- రాక పోకలు బంద్..
ప్రజాశక్తి-కూనవరం(అల్లూరిజిల్లా) : ముంపు మండలాలు గోదావరి వరదలకు అతలా కుతలం అవుతున్నాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు తోడు ముంపు మండలాల్లో కురుస్తున్న వర్షాలు తోడై వాగులు వంకలు పొంగి గోదావరి వరద పోటెత్తింది. రెండో ప్రమాద హెచ్చరిక వరకు వచ్చి వెనదిరిగిన గోదావరి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి 50 అడుగులుగా కొనసాగింది. ఇప్పటికీ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు మాత్రమే పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు.
రాక పోకలు బంద్..

భద్రాచలం నుండి కూనవరం ప్రధాన రహదారిలో మురుమూరు వద్ద నీళ్లు చేరడంతో రాకపోకలు బందయ్యాయి. ఇటు కూనవరం నుండి చింతూరు వెళ్లే రహదారికూడా నీళ్లు చేరడంతో కూనవరం మండలానికి భాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ సమయంలో భద్రాచలం వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం కోతుల గుట్ట నుండి ఏడుగురాళ్ల పల్లి రహదారి మాత్రమే. కానీ ఆ రహదారి వైపు వెళ్లాలంటే నరకాయతన పడాల్సిందే. గత ఏడాది కూనవరం, వి.ఆర్ పురం ప్రజలు తమ అవసరాలకు ఆ నరకం లోనే పయనించి తమ అవసరాలు తీర్చుకున్నారు. ఆ తరువాత రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నో మార్లు మెమోరాండం ప్రభుత్వానికి, అధికార్లకు తెలియ జేసి పత్రికా ప్రకటనల్లో ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ బాధలు తప్పవని మండల ప్రజలు వాపోతున్నారు.
మళ్ళీ మొదలైన వలసలు..
మొన్నటి వరకు వస్తూ పోతూ ఉన్న గోదావరికి మండలంలో రెండు కాలనీలు మాత్రమే పునరావాస కేంద్రాలకు వెళ్లారు. గురువారం మధ్యాహ్ననికి 50 అడుగులుగా ఉండడంతో కూనవరం, టేకులబోరు గ్రామాల ప్రజలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు, ప్రత్యేకంగా గోదావరి వరదలకి తీసుకున్న ఇళ్లకు తరలి వెళ్లారు.










