువకుడు చిన్న చిన్న కథలు రాయడం ప్రారంభించాడు. నవాబ్ రారు అనే కలం పేరుతో కొంత కాలం రాసి, తర్వాత 'బాబూ నవాబ్ రారు జన్సార్' పేరుతో రాసి, చివరికి 1909లో ప్రేమ్‌చంద్' అనే కలం పేరు స్థిరపర్చుకున్నాడు. పుస్తకాల్లోంచి ప్రపంచాన్ని చదవగలిగిన నైజం, నేర్పు ప్రేమ్‌చందుకు చిన్నతనంలోనే వచ్చింది. చిన్నప్పుడు తన తల్లిని చూసిన అనుభవం, ఆమె మాట, నడవడి, దయాగుణం ఆయన తర్వాతి కాలంలో బడే ఘర్ కి బేటి' నవలలో చిత్రించాడని అంటారు. ఏ పనీ నేర్చుకోకుండా పుస్తకాల పురుగులా ఎప్పుడూ చదువుతూ కూర్చుంటున్నాడని ఆయన చిన్నాన్న కోపగిస్తుండేవాడట. ఆ చిన్నాన్న ఒక తక్కువ జాతి యువతితో చేసే ప్రేమ వ్యవహారం తన రచనలో పొందుపరిచాడనీ.. ఆరకంగా ఆయనపై కసి తీర్చుకున్నాడనీ విమర్శకులంటారు. ఏది ఏమైనా జీవితాన్ని సాహిత్యీకరించడం ఎలాగో ప్రేమ్‌చంద్‌కు తెలిసినట్టుగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. తర్వాత కాలంలో రాసిన దేవస్థాన్ రహస్య, దునియాక్ సబ్ సె అన్ మోల్ రతన్, ప్రేమాశ్రమ్ (1922), రంగభూమి (1924), నిర్మల (1925), కర్మభూమి (1931) వంటి రచనలు వందల సంఖ్యలో వెలువడ్డాయి. కొన్ని ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదమవుతూ వచ్చాయి.
తన ఎనమిదో ఏటనే తల్లి చనిపోతే, తన తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ప్రేమ్‌చందుకు సవతి తల్లి వచ్చింది. ఆమె ఆజమాయిషీతో ఇంట్లో ప్రశాంతత కరువైంది. అప్పటికే ఆయన అక్క పెండ్లయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తండ్రి ఆయన పనుల్లో ఆయన తిరుగుతుండేవాడు. ఈ బాల ధనపతితో గడిపేవారే లేరు. ఆ సమయంలో ఆయనను పుస్తకాలు ఆకర్షించాయి. అవే ఓదార్చాయి. పుస్తకాల్లోనే ఆదరణని, ప్రేమని,అనురాగాన్ని, స్నేహాన్ని వెతుక్కోసాగాడు. వాటితో ఉపశమనం పొందసాగాడు. అప్పుడే మరో సంఘటన జరిగింది. తన సవతితల్లి వైపు ధనికులైన బంధువులు వచ్చి, తమ కూతురినిచ్చి ధనపత్ రారుకి పెండ్లి చేశారు. అది 1895లో జరిగింది. అప్పుడాయన తొమ్మిదో తరగతి విద్యార్థి. వయసు 15. తీరా చూస్తే అమ్మాయే ఈయన కన్నా వయసులో పెద్దది. పైగా ధనవంతుల బిడ్డ గనక చాలా పొగరుగా ఉండేది. సవతి తల్లి ఒక వైపైతే, ఆమెతో పొట్లాడేందుకు తన భార్య రూపంలో మరో అమ్మాయి రావడంతో అ పసి హృదయం చాలా దెబ్బతింది. ఇంట్లో జరిగే గొడవల వల్ల ప్రేమ్‌చంద్ మానసికం గా కృంగిపోయాడు. తెలివైన కుర్రాడై ఉండి కూడా, మెట్రిక్యు లేషన్ ద్వితీయ శ్రేణిలో (1897) ఉత్తీర్ణుడయ్యాడు. మార్కులు సరిగా లేవని మంచి కళాశాలల్లో ఎక్కడా సీటు దొరకలేదు. ట్యూషన్లు చెపుతూ, దొరికిన పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్న రోజుల్లో నెలకు అయిదు రూపాయల వేతనంతో ఒక పాఠశాలలో టీచర్ ఉద్యోగం దొరికింది. తర్వాతి కాలంలో అలహాబాదులో ట్రెయినింగ్ పూర్తి చేసుకుని, 1905లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు.
స్వంత ఊరు లంహి వెళ్ళి హాయిగా సెలవులు గడుపుదా మనుకున్న ప్రేమ్‌చంద్‌కు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. సవతి తల్లికి, తన భార్యకూ ఏదో విషయంలో పెద్ద గొడవ జరిగింది. చికాకు పడి ప్రేమ్‌చంద్ భార్యను గట్టిగా కోపగించుకున్నాడు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. తరువాత ఉక్రోషంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. తిరిగి రాలేదు. బాల్య వివాహాల దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో ఆయన స్వయంగా అనుభవించారు. బొమ్మల పెళ్ళిళ్ళు చేసినట్టు బాల్యవివాహాలు చేసే పద్ధతి మారాలని ఆయన కోరుకున్నారు. అప్పటికి ఆయన వయసు ఇరవై అయిదు. తర్వాత కాలంలో చాలా చోట్ల ఆయన బాల్య వివాహాల ఉరించి, వితంతు వివాహాల గురించి రాస్తూ వచ్చారు.
సంస్కరణోద్యమంలో భాగంగా ఆయన 1906లో శివరాణి దేవి అనే వితంతువును మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. ఎన్ని ఒడుదొడుకులొచ్చినా ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆవిడ ఆయనను జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రేమ్‌చంద్ మరణానంతరం ఆమె తన అనుభావాలను 'ప్రేమ్‌చంద్ ఘర్ మే' అనే పుస్తకం ప్రకటించారు. అతి సామాన్యమైన జీవితం గడుపుతూ, ఉన్నతాశయాల కోసం, విలువల కోసం, దేశం కోసం ఆయన చేస్తూ వచ్చిన కార్యక్రమాలన్నీ అందులో ఆమె నమోదు చేశారు.
ప్రభుత్వ విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా ఉంటూ 1919లో ప్రేమ్‌చంద్ అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందారు. 1921లో ప్రమోషన్ పై స్కూలు ఇనిస్పెక్టరయ్యారు. జీవితం కాస్త బాగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో ఉద్యోగం వదిలి, స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకోవాలని గాంధీజీ నుంచి పిలుపు వచ్చింది. అంతే! ఉద్యోగం వదిలేసి ఉద్యమంలో చేరారు. చాలా ఇబ్బందులు పడ్డారు. గోపాల కృష్ణ గోఖలే, బాల గంగాధర తిలక్‌లను అభిమానించేవారు. కాన్‌పూర్, గోరఖ్ పూర్‌లో పని చేసిన ఆయన బతుకు దెరువు కోసం బొంబాయి వెళ్ళారు. మద్దూర్ సినిమా స్ట్రిప్టు రాశారు. కార్మిక నాయకుడిగా సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు ఢిల్లీ, లాహోరులలో విడుదలైంది. కొద్ది కాలమే నడిచినా కార్మికలోకాన్ని కదిలించింది. కార్మిక లు ఐకమత్యంగా కదిలి రావడం బ్రిటీష్ పాలకులకు నచ్చలేదు. వెంటనే ఆ చిత్రాన్ని నిషేధించారు. దేశంలో ఆ సినిమా ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. రచయితే ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోయాడు. అక్కడి పరిస్థితులకు విసిగి, ముంబైలోని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి పోయే ప్రయత్నంలో ఉండగా, బొంబే టాకీస్ అధినేత హిమాంశురామ్ ఎన్నో విధాల నచ్చజెప్పాడు. అయినా ప్రేమ్‌చంద్ వినలేదు. హిందీ సినీ పరిశ్రమకు వీడ్కోలు చెప్పారు.
రచనలు చేయడం, పత్రికలు నిర్వహించడం ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు. బాల సాహిత్యం, అనువాదాలు, జీవిత చరిత్రలు, కథలు, నవలలు 'జమానా' 'సరస్వతి' వంటి పత్రికల్లో విరివిగా రాస్తూ గడిపారు. ఇన్ని ప్రక్రియల్లో కృషి చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. ఆస్ట్రార్ వైల్డ్, గైడ్ మపాసా, లియో టాల్ స్టారు, చార్లెస్ డికెన్స్ వంటి పదిమంది విదేశీ సాహితీ దిగ్గజాల రచనలు హిందీలోకి అనువదించారు. వీరి రచనల ఆధారంగా ఆ రోజుల్లో ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు రూపొందాయి. దేశం గర్వించదగ్గ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రారు ప్రేమ్ చంద్ కథల ఆధారంగా 'సద్గతి', 'షత్రంజ్ కి కిలాడీ' అనే సినిమాలు తీశారు. రాజులు, సంస్థానాధీశులు ఏకమై బ్రిటీష్ వారిని తన్ని తగిలేయాల్సిన సమయంలో కొందరు ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో ప్రేమ్‌చంద్ ఇందులో వ్యంగ్యంగా చిత్రించారు. సత్యజిత్ రారు దాన్ని మరింత అద్భుతంగా చిత్రీకరించారు. 'ప్రేమ్‌చంద్ 'రేషన్ ' కథను మృణాల్ సేన్ 'ఒక ఊరి కథ' తెలుగుసినిమా తీశారు. ఇది సోమరిపోతులు, తాగుబోతులూ అయిన తండ్రీ కొడుకుల కథ! కొడుకు భార్య చని పోతుంది. శవ సంస్కారానికి కూడా డబ్బులుండవు. శవం మీద గుడ్డ కప్పి అందరినీ డబ్బు అడుగుతారు. కొంత డబ్బు సమకూరుతుంది. ఆ డబ్బు తీసుకుని మందు తాగడం కోసమని ఆ తండ్రీ కొడుకులు మళ్ళీ పాకకు వెళతారు. మానవీయ విలువలు నశించిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పిన కథ ఇది.
వాస్తవ జీవితాన్ని చిత్రించిన తొలి హిందీ రచయితగా ప్రేమ్‌చంద్‌కు పేరుంది. పట్టణాల్లోని మధ్య తరగతి సమస్యల్ని బాగా ఎత్తి చూపుతూ, అవినీతి, బాల్య వివాహాలు, వ్యభిచారం, పూడల్ దుర్మార్గాలు, పేదరికం, కొలోనియలిజంలపై బలమైన రచనలు చేశారు. అందుకే వాస్తవిక సృజనకారుడయ్యారు. ప్రఖ్యాత పరిశోధకుడు డేవిడ్ రూబిన్ ప్రేమ్‌చంద్ జీవితంపై 'ద వరల్డ్ ఆఫ్ ప్రేమ్‌చంద్' అనే గ్రంథం రాశారు. దాన్ని 2001లో ఆక్స్‌ఫÛర్డ్ వారు ప్రచురించారు. అందులో ఆయన ప్రేమ్‌చంద్ గురించి ఇలా అంటారు : భక్తి, మూఢ నమ్మకాలపై వచ్చే సాహిత్యం నుంచి, ప్రేమ కథా సాహిత్యం నుంచి ప్రేమ్‌చంద్ భారతీయ సాహిత్యానికి విముక్తి కలిగించారు. జన జీవన సమస్యల్ని వాస్తవిక దృక్కోణంలోంచి చిత్రించి, ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. అంతేకాదు; యూరోపియన్ మహారచయితల స్థాయికి ఎదిగారు.' ఆ మాటలు అక్షర సత్యాలు.
- డాక్టర్ దేవరాజు మహారాజు










