Aug 21,2023 20:40

ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం రామచంద్రకోటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన రైతు మాలపాటి భాస్కరరెడ్డి (46)కి 5.60 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా మిరప సాగు ప్రధానంగా ఉండేది. దాంతో పాటు కొంత భూమిలో పత్తి పంటను సాగు చేసేవారు. వర్షాభావంతో భూగర్భ జలమట్టం అందనంత లోతుకు చేరుకుంది. చాలీచాలని సాగునీటితో ఆశించిన మేర దిగుబడులు రాలేదు. ఈ క్రమంలో ప్రయివేటు వ్యక్తుల వద్ద రూ. పది లక్షలు పైన అప్పు తీసుకున్నారు. బ్యాంకుల్లోనూ అప్పు ఉంది. మొత్తం రూ.15 లక్షల వరకు అప్పు చేరుకుంది. ఈ ఏడాదైనా కలిసి వస్తుందనే ఆశతో మిరప నాటేందుకు పొలాన్ని సిద్ధం చేశారు. ముందు చేసిన అప్పు తీర్చలేకపోవడంతో తిరిగి పెట్టుబడులకు ఎవ్వరూ రుణం ఇవ్వలేదు. దీంతో భాస్కరరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సోమవారం ఉదయం తన పొలంలో పురుగు మందు తాగారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. భాస్కరరెడ్డికి భార్య వెంకటక్ష్మి, కుమార్తె పుష్పలత, కుమారుడు అశోక్‌రెడ్డి ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది. కుమారుడు డిగ్రీ పూర్తి చేశారు.