న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతోన్నందున వ్యాక్సిన్ కంపెనీలు సొమ్ము చేసుకోవడానికి సిద్దం అవుతున్నాయి. పెద్దల కోసం సీరమ్ ఇన్స్‌ట్యూట్ అభివృద్థి చేసిన హెటెరోలాగస్ బూస్టర్ డోస్ అయినా కోవోవాక్స్‌ను కోవిన్ పోర్టల్‌లో చేర్చడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆమోదం తెలిపారు. కోవొవాక్స్ ఒక్క డోస్ ధరను రూ.225గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి జిఎస్‌టి అదనం. కోవోవాక్స ఆమోదం కోసం మార్చి 27న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సీరమ్ ఇన్స్‌ట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ లేఖ రాశారు. ఆ తర్వాత ఈ నిర్ణయం జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కోవోవాక్స్‌కు జనవరి 16న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం తెలిపింది. తొలుత కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లకు చెందిన రెండు డోసులు తీసుకున్న వారికి ఇది బూస్టర్ డోస్‌గా పని చేయనుందని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ), అమెరికాకు చెందిన యుఎస్ ఎఫ్‌డిఎ కూడా ఆమోదం తెలిపిందని పేర్కొన్నాయి.










