
ప్రజాశక్తి నార్పల (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని దుగుమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దుగుమర్రి గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి (40) తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వేరుశనగ, తదితర పంటలు సాగు చేసేవారు. గత మూడేళ్లుగా పంట చేతికిరాకపోవడంతో పెట్టిన పెట్టుబడి సైతం తిరిగి రాక నష్టాల పాలయ్యారు. పంటల సాగు, కుటుంబ పోషణకు రూ.8 లక్షల వరకు అప్పులు చేశారు. ఇటీవల కాలంలో సాంబశివారెడ్డి సోదరుడు మృతి చెందడంతో సోదరుని కుటుంబ పోషణభారం కూడా ఆయనపై పడింది. దీంతో తీవ్ర ఒత్తిడితో కొద్ది రోజుల క్రితం పక్షపాతానికి గురయ్యారు. వరుస కష్టాలతో మనోవేదనకు గురైన సాంబశివారెడ్డి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. మృతుని భార్య, తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్లారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు