Jan 30,2023 08:07

ఏ తోడేళ్లు మమ్మల్ని కొండమేకల్నిజేసీ
వెంటాడుతున్నాయి ?
ఏ పెద్దపులులు మమ్మల్ని అడవి జింకల్ని జేసీ
వేటాడుతున్నాయి ?
ఏ గండభేరుండాల రెక్కలల్లార్పుకు
మా కాళ్ల కింద నేల కదలబారుతోంది?
పొగబెట్టి పట్టునుండి తేనేటీగల్ని తరిమినట్టు
పుట్టి పెరిగిన నేలమీంచి
మమ్మల్ని తరుమిగొడుతున్నదెవరు?
తరాల పురిటి జ్ఞాపకాలు తలకెత్తుకొని
ఉభికే దుఃఖాన్ని ఉగ్గబట్టుకొనీ
యీ పచ్చనికొండలమీంచి ఎక్కడికని పొమ్మంటారు?
బొందిలో ప్రాణాలు యిక్కడే విడచి
నడచే శవాలమై ..
చితిలోంచి లేచే పొగమేఘాలమై ..
దిక్కులపట్టి ఎక్కడికని ఎగిరిపొమ్మంటారు ?

నెపం అభివృద్ధి మీదపెట్టి
అడవికి మమ్మల్ని దూరంజేస్తున్న వాడెవడో
వాడి అభివృద్ధి మీద మన్నుబడ ..
వాడి హైడ్రో పవర్‌ ప్రాజక్టులు ఆవిరైపోనూ ..
మా పీసాచట్టం పీక పిసికేసాక ..
మా ఐదవషెడ్యూల్‌ అటవీచట్టాల్ని అడుగేసి మట్టేసాక ..
కాట్లో కొరివిలా మండుతోందివాల కొయ్యూరు
చింతనిప్పులు చెరుగుతోంది చింతపల్లి
బందూకుల మధ్య బందీయైపోయింది గొందిపాకల
చావుశంఖం పూరిస్తోంది సమగిరి
ఎర్రిచూపులు చూస్తోంది ఎర్రవరం
అల్లకల్లోలమైపోతోందివాల అల్లూరి జిల్లా
యిది ఆదివాసీ చేసే ఆకలి పోరాటం
చచ్చిన పక్షిరెక్కలా కాలిపోయిన పోడు వదిలి
దుఃఖమంతా ఒకచోట పోగేసినట్టున్న గూడువదిలి
పిల్లాజెల్లా లొల్లూడి కట్టుకొనీ ..
గొడ్డూగోదా వెంటబెట్టుకొనీ ఎక్కడికని పొమ్మంటారు?

ఏడ్చి ఏడ్చీ కంటిచెరువులో యింకిపోయాయి నీళ్లు
చిగురాకుల్లా స్వచ్ఛంగా బతికిన వాళ్లం
ఎండుటాకులైరాలి ధూళిధూసర దేహాలతో
కార్పోరేట్‌ పెనుగాలికి కొట్టుకుపోతున్నాం
వనాల్లో బతికిన వాళ్లం నాగరిక జనాల్లో ఎలా బతుకుతాం?
బతుకుదారి తప్పిన బెదురు జింకలమై
పట్నం పరాయిపంచన ఎలా గడుపుతాం?
తలచుకుంటేనే .. భరించలేని గుండెకోత
అయినా తప్పదీ బతుకునదిలో ఎదురీత !

అయినా ఎన్నాళ్లిలా?
మీరు తరిమిగొడుతుంటే మేం బెదిరిపోయేదిక చాలు
ఎవడెవడోవచ్చి ఎవడెవడికో అప్పనంగా కట్టబెట్టేందుకు
అడవి మీ యబ్బసొత్తు కాదు
మా తరాల మూలవాసుల జన్మహక్కు
మేం అడవిబిడ్డలం .. అల్లూరి వారసులం ..
తూరుపు దిక్కున ఎగిసే పోరుమంటలం ..
మా అస్థిత్వం పేరు అడవి ..
మా తెగువ పేరు పోరాటం ...

(అల్లూరి జిల్లా ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజక్ట్‌కు నిరసనగా ..)
- సిరికి స్వామినాయుడు