Sep 16,2023 20:49
  • ఎపి కొబ్బరి రైతుల రాష్ట్ర సదస్సు పిలుపు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని ఎపి కొబ్బరి రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొబ్బరి రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అంబేద్కర్‌ భవనంలో కొబ్బరి రైతుల రాష్ట్ర సదస్సు శనివారం జరిగింది. కొబ్బరి రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. తొలుత మొలకలు వచ్చిన కొబ్బరికాయలతో అంబేద్కర్‌ భవనం నుంచి గోకవరం బస్టాండ్‌ వరకు కొబ్బరి రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కేశవరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొబ్బరి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం విదేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించడంతో దేశీయంగా కొబ్బరి రైతులకు సరైన ధరలు రావడం లేదన్నారు. పెరిగిన ఖర్చుల రీత్యా ఎకరాకు రూ.40 వేలకుపైగా పెట్టుబడి అవుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లింగ్‌ కొబ్బరికి క్వింటాలుకు రూ.10,860, బంతి కొబ్బరి క్వింటాలుకు రూ.11,750 ఏమాత్రమూ రైతుకు గిట్టుబాటు కాదన్నారు. కొబ్బరి రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొబ్బరి సాగయ్యే అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈ నెల 25న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఈ నెలాఖరులోపు అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద నిరసనలు తెలిపి, వినతి పత్రాలు అందించాలని సదస్సు పిలుపునిచ్చింది. బొల్లి రామకష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో తెప్పల అజరుకుమార్‌, ఆకుల హరేరామ్‌, గుర్రాల అప్పారావు, తదితరులు మాట్లాడారు.