రాయబడని కావ్యాలెన్నో
పాడలేని గీతాలెన్నో
విస్మృతిలోకి జారిపోయిన
త్యాగమూర్తులెందరో ...
శిక్షలు కోరి తెచ్చుకుంటారు
దేహాలు నలుగుతున్నా సహిస్తారు
బాధల్నీ కష్టాల్నీ కౌగిలించుకుంటారు
లక్ష్యాల్ని గురి తప్పనీయరు
చరిత్రార్థులు వాళ్లు
మొక్కలు నాటారు
సీరు పోసి రక్షణ గోడలు కట్టారు
రెమ్మలు కొమ్మలవ్వడాన్నీ
పూలు కాయలవ్వడాన్నీ చూశారు
వారి గమ్యం తర్వాత తరం
పుణ్యమూర్తులు వాళ్లు
జ్ఞాన సంద్రాన్ని ఈదారు
అనుభవాల పంటను పండించారు
ముందు వెనుకలు చూసి నడిచారు
మానవీయతను ప్రేమించారు
భవిష్యత్తుకు దిక్సూచి వాళ్లు
రాబోవు తరానికి బాటలేసే
ఘన వారసత్వ సంపద అందివ్వడం వాళ్ల పని
వాళ్లు మొనగాళ్లు... వాళ్లు క్రాంతదర్శులు !
- దాట్ల దేవదానం రాజు
94401 05987










