Jan 18,2023 11:57

దేవరాపల్లి (అనకాపల్లి) : దేవరాపల్లి మండల కేంద్రంలో పేదల గుడిసెల తొలగింపు వెనుకుండి నడిపించింది ఎవరు ? అధికార పార్టీ నాయకులు చెబితే రికార్డులు మార్చేస్తారా ? అంటూ ... సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు డి.వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2021 రెవెన్యూ అధికారులు, ఇది రెవెన్యూ భూమి అంటూ ఆక్రమణదారులు వెంటనే భూమిని ఖాళీ చేయాలని బలవంతం చేశారని తెలిపారు. గుడిసెలు వేసుకున్న పేదలు హైకోర్టును అశ్రమించగా గౌరవ హైకోర్టు స్టే ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోయారని అన్నారు. రెండు సంవత్సరాల నుండి పట్టించుకోని అధికారులు, ఇప్పుడు దేవుడిమాన్యాన్ని వెంటనే ఖాళీ చేయాలని శుక్రవారం రాత్రి అర్థాంతరంగా దేవదాయశాఖ అధికారులు గుడిసెల తొలగింపుకు పాల్పడ్డారని విమర్శించారు. రెవెన్యూ భూమి దేవాదాయ భూమి ఎలా అయ్యిందని.. దేవాదాయభూమి అయినప్పుడు వారు ప్రహరీ గోడనెందుకు కట్టలేదని నేతలు ప్రశ్నించారు. అన్యాయంగా స్థలాన్ని కాజేసేందుకు గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవదాయశాఖ అధికారులు స్థలాన్ని అక్రమంగా తొలగించడానికి పూనుకోవడంతో మనస్థాపానికి గురైన బబ్బరి నాగమణి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఇప్పుడు విశాఖ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి దేవాదాయశాఖ అధికారులను బాధ్యులనుచేసి వారిపై కేసులు పేట్టాలని డిమాండ్‌ చేశారు. దేవరాపల్లిలో సంచలనంగా మారిన ఈ సంఘటన పండగ ముందు ప్లాన్‌ ప్రకారం చేయడం దుర్మర్గామన్నారు. పేదలకు గుడెసెలు వేసుకున్న చోట హక్కు కల్పించాలని నేతలు డిమాండ్‌ చేశారు.