May 03,2023 13:01

ఇంటర్నెట్‌డెస్క్‌ : దీర్ఘకాలికంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగులలో.. మెదడు పనితీరు అసాధారణంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (యుఎంఎస్‌ఓఎం) పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రముఖ మ్యాగ్‌జైన్‌ జర్నల్‌ న్యూరాలజీ ప్రచురించింది. కోవిడ్‌ బారినపడి కోలుకున్న కొన్ని నెలల తర్వాత.. వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా జ్ఞాపక్తి సమస్యలు మెదడుకి గాయం అయిన వారిలో తలెత్తుతాయి. కానీ కోవిడ్‌ బారిన పడిన తర్వాత చాలామంది రోగుల్లో జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తుతున్నాయని యుఎంఎస్‌ఓఎం పరిశోధన తెలిపింది. కోవిడ్‌ అనంతరం మెదడు పనితీరుపై చేసిన ఈ అధ్యయనం కచ్చితంగా నిరూపించకపోయినప్పటికీ.. కచ్చితంగా వైరస్‌ ప్రభావం నరాల పనితీరుపై పడిందని... అది రోగుల్లో వివిధ దశల్లో కనిపించిందని యుఎంఎస్‌ఓఎం పరిశోధక బృందం అంచనావేసింది. కోవిడ్‌కి గురైన ప్రతి తొమ్మిది మందిలో ఒక్కరైనా నరాల సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. కోవిడ్‌కి గురైనవారు నరాల సమస్యలతోనూ, జ్ఞాపకశక్తి సమస్యలతోనూ, ఆందోళన, నిరాశకు గురవతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. కోవిడ్‌ లేని వారికంటే.. వైరస్‌కి గురైన వారే ఆందోళన, నిరాశకు గురవుతున్నట్లు యుఎంఎస్‌ఓఎం తాజా అధ్యయనం వెల్లడించింది.