ప్రజాశక్తి - వేంపల్లె (కడప) : రాయలసీమ ప్రాంత ప్రజలకు నవ మోసాలు చేసిన బిజెపి, వైసిపి, టిడిపి పార్టీలకు రాబోవు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వేంపల్లెలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సమన్వయ కమిటీ కన్వీనర్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి హజరైయ్యారు. ఈసందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం జగన్, చంద్రబాబు రాయలసీమ ద్రోహులు అన్నారు. ఈ ముగ్గురి పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగినట్లు చెప్పారు. సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి అమలు చేయలేదని మండిపడ్డారు. కడప జిల్లాలో సెయిల్ ఆధర్వయంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదని తెలిపారు. దుగరాజట్నం ఓడరేవు ఉసే లేదని విమర్శించారు. మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టు మూతపడిందని చెప్పారు. కడప - మదనపల్లి - బెంగళూరు నూతన రైలు మార్గం పనులు నిలిచిపోయినట్లు చెప్పారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు కాలేదని అన్నారు. రాజధాని, హైకోర్టులలో ఒకటి కూడా రాయలసీమకు రాలేదని చెప్పారు. తెలుగుగంగ, గాలేరు- నగరి, హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టులు నత్త నడకన సాగుతున్నాయాని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపైన అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ సాగునీటి ప్రాజెక్టులను కూడ అడ్డుకోవడం లేదని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో రాష్ట్రానికి, రాయలసీమకు ద్రోహం చేస్తున్న దుష్టత్రయ పార్టీలైన బిజెపి, వైసిపి, టిడిపిలను చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసిరెడ్డి ప్రజలను కోరారు. అనంతరం సమన్వయ కమిటీ కన్వీనర్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీబలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త గట్టి కృషి చేయాలని కోరారు. పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆదేశాలు మేరకు ప్రతి నియోజకవర్గంలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు చెప్పారు. వైసిపి ప్రభుత్వం చేపట్టే ఆరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో అసమర్థత పాలన కొనసాగుతున్నట్లు చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం పాలనలోనే ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ విజయం కోసం పని చేయాలని చెప్పారు. ఈకార్యక్రమంలో సమన్వయ కమిటి సభ్యులు ధృవకుమార్ రెడ్డి, రామకృష్ణ, అమర్, ఉత్తన్న, నరసింహారెడ్డి, తిరుపాల్ రెడ్డి, శ్రీకాంత్, మహేంద్ర, మధు, సుబ్రమణ్యం, బాలం సుబ్బరాయుడు పాల్గొన్నారు.










