
- వరదల్లో దెబ్బతిన్న ఇళ్లు
- ముంపు గ్రామాల్లో ఎటుచూసినా బురదే
ప్రజాశక్తి- విఆర్.పురం (అల్లూరి జిల్లా) : వరదలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంపు మండలాలవాసుల గృహాల్లో చాలా వరకు దెబ్బతిన్నాయి. నిన్నటి వరకూ వరద భయంతో గుట్టలపైనా, పునరావాస కేంద్రాల్లోనూ తలదాచుకున్న వారంతా వరద తగ్గడంతో తమ గూడేలకు వచ్చి అక్కడి పరిస్థితిని చూసి బోరుమన్నారు. కూలిన పాకలు, బీటలు వారిన గోడలు, బురదలో చెల్లాచెదురుగా పడి ఉన్న గృహోపకరణాలను చూసి లోలోపల కుమిలిపోతున్నారు. ప్రస్తుతం గోదావరి, శబరి నదుల వరద తగ్గడంతో విఆర్.పురం మండలంలోని వడ్డిగూడెం, ధర్మతాలగూడెం, రాజుపేట, వడ్డుగూడెం కాలనీల ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు. ఏడెనిమిది రోజుల క్రితం వీరంతా వరద హెచ్చరికల నేపథ్యంలో పరుగు పరుగున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మోయగలిగిన సామాన్లు మాత్రమే వారి వెంట తీసుకెళ్లారు. పరిస్థితి కాసింత చక్కబడిందని భావించి ఇప్పుడు వారంతా ఇళ్ల వచ్చారు. ఎక్కడ చూసినా బురద మేటలే కనిపించాయి. పశువుల పాకలు నేలమట్టమయ్యాయి. బురదను తొలగించేందుకే రూ.10 వేలు నుంచి రూ.60 వేలు వరకూ ఖర్చవుతుందని, తామంత ఖర్చు పెట్టే స్థితిలో లేమని పలువురు బాధితులు వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. చేతిపంపుల్లో బురద నీరే వస్తోందని, తాగుదామన్నా శుభ్రమైన నీరు లేదని ఆవేదన చెందారు. పంటలకూ నష్టం వాటిల్లింది. వడ్డిగూడెం ప్రజలు దొండ తోటలు వేశారు. ఒక్కో కుటుంబం వీటి సాగుకు అధికంగానే ఖర్చు చేసింది. ఒక్కో సాగుదారునికీ కనీసం రూ.60 వేల మేర నష్టం వాటిల్లింది. చింతూరు మండలం కుమ్మూరు, మల్లెతోట, ఎజి.కోడేరుల్లోనూ, కూనవరం మండలం ఉదరుభాస్కర్ కాలనీ, కూనవరం గ్రామాల్లోనూ నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది.
సామాన్లు కొట్టుకుపోయాయి : కాపారపు మురళి, వడ్డుగూడెం

వరదకు ఇంట్లో సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. రూ.50 వేల వరకూ నష్టం వాటిల్లింది. చేతికొచ్చేవేళ.. దొండ తోట వరద పాలైంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి : కారం బుచ్చమ్మ, రామవరం సర్పంచ్
ఊహించని నష్టం జరిగింది. ఇళ్లన్నీ దెబ్బతిన్నాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. పోలవరం ముంపు గ్రామాలన్నింటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి, శాశ్వత పునరావాసం కల్పించాలి.
నష్టపరిహారం అందించాలి : కారం లక్ష్మి, సిపిఎం ఎంపిపి, విఆర్.పురం మండలం

వరద ప్రభావం దాదాపు అన్ని గ్రామాలపైనా ఉంది. ఇళ్లు దెబ్బతిన్నాయి. పంటలకు నష్టం వాటిల్లింది. రామవరం పంచాయతీలోని రామవరం, సోపల్లి, అడవి వెంకన్నగూడెం జనం అంతా సహాయక కేంద్రాల్లో పది రోజులుగా చిమ్మచీకట్లో గడిపారు. వరద తగ్గడంతో ఇంటికి వచ్చి చూస్తే గుండె తరుక్కుపోయింది. కొన్ని గృహాలు పడిపోయి కనిపించాయి. పోయిన వరదల కన్నా ఈసారి వచ్చిన వరదలకు ఒండ్రు ఎక్కువగా కొట్టుకొచ్చింది. ఈ బురద తొలగించడం చాలా కష్టంతో కూడుకున్నది. ప్రభుత్వమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి
గోడలు ఒరిగిపోయాయి : కోట్ల సత్యనారాయణ, వడ్డుగూడెం కాలనీ, విఆర్.పురం మండలం

వరద పెరుగుతోందని అధికారులు చెప్పడంతో వారం రోజుల క్రితం హడావుడిగా పునరావాస కేంద్రానికి వెళ్లాం. ఇప్పుడు వచ్చి చూస్తే ఇది మా ఇల్లేనా అన్న అనుమానం కలిగేలా ఉంది. అడుగుమేర బురద పేరుకుపోయి ఉంది. గోడలు ఒరిగిపోయాయి. ఇంటిని శుభ్రం చేయడానికి రూ.10 వేలకుపైగానే ఖర్చు అవుతుంది. అంత డబ్బు లేకపోవడంతో మేమే కష్టపడి శుభ్రం చేసుకుంటున్నాం. పునరావాస కేంద్రానికి తీసుకెళ్లిన సామాన్లను వాహనంలో తిరిగి మా ఇంటికి తెచ్చుకోవడానికి రూ.4 వేలు అవుతుంది. ఇన్ని డబ్బులు మాకెక్కడివి. ప్రభుత్వమే ఆదుకోవాలి.