Jul 22,2023 20:18
  • అప్పుల బాధతో ఆత్మహత్య

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : ఆరుగాలం పండించిన జీడి పంటకు గిట్టుబాటు ధర రాక మూడేళ్లుగా చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో ఐదు రోజుల క్రితం పురుగులమందు తాగిన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన జీడి రైతు సైని సింహాచలం (60) శనివారం మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. రిమ్స్‌లో సింహాచలం బంధువులను ఆంధ్రప్రదేశ్‌ జీడిరైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు ఓదార్చారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, జీడి రైతులను ఆదుకునేందుకు ఆర్‌బికెల ద్వారా జీడి పిక్కలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సింహాచలం ఆత్మహత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణమని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, పరిశ్రమల యజమానులు నిర్ణయించిన ధరకే రైతులు జీడి పిక్కలను అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందని అన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం, జీడి పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పైగా, జీడి పరిశ్రమలను అర్థాంతరంగా మూసివేసి రైతులను, కార్మికులను రోడ్డున పడేయం దారుణమని పేర్కొన్నారు.