
వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి తొమ్మిది విజయాలు
ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నయా చరిత్ర లిఖించింది. ఆదివారం నెదర్లాండ్స్‌పై 160పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా ఈ టోర్నీలో వరుస విజయాల సంఖ్య 9కి చేరింది. దీంతో టీమిండియా 2003లో వరుసగా నెగ్గిన విజయాల సంఖ్య 8ను బ్రేక్ చేసి నయా చరిత్ర సృష్టించింది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా 2007, 2003లో వరుసగా 11 మ్యాచుల్లో నెగ్గిన రికార్డు దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారతజట్టు గ్రూప్ స్టేజ్‌లో ఆడిన 9 మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో గెలిచి అపజయమే లేని జట్టుగా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 160 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 411పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. బౌలింగ్‌లో కూడా రాణించి తొమ్మిదో విజయాన్ని నమోదుచేసుకుంది. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్‌లో లీగ్ దశ పోటీలు ముగిశాయి. నవంబర్ 15 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత్ నిర్దేశించిన 411 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్‌కు గెలుపు మీద ఆశలేమీ లేకున్నా బ్యాటింగ్‌కు అనుకూలించే బెంగళూరు పిచ్‌పై కాస్త ప్రతిఘటించింది. ఓపెనర్ వెస్లీ బరెసి (4)ని సిరాజ్ రెండో ఓవర్లోనే ఔట్ చేశాడు. మరో ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (30), కొలిన్ అకర్‌మన్ (35) లు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అయితే అకర్‌మన్‌ను కుల్‌దీప్ ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జడ్డూ.. ఓడౌడ్‌ను పెవిలియన్ కు పంపాడు. 72కే మూడు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ ను సిబ్రండ్.. (80 బంతుల్లో 45) కాస్త ప్రతిఘటించాడు. ఎడ్వర్డ్స్ (17) తో కలిసి కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే కోహ్లీ.. ఎడ్వర్డ్స్ వికెట్ తీసి డచ్ టీమ్‌కు భారీ షాకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఆంధ్రా మూలాలున్న తేజ నిడమనూరు (39 బంతుల్లో 54, 1 ఫోర్, 6 సిక్సర్లు) ఒక్కడే కాస్త రాణించాడు. అర్థ సెంచరీ పూర్తిచేసిన అతడిని రోహిత్ శర్మ 48వ ఓవర్లో ఔట్ చేయడంతో నెదర్లాండ్స్ కథ ముగిసింది.
తొమ్మిది మంది బౌలర్లతో తొలిసారి...
ఈ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. వన్డే వరల్డ్ కప్‌లో ఒక జట్టు 9 మంది బౌలర్లను వాడటం ఇది మూడోసారి మాత్రమే. గతంలో 1987లో ఇంగ్లండ్.. శ్రీలంక మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 9 మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. 1992లో న్యూజిలాండ్.. పాకిస్తాన్‌పై 9 మందితో బౌలింగ్ వేయించింది. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో భారత్.. ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 2003, 2007లలో వరుసగా 11 మ్యాచ్‌లలో గెలిచింది. ఆ తర్వాత 9 విజయాలతో (ఈ వరల్డ్ కప్‌లో) భారత్ ఉంది. 2003లో భారత్.. వరుసగా 8 మ్యాచ్‌లు గెలుచుకుంది.
సెమీఫైనల్స్ వర్షంతో రద్దయితే..
బుధవారం వాంఖెడేలో వర్షం పడే అవకాశాలు లేకున్నా ఒకవేళ ప్రకఅతి ప్రతాపం చూపిస్తే మాత్రం నాకౌట్ మ్యాచ్‌ల (రెండు సెమీస్, ఒక ఫైనల్)కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ బుధవారం వర్షం కారణంగా ఆట సాగకపోయినా గురువారం మ్యాచ్ నిర్వహిస్తారు. గురువారం కూడా ఆట సాధ్యం కాకుంటే మాత్రం పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. అలా జరిగితే భారత్‌కే ఫైనల్ చేరే అవకాశాలుంటాయి. లీగ్ దశలో ఆడిన తొమ్మిదింటిలో తొమ్మిది గెలిచిన భారత్.. 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 9 మ్యాచ్‌లలో ఐదు మాత్రమే గెలిచిన కివీస్‌కు 10 పాయింట్లున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా ఈ రెండు జట్ల మధ్యే తొలి సెమీస్ జరిగింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కు మారిన ఆ మ్యాచ్‌లో పలితం భారత్‌కు అనుకూలంగా రాలేదు.