Oct 22,2023 11:47

ఉన్నావ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో గురువారం మహిళా కానిస్టేబుల్‌ మీను ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్న ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె శరీరంపై 500కుపైగా గాయాలు ఉన్నట్టు వెల్లడైంది. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మీను శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను విచారించగా మరో కొత్త విషయం బయటపడింది. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్టు వారు చెప్పారు. మీనును ప్రేమించిన అతడు ఆమెను మోసం చేసి మరో మహిళను పెళ్లాడినట్టు తెలిపారు. విషయం తెలిసిన ఆమె ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆమె శరీరంపై అన్ని గాయాలు ఎలా అయ్యాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. బహుశా ఆమె తనంత తానే గాయాలు చేసుకుని ఉంటుందని భావిస్తున్నా.. శరీరం నిండా గాయాలు చేసుకోవడం సాధ్యం కాదని కూడా చెబుతున్నారు. దీంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.