
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి(చిత్తూరు) : కబ్జా చేసిన తన భూమిని తనకు ఇప్పించాలని.. రెవిన్యూ సిబ్బంది చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్ర (32) సోమవారం ఆత్మహత్యయత్నం చేశాడు. పురుగులు మందు తాగిన చంద్రను గ్రామస్తులు గుర్తించి వెంటనే బైరెడ్డి పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ అతన్ని డాక్టర్ల పరిశీలించి అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మంజుల, కుమార్తె ధనుశ్రీ, కుమారుడు కుబేర్ ఉన్నారు. ఈ ఘటనపై చంద్ర భార్య మంజుల మాట్లాడుతూ.. కుటుంబ అవసరాల నిమిత్తం చంద్ర.. మిట్టకురపల్లి గ్రామానికి చెందిన ఏ.కష్ణమూర్తి వద్ద భూమిని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నాడని.. తీసుకున్న డబ్బు చెల్లిస్తుంటే తీసుకోకుండా కష్ణమూర్తి పాస్ బుక్ ఉంచేసుకున్నాడని.. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేనందువల్లనే చంద్ర ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలిపింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరింది.