Jan 22,2023 11:25
  •  75 కిలోల బస్తా రూ.2,300
  • ధరలు లేక రైతుల దిగాలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గత మాసం వరకూ ఆశాజనకంగా ఉన్న నిమ్మ ధర ఒక్కసారిగా పడిపోయింది. పంట చేతికొచ్చే సమయంలో ధర పడిపోవడంతో నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్‌లో శుభకార్యాలు, మంచి ముహూర్తాలు ఉండడంతో నిమ్మకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఒకానొక దశలో కేజీ నిమ్మ ధర రూ.60 నుంచి రూ.80 వరకూ పలికింది. ప్రస్తుతం కేజీ నిమ్మ రూ.30 కూడా పలకడం లేదు. దాదాపుగా సగానికిపైగా రేటు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా నిమ్మ రైతులు సంక్రాంతి సీజన్‌లో చివరి పంటను కోస్తారు. ఈ సమయంలో ప్రతి ఏడూ నిమ్మకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటితో అప్పులు తీర్చుకుని తిరిగి పెట్టుబడులు పెట్టుకుని ఏప్రిల్‌ నాటికి పంటను సిద్ధం చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 100 నుంచి 120 బస్తాల వరకూ నిమ్మ దిగుబడి వస్తుంది. బస్తాకు 75 కిలోల నిమ్మకాయలు ఉంటాయి. నిమ్మ రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. నిమ్మ సాగుకు ఎకరం ఒక్కంటికీ ఏడాదికి రూ.60 వేల వరకూ కౌలు చెల్లించాల్సి వస్తోంది. మరో రూ.60 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. అంటే కౌలు రైతులకు దాదాపు రూ.1.20 లక్షల వరకూ ఖర్చవుతోంది. గతేడాది అకాల వర్షాలు, డిసెంబర్‌, జనవరిలో పొగమంచు కారణంగా దిగుబడి చాలా వరకూ తగ్గిపోయింది. ఎకరాకు 50 బస్తాలకు మించి దిగుబడి రావట్లేదు. ప్రస్తుతం 75 కేజీల బస్తా మార్కెట్‌లో రూ.2,300 పలుకుతోంది. అంటే కేజీ రూ.30.60 పడుతోంది. ఈ లెక్కన రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది.
తగ్గిన నిమ్మ విస్తీర్ణం
తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, సీతానగరం, కోరుకొండ, నల్లజర్ల తదితర మండలాల్లో పది వేల ఎకరాల్లో నిమ్మ సాగు జరిగేది. అకాల వర్షాలకు నిమ్మ తోటల్లో పూత పూర్తిగా రాలిపోగా, రెండేళ్లుగా కరోనా కారణంగా ఎగుమతులులేక నిమ్మ రైతులు పూర్తిగా నష్టపోయారు. ధరలు లేకపోవడం, దిగుబడులు పడిపోవటంతో అప్పులు తీర్చేందుకు పంటలు వదిలేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిమ్మ తోటలు వేసే వారు కరువయ్యారు. దీంతో, గతంలో నిమ్మను సాగు చేసిన రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లారు. దీంతో, రెండేళ్లలో మూడు వేల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రస్తుతం ఏడు వేల ఎకరాలకే పరిమితమైంది. జిల్లాలో 2,796 మంది రైతులు ఈ సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సుమారు 200 మంది దళారులు నిమ్మ దిగుబడులను కొనుగోలు చేసి ఇక్కడి నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
మార్కెట్లో డజను నిమ్మ రూ.60
మార్కెట్లో మాత్రం నిమ్మ ధర ఏ మాత్రమూ తగ్గలేదు. డజను నిమ్మకాయలు క్వాలిటీ, సైజును బట్టి రూ.50 నుంచి రూ.60 వరకూ అమ్ముతున్నారు. సాధారణ రకం నిమ్మకాయలు సైతం డజను రూ.40కి పైగానే ఉంది.
ఏటా నష్టాలే....
ఎనిమిది ఎకరాలు నిమ్మ తోటను కౌలుకు తీసుకుని చేశాను. 2019, 2020లో కరోనాతో ఎగుమతులు లేక పూర్తిగా నష్టపోయాను. 2022 ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడులు లేవు. ఈ ఏడాది ధరా లేదు, దిగుబడీ లేదు. ఎకరానికి వంద బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం మంచు కారణంగా 50 బస్తాలు మాత్రమే వస్తోంది. 75 కేజీల బస్తాకు కనీసం రూ.3,500 వస్తేనే గిట్టుబాటు అవుతుంది.
- బత్తిన రాంబాబు, నిమ్మ రైతు, చాగల్నాడు, రాజా నగరం మండలం
సాగు విస్తీర్ణం తగ్గింది

జిల్లాలో రెండేళ్లుగా నిమ్మ సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. రాజానగరం, సీతానగరం, కోరుకొండ, నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లో నిమ్మ సాగు జరుగుతోంది. నిమ్మ రైతులు క్రమంగా ఆయిల్‌ ఫామ్‌, జీడిమామిడి వంటి పంటలను సాగుకు మళ్లారు. దీనివల్లే సాగు విస్తీర్ణం తగ్గుతోంది.
- వి.రాధాకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి, తూర్పుగోదావరి జిల్లా